ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు ఓకే!

Telangana Government Clearance On Pending GO 166 Regulation Of Land - Sakshi

జీవో 166 కింద వచ్చిన దరఖాస్తుల క్లియరెన్స్‌.. ఆరేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న వారికి ఊరట  

సాక్షి, హైదరాబాద్‌: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 2013 నుంచి పెండింగ్‌లో ఉన్న జీవో నం.166 ప్రకారం వచ్చిన దరఖాస్తుల క్లియరెన్స్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఆరేళ్లుగా స్థలాల క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు ఊరట కలగనుంది. కోర్టు కేసు నేపథ్యంలో పక్కనపెట్టిన ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది 179 జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, వరుస ఎన్నికలతో రెవెన్యూ యంత్రాంగం బిజీగా ఉండటంతో ఇన్నాళ్లు పెండింగ్‌లో పెట్టిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సర్క్యులర్‌ జారీ చేసింది. ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 166 జీవోను విడుదల చేశారు. అయితే, క్రమబద్ధీకరణ ముసుగులో అక్రమార్కులకు స్థలాలను కారుచౌకగా కట్టబెడుతున్నారని పౌరసంఘాలు కొన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 2013లో జీవో అమలుపై ‘స్టే’విధించింది. అప్పటి నుంచి యథాతథా స్థితిని కొనసాగించిన న్యాయస్థానం.. నిర్దేశిత రుసుం చెల్లించినవారికి/అర్హమైనవిగా తేల్చిన వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

పెండింగ్‌.. పెండింగ్‌!
ఇటు 166 జీవో వ్యవహారం కోర్టులో నడుస్తుండగానే రాష్ట్ర ప్రభుత్వం స్థలాల క్రమబద్ధీకరణకు మరో జీవోను విడుదల చేసింది. 2014లో కొలువుదీరిన కేసీఆర్‌ సర్కార్‌.. నివాసాలున్న ప్రభుత్వ స్థలాలను రెగ్యులరైజ్‌ చేయించుకునేందుకు అవకాశం కల్పిస్తూ జీవో 58, 59లు జారీ చేసింది. మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించింది. ఈ క్రమంలోనే 166 కింద పెండింగ్‌లో ఉన్నవాటికి కూడా మోక్షం కలిగించాలని దరఖాస్తుదారులు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సర్కార్‌ 179 జీవోను విడుదల చేసింది. జీవో 59 నిబంధనలకు లోబడి పెండింగ్‌లో ఉన్న 166 జీవో దరఖాస్తులను పరిశీలించాలని నిర్దేశించింది. అయితే, ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం వీటికి జోలికి వెళ్లలేదు. ఈ జీవో కింద రాష్ట్రవ్యాప్తంగా 2,584 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. ఇందులో ఇప్పటివరకు కేవలం 45 దరఖాస్తులు మాత్రమే అప్‌లోడ్‌ చేసి చేతులు దులుపుకున్నారు.

ఇందులో 40 రంగారెడ్డి జిల్లావే కావడం విశేషం. వీటిలోను కేవలం 19 దరఖాస్తులను మాత్రమే అప్‌డేట్‌ చేయడం గమనార్హం. వాస్తవానికి దరఖాస్తుదారులు.. స్థలాల క్రమబద్ధీకరణకు కీలకమైన ధ్రువపత్రాలను పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పోర్టల్‌ సమాచారం కూడా జిల్లాల అధికారులకు పంపకపోవడంతో వీటి పరిస్థితేంటో తెలియకుండా పోయింది. కాగా, తాజాగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌.. జీవో 166 దరఖాస్తులను 179 జీవో మార్గదర్శకాలకు అనుగుణంగా క్లియర్‌ చేయమని ఆదేశిస్తూ కలెక్టర్లకు లేఖ రాశారు. అయితే, ల్యాండ్‌ రెవెన్యూ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఎల్‌ఆర్‌ఎంస్‌) పోర్టల్‌లో అప్‌డేట్‌ చేసినవి కేవలం 19 దరఖాస్తులే కావడంతో.. వీటికే మోక్షం లభిస్తుందా? తహసీల్దార్లు, ఆర్డీవో, కలెక్టరేట్లలో పెండింగ్‌లో ఉన్నవాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top