సమ్మెతో రోడ్డున పడ్డారు..

Telangana Government Suspended The 7500 Field Assistant Under Employment Guarantee Scheme - Sakshi

7,500 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లపై ప్రభుత్వం వేటు

పంచాయతీ కార్యదర్శులకు ఉపాధి బాధ్యతలు

విధుల్లో చేర్చుకోవాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఎఫ్‌ఏలు 

సాక్షి, హైదరాబాద్‌: సమ్మె వారిని రోడ్డున పడేసింది. 7,500 ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. వారం రోజుల్లోనే సమ్మె విరమించినా.. దిగిరాని ప్రభుత్వం ఫీల్డ్‌ అసిస్టెంట్ల విధులను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. 14 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది పనితీరు ఆధారంగా గత డిసెంబర్‌లో ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. జాబ్‌ కార్డు పొందిన ప్రతి కుటుంబానికి ఎఫ్‌ఏలు కనీసం 40 రోజుల పని కల్పించాలని నిబంధన విధించింది.

ఈ మేరకు గతేడాది పనితీరును పరిగణనలోకి తీసుకొని గ్రామీణాభివృద్ధి శాఖ.. ఫీల్డ్‌ అసిస్టెంట్లను గ్రేడింగ్‌ చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎఫ్‌ఏలు మార్చి 12న సమ్మె బాట పట్టారు. సమస్యలను పరిష్కరించాలని, గ్రేడింగ్‌ నిర్ణయానికి వెనక్కి తీసుకోవాలంటూ ఉద్యమించారు. ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. అదే నెల 25న సమ్మెకు దిగిన ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఉద్వాసన పలికింది. కరోనా నేపథ్యంలో వారం రోజుల్లోనే సమ్మె విరమించినా అధికారులు తమపై కనికరం చూపకపోవడం దారుణమని ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో చేర్చుకోవాలని 2 నెలలుగా ఎంపీడీవోలు, డీఆర్డీవోల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

14 ఏళ్లుగా అరకొర జీతాలు 
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005లో అమల్లోకి రావడంతో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ప్రభుత్వం ఫీల్డ్‌ అసిస్టెంట్లను నియమించింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతగా చేరిన వారికి రూ.1,200 వేతనం ఇచ్చిన ప్రభుత్వం.. 2007లో దీన్ని రూ.2 వేలు, 2008లో రూ.3,200, 2009లో రూ.6 వేలకు పెంచింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అలవెన్స్‌లు సహా రూ.8,900కు పెంచింది. ఇలా అరకొర జీతాలతో 14 ఏళ్లుగా నెట్టుకొస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు 4779 సర్క్యులర్‌ శాపంగా మారింది. గ్రామాల్లో కల్పించిన పని దినాలను బట్టి ఎఫ్‌ఏల పని తీరును మూడు కేటగిరీలుగా గ్రామీణాభివృద్ధి శాఖ విభజించింది. జాబ్‌కార్డు ఉన్న కుటుంబాలకు సగటున 30కిపైగా పనిదినాలు కల్పించిన ఎఫ్‌ఏల కాంట్రాక్ట్‌ రెన్యువల్‌ చేసి, రూ.10 వేలు జీతం ఇవ్వాలని, అంతకు తక్కువ పనిదినాలు కల్పించిన వారికి రూ.5 వేల జీతం మాత్రమే ఇవ్వాలని, సగటున 10 లోపు పని దినాలు కల్పించిన వారిని తొలగించాలని నిర్ణయించింది.

సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా.. 
తమ ఉద్యోగ భద్రతకు ముప్పుగా పరిణమించిన 4779 సర్క్యులర్‌ రద్దు చేయాలని, వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో ఫీల్డ్‌ అసిస్టెంట్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. మార్చి 12న సమ్మెకు దిగారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడంతో అదే నెల 20న ఆందోళన విరమించారు. అయితే, అప్పటికే నోటీసులు జారీ చేసిన అధికారులు వారిని విధుల్లో చేర్చుకోలేదు. తమను విధుల్లోకి చేర్చుకోవాలని ప్రభుత్వ పెద్దలను కలిసినా సానుకూల స్పందన రాలేదు. ఈ క్రమంలోనే తొలగించిన ఎఫ్‌ఏల విధులను పంచాయతీ కార్యదర్శులకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఫీల్డ్‌ అసిస్టెంట్లను మరింత ఆందోళనకు గురిచేసింది.

విధుల్లోకి తీసుకోవాలి 
డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న తమను తొలగించడం అన్యాయం. ఉద్యోగాలు లేకపోవడంతో కుటుంబం గడవడం ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం స్పందించి తమను విధుల్లో చేర్చుకోవాలి. సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. – కొత్త రాములమ్మ, ఫీల్డ్‌ అసిస్టెంట్, అడవి దేవులపల్లి, నల్లగొండ జిల్లా 

తొలగించటం సరికాదు.. 
ప్రభుత్వం ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించటం సరికాదు. 14 ఏళ్లుగా సేవలందిస్తున్న మాపై అకారణంగా వేటు వేయడంతో రో డ్డున పడ్డాం. ప్రభుత్వం పునరాలోచన చేసి తక్షణమే విధుల్లోకి తీ సుకోవాలి. 14 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వారిని క్రమ బద్ధీకరించి.. హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలి.  – మేకపోతుల సరిత, ఫీల్డ్‌ అసిస్టెంట్, గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top