విభజనపై సందిగ్ధం..! | Telangana Zilla Parishad Division Problems | Sakshi
Sakshi News home page

విభజనపై సందిగ్ధం..!

Jun 15 2019 8:34 AM | Updated on Jun 15 2019 8:34 AM

Telangana Zilla Parishad Division Problems - Sakshi

కరీంనగర్‌ జెడ్పీ భవనం

కరీంనగర్‌: జిల్లా, మండల ప్రజా పరిషత్‌ ఎన్నికలు ముగిశాయి. కొత్త పాలకవర్గం ఎన్నిక పూర్తయ్యింది. మరో 20 రోజుల్లో కొలువుదీరడమే మిగిలింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలు నాలుగు జిల్లాల్లోనూ పల్లె ఓటర్లను తమవైపు తిప్పుకొని పాలకవర్గాలను ‘కారు’ ఎక్కించిన విషయం విదితమే. నాలుగు జిల్లాల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో గెలుపొందడం, చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్, కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకపక్షంగా జరిగి నాలుగు జిల్లా పరిషత్‌లను తమ ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. గత మూడు నెలలుగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు. ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్, లెక్కింపు, జిల్లా పరిషత్, మండల పరిషత్‌ పాలక వర్గాల ఎంపిక ప్రక్రియలో జెడ్పీ అధికారులు తలమునకలు అయ్యారు. ఇక కొత్తపాలక  వర్గాలు కొలువుదీరేందుకు అవసరమైన జిల్లా పరిషత్‌ కొత్త భవనాలు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఉద్యోగుల పదోన్నతులు చేపడుతారా.. లేదా వర్క్‌ టు సర్వ్‌ కింద ఉన్న సిబ్బందినే ఆయా జిల్లాలకు విభజిస్తారా అనేది తేలాల్సి ఉంది.

జిల్లా పరిషత్‌ల ఏర్పాటుపై పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నుంచి ఇంకా పూర్తిస్థాయి మార్గదర్శకాలు అందలేదు. నాలుగు జిల్లాలకు నోడల్‌ జెడ్పీగా ఉన్న కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ పరిధిలోని ఉద్యోగుల వివరాలు కేడర్ల వారీగా, మౌలిక సదుపాయాలు, సామగ్రి వివరాలను రెండు నెలల క్రితమే పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడి సిబ్బంది నివేదించారు. కరీంనగర్‌ జెడ్పీలో 80 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. ఈ సిబ్బందినే నాలుగు జిల్లాలకు విభజించే ఆస్కారం ఉంది. ఇటీవల వెలువడిన ఆదేశాల ప్రకారం జెడ్పీలోని కొన్ని విభాగాలను కుదించే అవకాశం కూడా లేకపోలేదు. మరికొన్ని పోస్టులను తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒక్కో జిల్లా పరిషత్‌కు 19 మంది సిబ్బంది అవసరం, సీఈవో, డిప్యూటీ సీఈవో, రెండు సూపరింటెండెంట్‌ పోస్టులు, ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్‌ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు, ఆరుగురు ఆఫీస్‌ సబార్డినేట్లు ఇలా మొత్తం ఒక్క జెడ్పీలో ఎంత తక్కువ అన్న కనీసం 19 మంది ఉంటేనే పాలన సవ్యంగా కొనసాగించే వీలుంటుంది.

ప్రస్తుతం జెడ్పీ పరిధిలో 80 మంది ఉద్యోగులను విభజించే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల జెడ్పీలకు లైజన్‌ అధికారులతోపాటు ఒక్కొక్క జిల్లాకు ఆరుగురి వరకు సిబ్బందిని ఎన్నికల విధుల నిమిత్తం రిలీవ్‌ చేశారు. ఎన్నికల అనంతరం ఆయా సిబ్బంది మళ్లీ జెడ్పీలో నివేదించారు. కొత్త జిల్లాల్లో సిబ్బందిని పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా పదోన్నతులు కల్పించి బదిలీ చేస్తారా లేదా సర్వ్‌ టు రూల్‌ కింద ఆయా జిల్లాల కలెక్టర్లే ఈ సిబ్బందిని కేటాయిస్తారా అన్న దానిపై జిల్లా పరిషత్‌ ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. జిల్లా పరిషత్‌ పరిధిలో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ఫ్యాన్లు, జిరాక్స్‌ మిషన్లు, తదితర సామగ్రి సమాచారం సైతం పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు ఇప్పటికే చేరింది.

కొత్త మండల పరిషత్‌లకు  కనీసం పది మంది...
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడ్డ మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క మండలానికి కనీసం పది మంది సిబ్బంది అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను విభజించి ఒక్కొక్క మండల పరిషత్‌కు మిగతా మండలాల నుంచి పది మంది ఉద్యోగులను నియమిస్తే పాలనసాఫీగా సాగుతుంది. ఒక్క మండలంలో ఓ ఎంపీడీవో, సూపరిండెంటెంట్, సీనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్టు, నలుగురు ఆఫీస్‌ సబార్డినేట్లు అవసరం. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కొత్త కార్యాలయాలు, సిబ్బంది కేటాయింపుల మార్గదర్శకాలు సైతం జెడ్పీకి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదు.
 
జూలై 5న   కొత్తపాలక వర్గాలు... 
ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించి జిల్లా పరిషత్, చైర్‌పర్సన్లు, వైస్‌చైర్మన్లతో పాలక వర్గాలు ఏర్పడ్డాయి. వచ్చే జులై 5న కొత్త పాలక వర్గాలు ఆయా జిల్లాల్లో కొలువుదీరాల్సి ఉంది. కొత్త జిల్లా పరిషత్‌ కార్యాలయాలతో పాలన ప్రారంభిస్తారా.. లేదా అద్దె భవనాల్లోనా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను జెడ్పీకి కేటాయిస్తారా అన్నదానిపై స్పష్టత రాలేదు. ఎన్నికల సమయంలో ఆయా జిల్లాల్లో ఏర్పడిన ఎంపీడీవో కార్యాలయాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన భవనాల్లో ఎన్నికల తతంగం ముగించారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ఎన్నికల సామగ్రి, సిబ్బంది పంపిణీ అంతా పూర్తిస్థాయిలో కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ నుంచే కొనసాగింది. తక్షణం ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వస్తే తప్ప ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. 

ఆదేశాలు అందాకే కార్యాచరణ...
కొత్త జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయాలు, ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. గతంలో అడిగిన పూర్తి సమాచారం నివేదించాం. జిల్లా పరిషత్‌ కొత్త పాలక వర్గంలు ఎన్నిక నియమాకం ముగిసింది. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నుంచి మార్గదర్శకాలు రాగానే వాటికి అనుగుణంగా తదుపరి కార్యాచరణ చేపట్టి పనులు మొదలు పెడుతాం. – జెడ్పీ సీఈవో వెంకటమాధవరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement