ఎన్నికల్లో పరాజయంపై సమీక్ష! 

Telangana congress leaders review of losing election - Sakshi

 4, 5, 7 తేదీల్లో పార్లమెంటు నియోజకవర్గాలవారీగా కాంగ్రెస్‌ సమావేశాలు 

ఢిల్లీలో రాహుల్‌తో ఉత్తమ్, కుంతియా భేటీ   

ఈ నెల 10లోగా 33 జిల్లాల అధ్యక్షులను నియమించాలని రాహుల్‌ ఆదేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం దాదాపు 20 రోజులపాటు మౌనంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఎట్టకేలకు సమీక్షకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయంపై శుక్రవారం నుంచి సమీక్షకు ఆ పార్టీ నేతలు ఉపక్రమిస్తున్నారు. ఈ నెల 4, 5, 7 తేదీల్లో మూడు రోజులపాటు పార్లమెంటు నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. సమావేశాలకు టీపీసీసీ ముఖ్యులతోపాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు హాజరుకానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా కాంగ్రెస్‌ దృష్టి సారించింది. గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. సమీక్షతోపాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై వీరు రాహుల్‌తో చర్చించినట్టు తెలిసింది. దీంతోపాటు కొత్త జిల్లాలవారీగా 33 డీసీసీ, బ్లాక్, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులను ఈ నెల 10వ తేదీలోగా నియమించాలని రాహుల్‌ ఆదేశాలిచ్చారు.  

షెడ్యూల్‌ ఇదే...! 
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై శుక్రవారం నుంచి మూడు రోజులపాటు (ఆదివారం మినహా) గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ సమీక్షాసమావేశాలు నిర్వహించనుంది. ఎన్నికలకు ముందు ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సలీం అహ్మద్, శ్రీనివాసకృష్ణన్‌లు ఇన్‌చార్జీలుగా పార్లమెంటరీ నియోజకవర్గాలవారీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు కూడా అదే పార్లమెంటరీవారీగా సమీక్షలు జరపనున్నారు. తొలుత శుక్రవారం శ్రీనివాసకృష్ణన్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, జహీరాబాద్, వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గాలు, శనివారం సలీం అహ్మద్‌ ఇన్‌చార్జిగా ఉన్న నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలు, సోమవారం రోజున బోసు రాజు ఇన్‌చార్జిగా ఉన్న మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మెదక్, చేవెళ్ల నియోజకవర్గాల సమీక్షలు జరగనున్నాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై గంటపాటు సమీక్ష జరుగుతుందని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమీక్షల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలపై లోతుగా చర్చ ఉంటుందని, గ్రామపంచాయతీ ఎన్నికలపై చర్చతోపాటు లోక్‌సభ ఎన్నికలపై పరిశీలన ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. సమావేశాల్లో 33 జిల్లాలకు డీసీసీ అధ్యక్ష నియామకంపై కసరత్తు చేస్తామని తెలిపారు.  

లోక్‌సభ అభ్యర్థులకు ఆహ్వానం 
ఈ సమావేశాలకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులను కూడా ఆహ్వానిస్తున్నారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై వారితో చర్చించడంతోపాటు వారి అభిప్రాయాలను కూడా టీపీసీసీ పెద్దలు తెలుసుకోనున్నారు. అయితే, రానున్న పంచాయతీ, లోక్‌సభ ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులే ఇన్‌చార్జీ లుగా ఉంటారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేయని స్థానాల్లో గతంలో ఇన్‌చార్జీలుగా ఉన్నవారే కొనసాగనున్నట్టు సమాచారం.

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుతాం: ఉత్తమ్‌ 
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధంలేకుండా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ సత్తా చాటుతుందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఆర్సీ కుంతియాతో ఆయన సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంపై పార్టీ అధినేత రాహుల్‌గాంధీ ఇచ్చిన ఆదేశాలపై చర్చించారు. తెలంగాణ కాంగ్రెస్‌పార్టీని పూర్తి స్థాయిలో రానున్న అన్ని ఎన్నికలకు సమాయత్తం చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత ప్రదేశ్‌ ఎన్నికల కమిటీని తగ్గించి కొత్తగా 15 మందితో కమిటీ ఏర్పాటుతోపాటు లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించనున్నట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top