గంపెడాశలు | Telangana state first time Assembly Meetings | Sakshi
Sakshi News home page

గంపెడాశలు

Jun 9 2014 3:20 AM | Updated on Sep 2 2017 8:30 AM

గంపెడాశలు

గంపెడాశలు

తెలంగాణ రాష్ట్రంలో తొలి అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమై ఈ నెల 13 వరకు జరగనున్నాయి. మొదటి రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం, 10న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక, 11న డెప్యూటీ స్పీకర్ ఎన్నిక, 12న గవర్నర్ ప్రసంగం, 13న గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగనుంది.

సాక్షి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో తొలి అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమై ఈ నెల 13 వరకు జరగనున్నాయి. మొదటి రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం, 10న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక, 11న డెప్యూటీ స్పీకర్ ఎన్నిక, 12న గవర్నర్ ప్రసంగం, 13న గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగనుంది.
 
 రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరుగుతున్న తొలి సమావేశాల్లో జిల్లా నుంచి దాసరి మనోహర్‌రెడ్డి (పెద్దపల్లి), బోడిగె శోభ (చొప్పదండి),రసమయి బాలకిషన్ (మానకొండూర్), పుట్ట మధు (మంథని), వొడితెల సతీష్‌కుమార్ (హుస్నాబాద్) ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తొలిసారి అడుగు పెట్టనున్నారు. జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంది. జగిత్యాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున టి.జీవన్‌రెడ్డి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్‌రెడ్డికి, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఈటెల రాజేందర్, కె.తారకరామారావులకు సభలో మాట్లాడే అవకాశం రానుంది. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలకు సమస్యలపై మాట్లాడే అవకాశం రాకపోవచ్చు. ఒకవేళ అవకాశం వస్తే ఎవరెవరు ఏ సమస్యపై గళం విప్పుతారోనని ఆయా నియోజకవర్గాల ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
 
 ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల అమలుపై ప్రజలంతా కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రైతులందరికీ రూ.లక్ష పంట రుణాలు మాఫీ చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి రాగానే దీనిపై జిల్లాలో రగడ మొదలైంది. గత ఆర్థిక సంవత్సరం రైతులు తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని సీఎం కే సీఆర్ నాలుగు రోజుల క్రితం ప్రకటించారు. దీంతో ఆంక్షలు లేని రుణమాఫీ ప్రకటించాలంటూ జిల్లావ్యాప్తంగా పార్టీలకతీతంగా నాయకులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
 
  రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంట రుణాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. రుణాలు మాఫీ అవుతాయనే ఆశతో పాత బకాయిలు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు కొత్తగా ఖరీఫ్ రుణాలు ఇవ్వడం లేదు. ఇప్పటికే ఖరీఫ్ సాగుకు సన్నద్ధమైన రైతులు దుక్కులు, విత్తనాలు, ఎరువులు, ఇతర పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. శాసనసభ సమావేశాల్లో రుణమాఫీపై సర్కారు స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని ఎదురుచూస్తున్నారు. అలాగే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, పరికరాలకు కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
 
 టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో మరో ప్రధానమైన హామీ పేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇంటి నిర్మాణం. 125 చదరపు గజాల్లో రూ.3లక్షల ఖర్చుతో ప్రభుత్వమే ఇంటిని నిర్మిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.
 
 దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పేదలు ఇప్పటికే మంజూరై నిర్మాణం ప్రారంభించని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారు. కొత్త సర్కారు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 80వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉండగా, ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేస్తే బకాయి బిల్లులు వస్తాయో రావోనన్న ఆందోళన లబ్ధిదారుల్లో ఉంది. దీనిపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది.
 
