తెలంగాణ: రోజుకు 21 మంది ఆత్మహత్య

Telangana State Seventh Placed In Lifeless Cases - Sakshi

చిన్న చిన్న సమస్యలకూ ఆత్మహత్యలు..

కుటుంబ కలహాలు, అనారోగ్య కారణాలే అధికం

ఆత్మహత్యల రేటులో తెలంగాణకు 5వ స్థానం

ఎన్‌సీఆర్‌బీ 2018 గణాంకాలు 

2018లో తెలంగాణలో బలవన్మరణాలు 845

సాక్షి, హైదరాబాద్‌: తమ్ముడికి ట్యాబ్‌ ఇచ్చి, తనకు ఇవ్వలేదన్న కోపంతో ఆరో తరగతి పిల్లాడు ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. అప్పు తీర్చలేమోనన్న భయంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తన భార్య, ఇద్దరు కొడుకులను చంపి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.. ‘ఆత్మీయులు లేనివారే ఆత్మహత్యలకు పాల్పడతారు. చనిపోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యంలో ఒక్క శాతం సమస్యను పరిష్కరించడానికి కేటాయిస్తే.. తప్పకుండా వారు నూటికి నూరు శాతం సఫలీకృతులవుతారు’ ఇదీ మానసిక నిపుణుల అభిప్రాయం. పరిష్కారం లేని సమస్యంటూ లేదు ఈ ప్రపంచంలో. సులువుగా నొప్పి తెలియకుండా ఎలా చావాలో నెట్‌లో వెతికే యువత.. అదే సమయాన్ని తమ సమస్య పరిష్కారం కోసం వెతికితే బతకొచ్చన్న సంగతి విస్మరిస్తున్నారు. కారణాలేవైనా.. దేశంలో ఏటా దాదాపున 1.3 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. జాతీయ సగటు ప్రకారం.. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి లక్ష మందిలో 10.2 మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో రోజుకు 21 మంది తనువు చాలిస్తున్నారు.

ఏడో స్థానంలో తెలంగాణ..
2018 నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం.. 2018లో దేశం మొత్తం మీద 1,34,516 మంది వ్యక్తిగత సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. 17,972 ఆత్మహత్యలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, 13,896 మరణాలతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా 13,255 ఆత్మహత్యలతో పశ్చిమ బెంగాల్, 11,775 ఆత్మహత్యలతో మధ్యప్రదేశ్, 11,561 మరణాలతో కర్ణాటక నిలిచాయి. ఆరోస్థానంలో 8,237 ఆత్మహత్యలతో కేరళ, ఏడో స్థానంలో 7,845 ఆత్మహత్యలతో మంది ఉన్నాయి. కాగా, దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌ ఈ విషయంలో 2.2 శాతం ఆత్మహత్యల రేటు (4,849 ఆత్మహత్యలు) మాత్రమే కలిగి ఉండటం గమనార్హం.

రేటు పరంగా చూస్తే..
ప్రతి లక్ష మందిలో ఎంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా నమోదైన గణాంకాల ఆధారంగా తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది. జాతీయ సగటు చూసుకుంటే ప్రతి లక్షమందిలో 10.2 శాతం మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అండమాన్‌ నికోబార్‌లో 41, పుదుచ్చేరిలో 33.8, సిక్కింలో 30.2, చత్తీస్‌గఢ్‌లో 24.7, కేరళలో 23.5, తెలంగాణలో 21.2 ఆత్మహత్యలతో జాతీయ సగటు కన్నా అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2016లో తెలంగాణలో ఈ రేటు 24.5 శాతంగా ఉండేది. అక్షరాస్యతలో అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా పేరున్న బిహార్‌ ఈ విషయంలో అట్టడుగున ఉండటం గమనార్హం. ఇక్కడ ఆత్మహత్యల శాతం ప్రతి లక్ష మందిలో 0.4 శాతం మాత్రమే కావడం విశేషం.

అసలు సమస్య అదే: డాక్టర్‌ వీరేంద్ర, సైకాలజిస్ట్‌
డిప్రెషన్‌ను గుర్తించకపోవడమే ఆత్మహత్యలకు మూలం. జీవితంలో పైకి వచ్చిన చాలామంది సెలబ్రెటీలు తర్వాత కాలంలో పూర్వపు గుర్తింపు, ఆదరణ దక్కట్లేదనో, తమ సమస్యకు ఎవరూ పరిష్కారం చూపట్లేదన్న కారణాలతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. ఇలాంటివారు సమాజానికి దూరంగా ఒంటరిగా ఉంటారు. నిర్వేదంగా, నిస్తేజంగా మాట్లాడతారు. ఈ లక్షణాలు కనిపిస్తే వారికి తగిన చికిత్స అందించినా.. ఆత్మీయులు, సన్నిహితులు చొరవ తీసుకుని సమస్య పరిష్కరించే యత్నం చేసినా.. వారిలో తిరిగి బతుకుపై ఆశలు కలిగించొచ్చు.

అవి కాన్‌సంట్రేషన్‌ క్యాంప్స్‌: డాక్టర్‌ శారదా, ఫ్రొఫెసర్‌ ఉస్మానియా వర్సిటీ
ర్యాంకుల పేరిట స్కూళ్లు, కాలేజీల్లో పిల్లలను కాన్‌సంట్రేషన్‌ క్యాంపుల్లాంటి హాస్టళ్లలో పెడుతున్నారు. ఒత్తిడిని అలవాటు చేస్తూ, విజయాలను చూపిస్తున్నారే తప్ప.. ఓడిపోతే ఏం చేయాలనేది ఎవరూ నేర్పట్లేదు. ఇలాంటివారు జీవితంలో మంచి ఉద్యోగాలు సంపాదించినా.. వృత్తిగత, వ్యక్తిగత సమస్యలు ఎదురుకాగానే వెంటనే ప్రాణాలు తీసుకుంటున్నారు. మానవ వనరులపరంగా దేశానికి ఇది ఎంతో చేటు. ర్యాంకులు, మార్కులు, పోటీతత్వం విజయానికి కొలమానాలు కావు. అపజయాల నుంచి పాఠాలు నేర్చుకోగలిగే సామర్థ్యం విద్యార్థులకు నేర్పినప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది.

ఆత్మహత్యకు కారణాలివే..
కుటుంబ సమస్యలు       30.4%
అనారోగ్యం                    17.7% 
వివాహ సమస్యలు         6.2% 
మాదకద్రవ్యాల బానిసలు  5.3%
ప్రేమ సమస్యలు             4%

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top