నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. | The government will release funds for family planning operations | Sakshi
Sakshi News home page

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..

Oct 17 2014 12:03 AM | Updated on Mar 21 2019 8:35 PM

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. - Sakshi

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..

‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’’ అంటూ రెండు దశాబ్దాల క్రితం ఓ సినీ కవి అన్న పలుకులు నేటికీ అక్షర సత్యాలేనని నిరూపిస్తున్నారు మన వైద్య శాఖ అధికారులు.

‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’’ అంటూ రెండు దశాబ్దాల క్రితం ఓ సినీ కవి అన్న పలుకులు నేటికీ అక్షర సత్యాలేనని నిరూపిస్తున్నారు మన వైద్య శాఖ అధికారులు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆస్పత్రులకు అందమైన భవనాలు కడతారు కానీ, అందులో రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతారు. అందుకు ఈ చిత్రమే చక్కని నిదర్శనం. గురువారం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో 61 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేశారు. అనంతరం ఇలా నేలపైనే పడుకోబెట్టారు. ఇదేమని అడిగితే వారిపైనే గుర్రుమన్నారు. ఆస్పత్రిలో సేవల తీరును మెరుగు పరచాలని కలెక్టర్ మూడు రోజుల క్రితమే ఆదేశించారు. అయినా వారు మారడం లేదు..
 
నిజామాబాద్ అర్బన్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయించుకున్న మహిళలకు అవస్థలు తప్పడంలేదు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనే ఈ దుస్థితి నెలకొంది. ఇక్కడ ప్రతి గురువారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారు. గురువారం 61 మంది మహిళలకు ఆపరేషన్లు చేశారు. వీరికి కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఆపరేషన్ అనంతరం నేలపైనే పడుకోబెట్టారు. ఫ్యాన్‌లు లేక మహిళలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. సౌకర్యాలపై ప్రశ్నిస్తే ఉంటారా! ఇంటికి వెళ్తారా? అంటూ వైద్య సిబ్బంది గద్దించారని పలువు రు పేర్కొన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కావలసిన ఆపరేషన్లు మధ్యాహ్నం 12 గంటల వరకు మొదలు కాలేదు. ఆపరేషన్ల కోసం వచ్చిన మహిళలు ఉదయం ఆరు గంటల నుంచే ఎలాంటి ఆహార పదార్థాలు, నీరు తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోయారు. వైద్యుల ఆలస్యంతో ఆపరేషన్లు చేయడంలో జాప్యం జరిగింది. నిబంధనల ప్రకారం ఉదయం 8గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12గంటల వరకు అపరేషన్లను ముగించాల్సి ఉంటుంది.

నిధులు ఏమవుతున్నట్లు ?
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు సంబంధించి ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. శిబిరంలో నీటి వసతి, భోజన వసతి, ఉదయం పూట టిఫిన్ ఆపరేషన్ చేసే వైద్యుడికి రాను పోను చార్జీలు, టెంట్ వసతి కల్పిస్తారు. ఒక రోజు ముందు జిల్లా వైద్యాధికారి నిధులను మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఎక్కడ కూడా ఈ పరిస్థితి కనిపించడం లేదు. కేవలం ఆస్పత్రిలో వైద్య శిబిరం నిర్వహిస్తూ, ఆపరేషన్‌ల అనంతరం మహిళలను నేలపై పడుకోబెట్టి ఇంటికి పంపిస్తున్నారు. ఈ ఆ పరేషన్ల శిబిరాలకు సంబంధించిన నిధులు మాత్రం సక్రమంగా వినియోగం కావడం లేదు.

జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిలో 14 డీపీఎల్ కేంద్రాలు (కు.ని.ఆపరేషన్లు జరిగే ఆస్పత్రులు) ఉన్నాయి. వీటిలోనూ మహిళలకు ఆపరేషన్‌ల సందర్భంగా అవసరమైన  సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి గోవింద్‌వాగ్మరేను సంప్రదించగా ఆయన స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement