
సాక్షి, హైదరాబాద్ : మాంసాన్ని అధిక ధరలకు విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. అధిక ధరకు మాంసం విక్రయించే దుకాణాలను సీజ్ చేస్తామన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో చికెన్, మటన్, చేపల లభ్యతపై పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాంసం ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా గొర్రెలు, మేకల సరఫరా నిలిచిపోవడంతో మటన్ ధరలు పెరిగాయని తెలిపారు. ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గొర్రెలు, మేకల పెంపకం దారులు వాటిని విక్రయించుకునేందుకు వీలుగా అనుమతుల కోసం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు.
(చదవండి : పారిశుధ్య కార్మికులకు కరోనా ఎఫెక్ట్!)
కాగా, లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో మాంసం ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు కిలో రూ.50 పలికి చికెన్ ఇప్పుడు 180 పలుకుతోంది. ఇక మటన్ ధర కూడా విపరీతంగా పెరిగింది. కిలో మటన్ రూ.800 నుంచి రూ.1000 దాకా పలుకుతోంది. కరోనా పుకార్లతో మొన్నటి వరకు నష్టపోయామంటున్న వ్యాపారులు.. ఇప్పుడు లాక్‌డౌన్‌ను క్యాష్ చేసుకుంటున్నారు.