పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలి

Support price for yellow crops should be given - Sakshi

కేంద్రాన్ని కోరిన ఎంపీ కల్వకుంట్ల కవిత 

సాక్షి, హైదరాబాద్‌: పసుపుకు మద్దతు ధర ఇవ్వాలని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని కోరారు. ‘పసుపు సాగు.. ఎగుమతులు’అనే అంశంపై సోమవారం వర్క్‌షాప్‌ జరిగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రధానితో పాటు కేంద్ర వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల మంత్రులను కలిశానని, ఐదుగురు ముఖ్యమంత్రులు పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతుగా లేఖలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. రబ్బర్, సిల్క్‌కు బోర్డు ఏర్పాటు చేసిన విధంగానే పసుపుకూ ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

ఉడకబెట్టిన పసుపు ఎండబెట్టేందుకు యంత్రాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయో లేదో కేంద్రం అధ్యయనం చేయాలని కోరారు. మేలైన రకాల పసుపు విత్తనాలను అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని పలుమార్లు కోరామన్నారు. అయితే బోర్డు ఏర్పాటు కుదరదని, ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు చెప్పారన్నారు. ఆ విధంగానే పసుపు సెల్‌ ఏర్పాటు చేశారని ఆమె వివరించారు. 1990లో 7 లక్షల మెట్రి క్‌ టన్నుల పసుపు ఉత్పత్తి కాగా నేడు 3 లక్షల మెట్రిక్‌ టన్నులకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు శాతమే పసుపు ఎగుమతి జరుగుతోందన్నారు.  

గతంలో ఎంపీలు పట్టించుకోలేదు: జీవన్‌రెడ్డి 
గతంలో ఎంపీలు పసుపు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. కవిత ఎంపీ అయ్యాక పసుపు రైతుల గురించి అనేకసార్లు కేంద్రంతో చర్చలు జరిపారన్నారు. అనేక రాష్ట్రాలు తిరిగి పసుపుపై అధ్యయనం చేశారన్నారు. ప్రత్యేక పసుపు సెల్‌ ఏర్పాటుకు ఎంపీ కవితనే కారణమన్నారు. నిజామాబాద్‌ జిల్లా రైతాంగం ఎంపీ కవితకు రుణపడి ఉంటారన్నారు. ఎమ్మెల్యే షకీల్‌ మాట్లాడుతూ, ఎంపీ కవిత కృషి వల్ల పసుపుకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారన్నారు. పసుపు బోర్డు కోసం అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశామని గుర్తు చేశారు. కాగా, ఈ వర్క్‌ షాప్‌లో రైతులు, ట్రేడర్లు, సైంటిస్టులు, అధికారులు ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. పలు అంశాలపై నిపుణులు సందేహ నివృత్తి చేస్తూ పసుపు ఉత్పాదకత పెంపు, సాగులో మెళకువలు, మార్కెట్‌ వ్యూహాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్పైసెస్‌ బోర్డు వరంగల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ లింగప్ప, కొచ్చి మార్కెటింగ్‌ డైరెక్టర్‌ పీఎం.సురేశ్‌కుమార్, పరిశోధన, అభివృద్ధి విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ ఏబీ రేమాశ్రీ తదితరులు పాల్గొన్నారు. 

కేంద్రానికి రైతుల డిమాండ్లు.. 
- పసుపు కుర్కుమిన్‌ నాణ్యతను పరీక్షించే విధానం వ్యవసాయ మార్కెట్లలో ఉండాలి.  
- ధర పడిపోయినప్పుడు నిల్వ చేసుకునేందుకు కోల్డ్‌ స్టోరేజీలను ఏర్పాటు చేయాలి.  
- పసుపును ఆరబెట్టేందుకు సామూహిక కల్లాలను నిర్మించాలి.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top