...మేధో మార్గదర్శకం

Telangana To Help Niti Aayog in Formulating Guidelines Artificial Intelligence Norms - Sakshi

కృత్రిమ మేధస్సుపై మార్గదర్శకాలు ఇవ్వాలని రాష్ట్రాన్ని కోరిన నీతి ఆయోగ్‌

దేశవ్యాప్తంగా త్వరలో 5 చోట్ల కోర్‌ సెంటర్లు

మరో 20 చోట్ల ఇక్టయ్‌ కేంద్రాలు

సాక్షి, హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో కొత్తగా వాడుకలోకి వస్తున్న నూతన సాంకేతికత కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌–ఏఐ)కు సంబంధించి జాతీయ స్థాయిలో పరిశోధనలకు తెలంగాణ మార్గనిర్దేశనం చేయనుంది. ఏఐ పరిశోధనలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించే బాధ్యతను కేంద్రం 2017లో నీతి ఆయోగ్‌కు అప్పగించింది. ‘ఏఐ ఫర్‌ ఆల్‌’పేరిట నీతి ఆయోగ్‌ గతేడాది నివేదిక విడుదల చేసింది. వివిధ రంగాల్లో ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఐరావత్‌ అనే ఐటీ ప్లాట్‌ఫారంతో పాటు ఏఐ రంగంలో పరిశోధన, అభివృద్ధి కోసం రీసెర్చ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.

దేశంలో 5 సెంటర్స్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఎక్సలెన్స్‌ (కోర్‌), 20 ఇంటర్నేషనల్‌ సెంటర్స్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫర్మేషనల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఇక్టయ్‌) ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్‌ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో కోర్, ఇక్టయ్‌ ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శకాల కోసం తెలంగాణ ప్రభుత్వంతో నీతి ఆయోగ్‌ పలుసార్లు సంప్రదింపులు జరిపింది. ఏఐ సాంకేతికతకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి రంగాలకు హైదరాబాద్‌ చిరునామాగా మారుతున్న నేపథ్యంలో ఏఐ రీసెర్చ్‌ సెంటర్ల మార్గదర్శకాలు ఖరారు చేసే బాధ్యతను తెలంగాణకు అప్పగించింది. ఏఐ రీసెర్చ్‌ సెంటర్లు ఏ తరహాలో ఉండాలి.. వాటిలో ఏ రకమైన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనే అంశంపై మార్గదర్శకాలు రూపొందించి నీతి ఆయోగ్‌కు సమర్పిస్తామని ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఏఐ పరిశోధనలో కోర్, ఇక్టయ్‌ కీలకం
దేశంలో ప్రస్తుతం ఏఐ సాంకేతికత తీరు తెన్నులను అర్థం చేసుకుని, మరింత పురోగతి సాధించడం లక్ష్యంగా కోర్‌ సెంటర్లలో పరిశోధన జరుగుతుంది. కోర్‌ పరిశోధనలో సాధించే ఫలితాల ఆధారంగా ప్రైవేటు రంగం సహకారంతో నూతన ఏఐ అప్లికేషన్ల రూపకల్పనపై ఇక్టయ్‌లు పనిచేస్తాయి. కోర్, ఇక్టయ్‌లలో ఏ రకమైన పరిశోధనలు జరగాలనే కోణంలో తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి నీతి ఆయోగ్‌కు అందిస్తుంది. దేశంలో ఏఐ సాంకేతికతకు రూపునిచ్చేందుకు ఐరావత్‌ ప్లాట్‌ఫారం రూపకల్పన, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు రూ.7,500 కోట్లు కేటాయించాలని కేంద్రానికి నీతి ఆయోగ్‌ ప్రతిపాదనలు సమర్పించింది. మూడేళ్ల పాటు ఈ నిధులను దశలవారీగా విడుదల చేసేందుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. 2035 నాటికి భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఏఐ వాటా సుమారు రూ.69 లక్షల కోట్లు ఉంటుందని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది. ఏఐ పరిశోధన, వినియోగంలో అగ్రస్థానంలో ఉన్న చైనా మాత్రం వచ్చే రెండు మూడేళ్లలోనే సుమారు రూ.10 లక్షల కోట్లకు ఏఐ వాటాను చేర్చాలని ప్రయత్నిస్తోంది.

కృత్రిమ మేధో సంవత్సరంగా 2020
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో వస్తున్న నూతన సాంకేతికతల పరిశోధన, అభివృద్ధి రంగాలకు తెలంగాణ చిరునామాగా మారుతోంది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్‌ వంటి కొత్త సాంకేతికతలపై జరిగే పరిశోధన, అభివృద్ధి రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రముఖ ఐటీ కంపెనీలు రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏఐ సాంకేతికత వినియోగంలో తెలంగాణ ముందంజలో ఉంది. వ్యవసాయం, పట్టణీకరణ, రవాణా, ఆరోగ్య రంగాల్లో కీలక సవాళ్ల పరిష్కారానికి ఏఐ ఐటీ సాంకేతికతను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారంగా భావిస్తోంది. ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020ని ‘ఇయర్‌ ఆఫ్‌ ఏఐ’(కృత్రిమ మేధో సంవత్సరం)గా ప్రకటించింది.

ఏఐ అంటే..
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో ఇటీవల విరివిగా వినియోగంలోకి వస్తున్న కొత్త సాంకేతికత పేరు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌. భవిష్యత్తులో ఏఐ వినియోగం పెరుగుతుందని చెబుతున్న ఐటీ నిపుణులు.. ఇప్పటికే మన నిత్య జీవితంలో ఏఐ వినియోగం ప్రారంభమైందని చెబుతున్నారు. మనుషుల తరహాలో యంత్రాలు ఆలోచించి, సొంతంగా నిర్ణయాలు తీసుకుని, ఆచరించడమే కృత్రిమ మేధస్సు (ఏఐ)గా పేర్కొంటున్నారు. మనుషుల గొంతులు, ముఖాలను కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు గుర్తు పట్టడం, మనం వాటికి ఇచ్చే సవాళ్లను పరిష్కరించడం, ఏదైనా పనిని అప్పగిస్తే ఏఐ సాంకేతికత పూర్తి చేస్తుందన్న మాట. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top