ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను రప్పించండి

Telangana Grade Four Employees Demand - Sakshi

తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో పని చేస్తున్న తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలని తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో సంఘం నగర శాఖ కార్య వర్గ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగి ఐదేండ్లు దాటినప్పటికీ ఉద్యోగుల సమస్య పరిష్కారం కావడం లేదని అన్నారు.

నేటికీ 450 మంది తెలంగాణ ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నారని చెప్పారు. చాలీచాలని వేతనంతో వారు అక్కడ ఉండలేక, రాష్ట్రానాకి రాలేక నిత్యం మానసిక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఈ విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చి ఏ రాష్ట్రానికి చెందిన ఉద్యోగి ఆ రాష్ట్రంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులకు డీఏ, ఐఆర్‌ ఇవ్వాలని ఆయన సీఎం కేసీఆర్‌ను కోరారు. కార్యక్రమంలో తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాదర్‌ బిన్‌ హసన్, నగర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, కార్యదర్శి అతిక్‌ పాషా, కోశాధికారి అండ్రూస్, సహ అధ్యక్షుడు బాలకృష్ణ, ఉపాధ్యక్షుడు రాజేందర్, వెంకటేష్, యాదమ్మ, ముజీబ్, వందన, కస్తూరి పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top