
పెళ్లింట్లో చావు డప్పు
నాలుగు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు ఊహించనిరీతిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతిచెందడంతో పెళ్లింట్లో.....
► రోడ్డు ప్రమాదంలో గాయపడిన వరుడి మృతి
► ఏడునూతులతో విషాద ఛాయలు
కొడకండ్ల : నాలుగు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు ఊహించనిరీతిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతిచెందడంతో పెళ్లింట్లో విషాదం అలుముకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గజ్జెల సోమయ్య, కనకమ్మ దంపతుల రెండో కుమారుడు ప్రభాకర్ అలియాస్ వేణు గత మూడేళ్లుగా గ్రామంలో విద్యుత్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 29న గంట్లకుంట గ్రామానికి చెందిన అమ్మాయితో అతడి వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే అతడు ఆదివారం బైక్‌పై స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాంతంలో బంధువులకు శుభలేఖలు పంచేందుకు వెళ్లాడు. మార్గమధ్యలో స్టేషన్ పెండ్యాల సమీపంలో కారు ఢీకొనడంతో ప్రభాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని 108లో వరంగల్‌కు తరలించారు.
పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించగా చికిత్సపొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉంటూ విద్యుత్ సమస్యల పరిష్కరించే వ్యక్తి మరో నాలుగు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సింది పోయి కానరాని లోకాలు వెళ్లడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం ఇంటికి తీసుకురాగా గ్రామస్థులు, మండల విద్యుత్ సిబ్బంది పెద్ద సంఖ్యలో తరలివచ్చి కంటతడి పెట్టారు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావుడప్పు కొట్టాల్సిన దుస్థితి రావడంతో గ్రామస్తులు తీవ్ర విచారంలో మునిగారు.