రాష్ట్రం అప్రమత్తం

Telangana Police Alert Over IAF Attack In Pakistan - Sakshi

ఐబీ హెచ్చరికలతో పోలీసులు అలర్ట్‌..

సున్నిత ప్రాంతాల్లో నిఘా పెంపు

స్లీపర్‌ సెల్స్‌ దాడులు చేయకుండా ముందస్తు తనిఖీలు

ఉదయం నుంచి గంటగంటకూ ఐబీకి నివేదికలు

సాక్షి, హైదరాబాద్‌: పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) దేశ వ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించింది. ఉగ్రవాదుల హిట్‌ లిస్ట్‌లో ఉన్న ప్రధాన నగరాల్లో దాడులు జరగవచ్చన్న సమాచారంతో అన్ని రాష్ట్రాల డీజీపీలను అలర్ట్‌ చేసింది. దీంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానిత ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని సున్నిత ప్రాంతాల్లో అనుకోని ఘటనలు జరగవచ్చన్న సమాచారంతో నిఘా పెంచిన ఇంటెలిజెన్స్‌ విభాగం ఎప్పటికప్పుడు సమాచారాన్ని డీజీపీ కార్యాలయానికి చేరవేసింది. క్రోడీకరించిన స్థానిక సమాచారాన్ని తెలంగాణ పోలీసులు గంటగంటకూ ఐబీ కార్యాలయానికి అందజేశారు.

కేంద్ర సంస్థల వద్ద భద్రత పెంపు..
హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రైల్వేస్టేషన్లు, శంషాబాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుతోపాటు పలు చోట్ల సీఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరించారు. స్లీపర్‌సెల్స్‌ దాడులు ఉంటాయన్న అనుమానంతో కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. వాస్తవానికి గోకుల్‌చాట్, లుంబినీ పార్కు పేలుళ్ల తరువాత హైదరాబాద్‌లో ఉగ్ర దాడులు జరిగిన దాఖలాలు లేవు. కానీ పాక్‌ సానుభూతిపరులు, పాక్‌ ప్రేరేపిత ఉగ్రమూక సంస్థలకు పనిచేసే వారిని నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు గుర్తించి అరెస్టు చేస్తున్నాయి. ఫలితంగా పలు ఉగ్ర కుట్రలను ముందే ఛేదించగలిగారు. ఐఎస్‌ఐఎస్‌ సానుభూతిపరులను 2016 జూలైలో జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసిన తరువాత తిరిగి అలాంటి కలకలమేదీ రేగలేదు. నగరంలో స్లీపర్‌ సెల్స్‌ ఉన్నట్లు సమాచారం లేకున్నా.. ముందు జాగ్రత్తగా పకబడ్డందీ రక్షణ చర్యలు చేపట్టారు. జనసమ్మర్థ, సున్నిత ప్రాంతాల్లో తనిఖీలు, అనుమానితులపై నిఘాను పెంచారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top