‘వేరే’ ఎంసెట్! | Tests conducted separate Telangana government specification | Sakshi
Sakshi News home page

‘వేరే’ ఎంసెట్!

Dec 15 2014 3:11 AM | Updated on Apr 7 2019 4:30 PM

‘వేరే’ ఎంసెట్! - Sakshi

‘వేరే’ ఎంసెట్!

ఉమ్మడి ఇంటర్‌మీడియెట్ పరీక్షలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం ఇపుడు ఎంసెట్‌పైనా నెలకొంటోంది.

  • పరీక్షలను వేరుగా నిర్వహిస్తామని తెలంగాణ సర్కారు స్పష్టీకరణ
  •  కాలేజీల్లో 15 శాతం సీట్లు ఓపెన్ కోటాలో భర్తీ చేస్తామంటున్న వైనం
  •  ఉమ్మడి ఎంసెట్ కోసం తెలంగాణ అంగీకారం కోరుతామన్న ఏపీ మంత్రి
  • సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఇంటర్‌మీడియెట్ పరీక్షలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం ఇపుడు ఎంసెట్‌పైనా నెలకొంటోం ది. ఇంటర్‌మీడియెట్ పరీక్షలను వేరుగా నిర్వహించుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం.. ఎంసెట్‌నూ వేరేగానే నిర్వహించుకుంటామని చెప్తుండటంతో ఏపీ అధికారులు తలపట్టుకుంటున్నారు.

    ఇంటర్ పరీక్షలు వేరుగా జరుగుతున్నా ఎంసెట్ ఉమ్మడిగానే నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని గవర్నర్ ఇటీవల ఢిల్లీలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ప్రకారం ఏపీ ఉన్నత విద్యామండలి ఉమ్మడి ఎంసెట్ షెడ్యూల్‌పై కసరత్తు చేపట్టింది. అయితే తెలంగాణ నుంచి మాత్రం ఉమ్మ డి ఎంసెట్‌కు సానుకూలత వ్యక్తంకాలేదని తెలుస్తోంది. ఇంటర్‌మీడియెట్ మాదిరిగానే ఎంసెట్‌తో సహా అన్ని సెట్లనూ తాము వేరుగానే నిర్వహిస్తామని స్పష్టంచేసినట్లు చెప్తున్నారు.

    ఉన్నత విద్యను పదో షెడ్యూల్‌లో చేర్చినందున ఉమ్మడిగానే ఎంసెట్ పరీక్షలు ఉండాలని ఏపీ వాదిస్తు న్నా దానికి తెలంగాణ ససేమిరా అంటోంది. చట్టంలో పరీక్షలు ఉమ్మడిగా ఉండాలన్న నిబం ధన లేదని వాదిస్తోంది. తమ రాష్ట్ర పరీక్షలు తామే నిర్వహించుకుంటామని, కాలేజీల్లోని 15 శాతం సీట్లు ఓపెన్ కోటాలో భర్తీచేస్తామని చెప్తోంది.

    ఈ విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించి తాను వేరేగా నిర్వహిస్తామని పట్టుబట్టడం, చివరకు వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం విదితమే. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీ ఉన్నత విద్యామండలే ఈ కౌన్సెలింగ్‌ను నిర్వహించాల్సి ఉన్నా తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలో తాను నేరుగా ఆ కార్యక్రమాన్ని చేపట్టకుండా ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీని ఏర్పాటుచేసి ముగించింది.

    ఇప్పుడూ ఎంసెట్‌పై అదేరకమైన అభ్యంతరాలు వస్తుండడంతో ప్రకటన విడుదల విషయంలో సందిగ్ధంలో పడింది. దీనిపై ప్రభుత్వాల నుంచి స్పష్టమైన వైఖరి వచ్చాక తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ‘‘ఇంటర్‌మీడియెట్ మాదిరిగానే ఉమ్మడి ఎంసెట్‌పైనా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు పెట్టేలా కనిపిస్తోంది. విద్యార్థులకు జరిగే నష్టాన్ని వారికి మరోసారి వివరించి ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహించడానికి అంగీకరించాలని కోరుతాం’’ అని  మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement