ఒకే ఒక్కడు!

TDP MLA Revanth Reddy resigns from party - Sakshi

 తెలుగుదేశం పార్టీకి రేవంత్‌ రాం రాం 

 పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా 

 కాంగ్రెస్‌ గూటికి చేరడమే తరువాయి.. 

 జిల్లాలో మారనున్న రాజకీయ సమీకరణాలు 

 పార్టీని వీడే అంశంపై శ్రేణుల ఊగిసలాట 

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పదేళ్ల అనుబంధం వీడింది. టీడీపీలో చేరిన స్వల్పకాలంలోనే అత్యున్నత పదవులను అలంకరించిన ఆయన ప్రస్థానం ముగిసింది. రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన కొడంగల్‌ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి సైకిల్‌ దిగారు. పిన్న వయస్సుల్లో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి ఎదిగిన ఆయన.. ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి దీపావళి వేళ బాంబు పేల్చిన రేవంత్‌.. ఊహించినట్లుగానే శనివారం పచ్చపార్టీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వం మొదలు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి జిల్లా రాజకీయాల్లో సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు. రాజకీయ భవితవ్యంపై ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపిన రేవంత్‌.. భవిష్యత్తులో కాంగ్రెస్‌తో చేతులు కలపనున్నారు. తాజా పరిణామాలతో  జిల్లాలో సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరలేచాయి. ఒకవేళ ఆయన రాజీనామాను గనుక స్పీకర్‌ ఆమోదిస్తే ఉప ఎన్నిక అనివార్యం కానుంది. దీంతో కొడంగల్‌ ఉపపోరు వచ్చే సాధారణ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.   

ఒకే ఒక్కడు! 
ఒకప్పుడు కాంగ్రెస్సే ఆయనకు ప్రధాన ప్రత్యర్థి. నేడు అదే పార్టీ గూటికి చేరే పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశంలో కొనసాగుతూ.. టీఆర్‌ఎస్‌ను సమర్థంగా ఎదుర్కొలేనని భావించిన రేవంత్‌ ఊహించని మలుపుల మధ్య కాంగ్రెస్‌కు చేరువయ్యారు. ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లిన అనంతరం కేసీఆర్‌పై ఒంటికాలుపై లేస్తున్న రేవంత్‌ వచ్చే ఎన్నికల్లో ఆయనను ఢీకొనాలంటే కాంగ్రెస్సే సరైన వేదిక అని భావించారు. ఈ దిశగా గత రెండు నెలలుగా మేథోమధనం జరిపి చివరకు తొమ్మిదేళ్ల టీడీపీకి రాం రాం చెప్పారు. 

వ్యూహాత్మక మౌనం 
కొడంగల్‌ టీడీపీకి కంచుకోట. పార్టీకి బలమైన నాయకత్వం లేనప్పటికీ సంస్థాగతంగా పటిష్టంగా ఉంది. కష్టకాలంలోనూ శ్రేణులు వెన్నంటి నిలవడంతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశానికి ఎదురులేకుండా పోయింది. 2009లో రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో అడుగుపెట్టడంతో పార్టీ మరింత బలపడింది. తాజాగా ఆయన రాజీనామాతో తెలుగుతమ్ముళ్లు డైలామాలో పడ్డారు. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వ్యూహాత్మక మౌనం పాటించిన ద్వితీయ శ్రేణి నాయకత్వం.. తమ నేత నిర్ణయంతో ఆత్మరక్షణలో పడ్డారు. 

ఈ నేపథ్యంలో రాజీనామాకు దారితీసిన పరిస్థితులను తమకు వివరించిన తర్వాతే.. రేవంత్‌ను అనుసరించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు రేవంత్‌రెడ్డి బాటలో పయనించే దిశగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పలువురు నేతలు మంతనాలు జరుపుతున్నారు. పాత రంగారెడ్డి జిల్లా పరిధిలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఉనికి కోల్పోయినప్పటికీ, అక్కడక్కడా మిగిలి ఉన్న శ్రేణులు కొన్నాళ్లుగా రేవంత్‌ వెంటే నడుస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆయన బాటలో కొనసాగాలా? ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలా? అనే అంశంపై పార్టీ కేడర్‌ మల్లగుల్లాలు పడుతోంది. 

పదేళ్లలో నాలుగు పదవులు 
పదేళ్ల కాలంలో నాలుగు పదవులను అధిరోహించారు. ఈ పదవులన్ని ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే సాధించారు. 2006లో మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ జెడ్పీటీసీగా స్వతంత్రంగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత ఆయనకు ఎదురులేకుండా పోయింది. 2008లో ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా స్వతంత్రంగా బరిలో సంచలనం విజయం నమోదు చేశారు. ఎమ్మెల్సీగా ఉండగానే కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి కాంగ్రెస్‌పై 7వేల మెజారిటీతో విజయం సాధించారు. 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై 15వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. రేవంత్‌రెడ్డి తన రాజకీయ జీవితంలో నాలుగు రాజ్యాంగ పదవులను చేజిక్కించుకున్నారు. 

రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం
కొడంగల్‌ : తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసిన స్థానిక ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి శనివారం రాత్రి అమరావతి నుం చి నేరుగా కొడంగల్‌కు చేరుకున్నారు. రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు వస్తున్నారనే విషయం తెలుసుకున్న టీడీపీ నాయ కులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. లాహోటీ కాలనీ ప్రధాన రహదారి నుంచి ఆయన నివాసం వరకు టపాసులు కాల్చి స్వాగతం పలికారు. కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న రేవంత్‌కు అండగా ఉంటామని నినాదాలు చేశారు. రేవంత్‌రెడ్డిని చేతుల మీద ఎత్తుకొని ఆయన నివాసం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఆదివారం ఉదయం నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్‌ కార్యాచరణ గురించి చర్చిస్తానన్నారు. తనను అభిమానిస్తున్న నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. తమ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అని తల ఎత్తుకొని చెప్పుకునే విధంగా హుందాగా ప్రవర్తిస్తానని అన్నారు. తనను అభిమానించే నాయకులు, కార్యకర్తలు ఆదివారం కొడంగల్‌కు రావాలని కోరారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top