 తాము అధికారంలోకి వస్తే సంక్షేమానికి పెద్దపీట వేస్తామని టీఆర్‌ఎస్ ప్రకటించింది. ఇప్పుడిస్తున్న రూ.200 వృద్ధాప్య, వితంతు పింఛన్లను రూ.వెయ్యికి, ప్రస్తుతం రూ.500 ఉన్న వికలాంగుల పింఛన్లను రూ.1500కు పెంచుతామని హామీ ఇచ్చింది. జిల్లాలో వృద్ధులు, వితుంతువులు, వికలాంగులు, గీత, చేనేత కార్మికులు, అభయహస్తం పింఛన్‌దారులు మొత్తం 3.7లక్షల మంది కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
 
 గత కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలుపరిచిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై కొత్త ప్రభుత్వం ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఈ పథకం ద్వారా జిల్లాలో గత విద్యాసంవత్సరం 1,47,423 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. వైఎస్సార్ మరణానంతరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కిరణ్ సర్కారు కొర్రీలు పెట్టడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రస్తుత సర్కారు ఈ పథకాన్ని కొనసాగిస్తూ పెండింగ్ బకాయిలను విడుదల చేస్తే తప్ప పేద విద్యార్థులు ఉన్నత విద్య కొనసాగించలేని పరిస్థితి ఉంది.
 
 పేదలకు బుక్కెడు బువ్వ పెట్టే పీడీఎస్ పథకం అమలు జిల్లాలో అస్తవ్యస్తంగా తయారైంది. గత సంవత్సరం కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం ఆదిలోనే అభాసుపాలైంది. రూ.185కే ఉప్పు, పప్పుతో పాటు తొమ్మిది రకాల సరుకులు ఇస్తామన్నా.. నాలుగైదుకు మించి అందడం లేదు. దీంతో జిల్లాలోని 9,38,072 మంది కార్డుదారులు ఇబ్బందుల్లో పడ్డారు.  పేదలకు ఎంతో ఆసరాగా ఉండే ఈ పథకాన్ని టీఆర్‌ఎస్ సర్కారు సమర్థంగా అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
 
 ఇక కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య అన్న హామీపై పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ దీని అమలుకు రెండుమూడేళ్ల సమయం పడుతుందని తెలుస్తోంది. అంతవరకు జాప్యం చేయకుండా ఈ విద్యాసంవత్సరం నుంచే విద్యా పథకాన్ని అమలు చేయాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.
 
 వచ్చేది వర్షాకాలం.. అంటువ్యాధుల సీజన్. జిల్లాలో సర్కారు వైద్య సేవల దుస్థితి పాలకులకు తెలియంది కాదు. గతంలో డెంగీ, చికున్‌గున్యా, విషజ్వరాలు విజృంభించి జిల్లా కేంద్రంతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వందలాది మంది మృత్యువాతపడ్డారు. జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు ఏరియా, కమ్యూనిటీ ఆసుపత్రుల్లో కనీసం వైద్య సౌకర్యాలు లేక పలువురి ప్రాణాలు గాలిలో కలిశాయి. వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసి పేదల ప్రాణాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కొత్త సర్కారుపై ఉంది.
 
 జిల్లాలో ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో పురోగతి లోపించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఈ సీజన్‌లో అయినా పంటలకు ఎల్లంపల్లి నీరందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మధ్యమానేరు రిజర్వాయర్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. గండిపల్లి, గౌరవెల్లి, తోటపెల్లి జలాశయాలకు తట్టెడు మట్టికూడా ఎత్తలేదు. వరదకాల్వ పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. వీటితోపాటు గత వర్షాకాలంలో తెగిపోయిన, గండ్లుపడ్డ చెరువులు, కుంటలకు మరమ్మతులు చేస్తే తప్ప నీళ్లు నిలిచే పరిస్థితి లేదు. వీటన్నింటిని టీఆర్‌ఎస్ సర్కారు ప్రథమ ప్రాధామ్యంగా గుర్తించి అవసరమైన నిధులు మంజూరు చేయాల్సిన అవసరముంది.
 
 సార్వత్రిక ఎన్నికలు, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం సంధికాంలో నెలకొన్న పాలనాపరమైన స్తబ్ధత కారణంగా జిల్లాలో పలు ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేకపోయాయి. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో వ్యవసాయం, విద్యుత్, వైద్య, ఆరోగ్యం, విద్య, రోడ్లు, తదితర మౌలిక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా సమస్యల పరిష్కారం కోసం కొత్త ఎమ్మెల్యేలు శాసనసభలో గళమెత్తాల్సిన అవసరాన్ని జిల్లా ప్రజలు గుర్తుచేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement