ఆర్టీసీ సమ్మెకు టీఈఏ పూర్తి మద్దతు

Telangana Employees Association Supports RTC Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పన్నెండు రోజులుగా నిరవధికంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (టీఈఏ) మద్దతు ప్రకటించింది. హైదరాబాద్‌ లిబర్టీలోని టీఈఏ కార్యాలయంలో ఆర్జీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి సహా పలువురు నేతలు ఆ సంఘం నాయకులను కలిసి సమ్మెకు మద్దతు కోరారు. ఈ నేపథ్యంలో కార్మికుల సమ్మెకు అండగా ఉంటామని టీఈఏ నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌  అధ్యక్షుడు సంపత్‌ కుమార్‌ స్వామి మాట్లాడుతూ.. ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం ఎంతో విచారకరమన్నారు. ఆత్మహత్యలతో కాకుండా పోరాటాలతో హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. మిగతా ఉద్యోగ సంఘాలను, ఉపాధ్యాయ సంఘాలను సంఘటితం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రవాణా వ్యవస్థ నాశనం చేశారు
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించిన టీఈఏకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రోజురోజుకు సమ్మెకు మద్దతు పెరగడంతో తమలో ఆత్మస్థైర్యం పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారితో చర్చలు జరపమని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక బస్సులు తగ్గిపోయాయని, రవాణా వ్యవస్థను నాశనం చేశారని ఘాటుగా విమర్శించారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులు బాధ్యులా అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెవెన్యూ ఉద్యోగులను, ఆర్టీసీ కార్మికులను టార్గెట్‌ చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆర్టీసీకి పట్టిన గతే మున్ముందు అన్ని ఉద్యోగ సంఘాలకు పడుతుందని వ్యాఖ్యానించారు. ప్రజా రవాణాను, ఆర్టీసీ వ్యవస్థను, ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించాలని కోరారు. భవిష్యత్తులో ఎవరికి ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా ఆర్టీసీ జేఏసీ అందుకు పూర్తిగా సహకరిస్తుందని ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top