అవకాశవాద పార్టీలను ఓడించాలి

Telangana Elections CPM BV Raghavulu Campaign Khammam - Sakshi

చర్ల: తెలంగాణలో అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్న పార్టీలను ఓడించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. భద్రాచలం నియోజకవర్గ  సీపీఎం శాసనసభ అభ్యర్థి డాక్టర్‌ మిడియం బాబూరావు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం ఆయన చర్ల మండలంలోని పలు గ్రామాల్లో  ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత జరుగుతున్న ఈ ఎన్నికలలో అవకాశవాద రాజకీయ పార్టీలను తరిమికొట్టాలని ఆయన అన్నారు.

బంగారు తెలంగాణ వస్తుందని ఆశపడిన ప్రజానీకానికి భంగపాటే ఎదురయిందని అన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీలన్ని వేరైనప్పటికీ, వాటి విధానాలన్నీ ఒక్కటేనని,  అవన్ని ఒకే తానులోని ముక్కలని  అన్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు, దళితులను టీఆర్‌ఎస్‌ బలవంతంగా వెళ్లగొట్టిందని, అంతేకాకుండా వారిపై పీడీ యాక్ట్‌ కేసులు పెట్టారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ఎస్సీ, ఎస్టీ, అట్రాసీటీ చట్టాన్ని నీరుగార్చి తీవ్రంగా అవమానించిందని అన్నారు.

పంటసాగుకు సాయం కోసం రైతుబంధు పేరిట తీసుకొచ్చిన పథకం బడా రైతులకు మాత్రమే ఉపయోపడిందని, చిన్నకారు రైతులకు ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు. వద్ధిపేట చెక్‌డ్యాం నిర్మాణం కోసం రానున్న రోజుల్లో తమ పార్టీ పోరాడి సాధిస్తుందని అన్నారు.  భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి డాక్టర్‌ మిడియం బాబూరావును గెలిపించాలని  కోరారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఎం భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ మిడియం బాబూరావు, జిల్లా కమిటీ సభ్యుడు కొలగాని బ్రçహ్మాచారి, మండల కార్యదర్శి కారం నరేష్, సీనియర్‌ నాయకులు చింతూరు వెంకట్రావు, చీమలమర్రి మురళీకృష్ణ, వినోద్, వెంకట్, రవి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top