ఆలయాలే టార్గెట్‌

temple are the only target - Sakshi

పట్టుబడిన ఇద్దరు బాల నేరస్తులు

వెండి, బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం

వివరాలు వెల్లడించిన  డీఎస్పీ ఎల్‌సీ నాయక్‌

కల్వకుర్తి: వాళ్లిద్దరూ ఇంటర్‌ వరకు చదివి మధ్యలోనే మానేశారు. చెడు వ్యసనాలకు బానిసలుగా మారడంతో అవసరాలు తీర్చుకునేందుకు చోరీల బాట పట్టారు. ప్రధానంగా దేవాలయాలను టార్గెట్‌ చేసుకుని విలువైన మూర్తులు, హుండీలను ఎత్తుకెళ్లేవారు. గత రెండేళ్లుగా వారి ఖాతాలో 12 కేసులు నమోదయ్యాయి. పోలీసులు వారిపై గట్టి నిఘా పెట్టడంతో ఇట్టే దొరికిపోయారు.
  
అనుమానాస్పదంగా తిరుగుతూ..  
వంగూరు మండలానికి చెందిన ఇద్దరు బాలనేరస్తులు రెండేళ్లుగా డివిజన్‌ పరిధిలోని కల్వకుర్తి, వంగూరు, చారకొంండ మండలాల్లోని ప్రముఖ దేవాలయాల్లోని హుండీలు, బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లి తప్పించుకుని తిరుగుతున్నారు. వీరిపై మూడు మండలాల  ఎస్‌ఐలు నిఘా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా సోమవారం సాయంత్రం చారకొండ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా తుర్కలపల్లి గ్రామానికి చెందిన శ్రీను, రామకోటి గమనించి చారకొండ ఎస్‌ఐ పోచయ్యకు ఇద్దరు బాలలు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్‌ఐ చాకచక్యంగా వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేపట్టగా చోరీల విషయం బయటపడింది.
 
చోరీ సొత్తు స్వాధీనం 
కల్వకుర్తి, కుర్మిద్ద శివాలయం, చారకొంండలోని చారగట్ల మైసమ్మ ఆలయంతోపాటు పలు దేవాలయాల్లో చోరీలకు పాల్పడి ఎత్తుకెళ్లిన 32 తులాల వెండి, మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.27,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ మైనర్లు కావడంతో జిల్లా కేంద్రంలోని బాలనేరస్తుల జైలుకు తరలించారు.  
 
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 
దేవాలయాలు, మసీదులు, చర్చిలు లాంటి ప్రార్థనా మందిరాల్లో చోరీలు జరిగితే అవి ఇతర సంఘటనలకు దారితీసే అవకాశాలుంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానితులను గుర్తిస్తే చోరీలు తగ్గే అవకాశం ఉంటుందని డీఎస్పీ ఎల్‌సీ నాయక్‌ తెలిపారు. దేవాలయ కమిటీ నిర్వాహకులు పరిరక్షణ చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలను అమర్చుకోవాలని కోరారు. ఈ కేసును ఛేదించిన వారిని ఎస్పీ అభినందించారని తెలిపారు. సమావేశంలో కల్వకుర్తి సీఐ శ్రీనివాసరావు, వెల్దండ సీఐ గిరికుమార్, ఎస్‌ఐలు రాఘవేందర్‌రెడ్డి, పోచయ్య, శ్రీనువాసులు ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top