డిగ్రీలో సగం ఖాళీలే..! 

Students Not Interested To Join Degree Course In Khammam - Sakshi

సాక్షి, పాల్వంచ: అర్హత కలిగిన లెక్చరర్లు, అధునాతన భవన సముదాయాలు ఉన్నా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు భర్తీ కావడం లేదు. వాటిలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించడం లేదు. ఉమ్మడి జిల్లాలో 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అయితే వీటిలో అడ్మిషన్లు సక్రమంగా లేక సుమారు సగం సీట్లు ఖాళీగానే ఉన్నాయి. దీంతో కళాశాలల మనుగడ ప్రశార్థకంగా మారే ప్రమాదం ఏర్పడింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఆన్‌లైన్‌ (దోస్త్‌) ద్వారా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

అయితే విద్యార్థులు నామమాత్రంగానే చేరడంతో ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బతిమిలాడాల్సి వస్తోంది. వేల రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేటు కళాశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కాలేజీలకు మాత్రం పంపించడం లేదు.   

కొరవడిన పర్యవేక్షణ... 
ప్రభుత్వ కళాశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళాశాలలో సరిపడా బోధన సిబ్బంది ఉండడం లేదు. ఇక అనేక కాలేజీల్లో ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాళ్లే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 డిగ్రీ కళాశాలలు ఉండగా.. నలుగురు మాత్రమే రెగ్యులర్‌ ప్రిన్సిపాళ్లు ఉన్నారు. మిగిలిన ఏడుగురు ఇన్‌చార్జీలే. ప్రభుత్వ కాలేజీల్లో ఇలాంటి సమస్యలు నెలకొనడంతో.. తమ పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకునే తల్లిదండ్రులు ఎంత కష్టమైనా భరించి ప్రైవేటు కళాశాలల్లోనే చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఖాళీ సీట్ల వివరాలిలా... 
పాల్వంచలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 420 సీట్లు ఉండగా అందులో 221 మాత్రమే భర్తీ అయ్యాయి. 199 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కొత్తగూడెంలోని కళాశాలలో 360 సీట్లకు 180 భర్తీ అయ్యాయి. మరో 180 ఖాళీగా ఉన్నాయి. భద్రాచలం కళాశాలలో 540 సీట్లకు 418 భర్తీ అయ్యాయి. 122 ఖాళీగా ఉన్నాయి. మణుగూరులో 420 సీట్లకు 162 మాత్రమే భర్తీ అయ్యాయి. 258 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇల్లెందు డిగ్రీ కాలేజీలో 360 సీట్లు ఉండగా 105 భర్తీ అయి,  255 ఖాళీగా ఉన్నాయి. 

ఖమ్మం జిల్లాలో..  
ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో 1500 సీట్లకు 1391 భర్తీ కాగా, 109 ఖాళీగా ఉన్నాయి. మహిళా డీగ్రీ కళాశాలలో 480 సీట్లకు 271 మంది విద్యార్థినులు అడ్మిషన్లు పొందారు. ఇంకా 209 సీట్లు ఖాళీగా ఉన్నాయి. నేలకొండపల్లిలో 420 సీట్లు ఉండగా 39 అడ్మిషన్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ మరీ దారుణంగా 371 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మధిరలో 180 సీట్లు ఉండగా 47 అడ్మిషన్లు రాగా,  133 ఖాళీగా ఉన్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలోకి వెళ్లిన గార్ల కళాశాలలో 420 సీట్లకు 35 భర్తీ అయి 385 ఖాళీగా ఉన్నాయి. సత్తుపల్లిలో 600 సీట్లకు 400 భర్తీ కాగా ఇంకా 200 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top