సర్వీస్‌ చార్జీలు ఇస్తే.. మాకు ఓకే! 

Telangana Asks Bison Polo Ground To New Secretariat - Sakshi

బైసన్‌పోలో అప్పగింతపై రక్షణ శాఖ యోచన 

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన 

సీఎం అంగీకరిస్తే అడుగు ముందుకు 

సాక్షి,హైదరాబాద్‌: బైసన్‌పోలో మైదానంలో సచివాలయ నిర్మాణంపై మళ్లీ కదలిక మొదలైంది. మంగళవారం హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు రక్షణ శాఖలో కసరత్తు తిరిగి ప్రారంభం కానుంది. కంటోన్మెంట్‌ ప్రాంతంలోని బైసన్‌పోలో మైదానం ఆవరణలో సచివాలయం నిర్మించినున్నట్లు 2015లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ మేరకు ప్రధానితో పాటు, రక్షణ శాఖ మంత్రిని కలసి సహకరించాల్సిందిగా కోరారు. తదనుగుణంగా భూ బదలాయింపునకు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలపడంతో కంటోన్మెంట్, రక్షణ, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ విభాగాల అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది.

60 ఎకరాల పరిధిలోని బైసన్‌ పోలో, జింఖానా మైదానాలను సచివాలయానికి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను మిలిటరీ అధికారులు అంగీకరించారు. అలాగే ప్యాట్నీ నుంచి హకీంపేట, ప్యారడైజ్‌ నుంచి బోయిన్‌పల్లి చెక్‌పోస్టు వరకు రెండు స్కైవేల నిర్మాణానికి మరో 90 ఎకరాలు అవసరం అవుతుందని కమిటీ సర్వేలో తేలింది. 150 ఎకరాల కంటోన్మెంట్‌ స్థలానికి బదులు మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలో ఆర్మీ రైఫిల్‌ రేంజ్‌ కోసం 513 ఎకరాలు బదలాయిం చేం దుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 

 సర్వీసు చార్జీలే అడ్డంకి 
కంటోన్మెంట్‌ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం వల్ల కంటోన్మెంట్‌ బోర్డు కోల్పోయే ఆదాయాన్ని సర్వీసు చార్జీల రూపంలో చెల్లించాల్సిందిగా కంటోన్మెంట్‌ అధికారులు కోరారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అనడంతో బైసన్‌ పోలో మైదానంలోకి సచివాలయం ఏర్పాటు ప్రతిపాదన అటకెక్కింది. తాజాగా సచివాలయానికి కంటోన్మెంట్‌ స్థలాల అప్పగింతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణకు హైకోర్టు అంగీకరించడంతో ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. సర్వీసు చార్జీల అంశంలో కంటోన్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఏకాభిప్రాయం కుదిరితే సచివాలయం ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయే అవకాశముంది. భూ బదలాయింపుతో పాటు కోరిన మొత్తాన్ని సర్వీసు చార్జీలుగా చెల్లించేందుకు ప్రభుత్వం ఒకే అంటే, భూములు అప్పగించే యోచనలో రక్షణ శాఖ ఉన్నట్లు
తెలిసింది.

ప్రాథమిక అంగీకారం తెలిపాం 
 కొత్త సచివాలయం నిర్మాణానికి సికింద్రాబాద్, బైసన్‌పోలో గ్రౌండ్‌ను బదలాయించేందుకు ప్రాథమికంగా అంగీకారం తెలిపామని, కొన్ని షరతులు విధించామని కేంద్రం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. ఈ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపాల్సి ఉందని పేర్కొంది. తమ షరతులకు అంగీకారం తెలిపిన తర్వాతే బైసన్‌పోలో గ్రౌండ్‌ బదలాయింపుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని వివరించింది. ఈ కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల బదలాయింపు విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోలేకపోతోందని  నివేదించింది. అందువల్ల త్వరితగతిన ఈ కేసులో విచారణ జరపాలని అభ్యర్థించింది. దీంతో ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 12న విచారణ జరుపుతామని, ఈ కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేనందున, ఈ లోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదింపులు, ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బైసన్‌పోలో, జింఖానా మైదానాలను సచివాలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించకుండా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ డీజీపీ ఎంవీ భాస్కరరావు, మాజీ క్రికెటర్‌ వివేక్‌ జయసింహతో పాటు మరో ఇద్దరు 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఇదే అంశంపై జి.కరుణాకర్‌ అనే వ్యక్తి కూడా ఆ తర్వాత పిల్‌ దాఖలు చేశారు. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు.. మంగళవారం మరోసారి విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సునీల్‌ బి.గాను, వీవీఎన్‌ నారాయణరావులు వాదనలు వినిపిస్తూ.. 2017లో ఈ వ్యాజ్యాలు దాఖలు చేశామని, ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతోందని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు కూడా లేవన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. సచివాలయ నిర్మాణం కోసం బైసన్‌పోలో గ్రౌండ్‌ను బదలాయించేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) కె.లక్ష్మణ్‌ స్పందిస్తూ.. బైసన్‌పోలో గ్రౌండ్‌ బదలాయింపు విషయంలో ప్రాథమిక అంగీకారం తెలిపిన మాట వాస్తవమేనని, అయితే ఇదే సమయంలో కొన్ని షరతులు కూడా విధించామని తెలిపారు. ఈ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ షరతులకు అంగీకారం తెలిపిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని 
వివరించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top