మన ఆస్పత్రి భేష్‌..  | Telangana Govt Hospitals Is Google Services | Sakshi
Sakshi News home page

మన ఆస్పత్రి భేష్‌.. 

Feb 7 2019 12:01 PM | Updated on Feb 7 2019 12:01 PM

Telangana Govt Hospitals Is Google Services - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొండాపూర్‌లోని మన జిల్లా ఆస్పత్రి వైద్య సేవల్లో ముందంజలో నిలిచింది. ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న  సేవలు, రోగులకు డాక్టర్ల మధ్య సంబంధాలు, రోగుల సంతృప్తి, ఆస్పత్రిలో శుభ్రత, మౌలిక వసతులు, సేవల్లో పారదర్శకత తదితర అంశాల్లో ఏ స్థాయిలో మెరుగ్గా ఉన్నాయో తెలుసుకునేందుకు నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ‘కాయకల్ప్‌–2018’ పేరిట సర్వే చేయించింది. గతేడాది డిసెంబర్‌లో ఈ సర్వే జరిగింది. ఒక జిల్లా ఆస్పత్రి వైద్యులతో ఇతర జిల్లాలోని ఆస్పత్రులను పరిశీలన చేయించి అంశాల వారీగా స్కోర్‌ కేటాయించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లా ఆస్పత్రులు, నాలుగు ఏరియా ఆస్పత్రులు, ఏడు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లను అధికారుల బృందాలు పరిశీలించాయి. వీరు ఇచ్చిన నివేదిక ప్రకారం మన జిల్లా ఆస్పత్రి అన్ని అంశాల్లోనూ మెరుగ్గా ఉంది. 81 శాతం స్కోర్‌ సాధించి అందరి ప్రశంసలు అందుకుంది.

అవార్డుకు అడుగు దూరంలో.. 
అత్యుత్తమ స్కోర్‌ సాధించిన జిల్లా ఆస్పత్రి అవార్డు అందుకోవడానికి అడుగు దూరంలో ఉంది. జిల్లాస్థాయిలో ఉత్తమంగా నిలవగా.. ఇక రాష్ట్రస్థాయిలో పోటీపడుతోంది. రాష్ట్ర స్థాయి అధికారులతో కూడిన ఎక్స్‌టర్నల్‌ అసెస్‌మెంట్‌ టీంను ఈనెల 8న నేషనల్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ రిసోర్స్‌ సెంటర్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ) జిల్లా ఆస్పత్రికి పంపించనుంది. ఈ అధికారులు మరింత సూక్ష్మంగా అన్ని అంశాలను పరిశీలించి స్కోర్‌ని కేటాయిస్తారు. ఈ స్కోర్‌ సాధించడంలో మన ఆస్పత్రి ముందుంటే ఎన్‌హెచ్‌ఎం అందజేసే అవార్డుకు అర్హత సాధించినట్లే. ఇది సాకారమైతే ప్రత్యేక నిధులు కూడా ఆస్పత్రికి విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
 
క్రమంగా మెరుగు.. 
మన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు, వసతులు క్రమంగా మెరుగు పడుతూ వస్తున్నాయి. భవనాన్ని ఆధునికంగా తీర్చిదిద్దారు. కార్పొరేట్‌ హాస్పిటల్‌ను తలపిస్తున్న ఈ ఆస్పత్రిలో రోగుల భద్రతకూ ప్రాధాన్యత ఇస్తుండడం విశేషం. 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆస్పత్రిని పూర్తిగా చిత్రీకరిస్తూ కంట్రోల్‌ రూం ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అధికారులు, ఉద్యోగుల హాజరు నమోదు కోసం బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆస్పత్రి ఆధ్వర్యంలో బయట సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆరోగ్య విద్య, పరిశుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. వృద్ధులు, మహిళలు, పురుషులు, స్త్రీ వ్యాధి సంబంధ రోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి కేటాయించిన కౌంటర్‌ వద్ద ఓపీ స్లిప్పులు రాయించుకుని సంబంధిత డాక్టర్‌ను సంప్రదించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ విధానం వల్ల వేగంగా రోగుల రిజిస్ట్రేషన్‌ జరుగుతోంది. వరుసలో నిలబడాల్సిన పనికూడా లేదు. 

పెరుగుతున్న రోగుల తాకిడి.. 
ఇక్కడి వైద్య సేవలు, వసతులు రోగులను ఆకర్షిస్తున్నాయి. దీని ఫలితంగానే  ఈ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో నిత్యం 400 మంది అవుట్‌ పేషంట్లు వచ్చేవారు. ఇప్పుడు ఈ సంఖ్య 550 దాటుతోంది. నిత్యం 120 మంది ఇన్‌పేషంట్లు ఉంటున్నారు. ప్రతి రోజు నాలుగు వరకు కాన్పులు అవుతున్నాయి. గైనకాలజీ, జనరల్‌ సర్జన్, జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ, ఈఎన్‌టీ, ఆర్థో విభాగాల సేవలు అందుతున్నాయి. అంతేగాకుండా ఆప్తమాలజీ విభాగాన్ని ఆధునీకరించారు.

అవార్డు మనకే..
జిల్లా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, ఇక్కడున్న వసతులను పరిగణనలోకి తీసుకుంటే అవార్డు మనకే దక్కుతుందనడంలో  సందేహం లేదు. అందరి సహకారంతోనే రాష్ట్రస్థాయిలో మన ఆస్పత్రికి మంచి స్కోర్‌ వచ్చింది. తొలుత పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా మార్చడానికి ఎంతో శ్రమించాం. ఆయా విభాగాలను ఆధునీకరించి రోగులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నాం.  – డాక్టర్‌ ఎ.వరదాచారి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement