బంద్ ప్రశాంతం

బంద్ ప్రశాంతం


 సాక్షి నెట్‌వర్క్: పోలవరం ముంపు ప్రాంతంలోని ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ లోక్‌సభలో బిల్లు ఆమోదించడాన్ని నిరసిస్తూ టీజేఏసీ పిలుపు మేరకు శనివారం బంద్ ప్రశాంతంగా ముగిసింది. బోనాల నేపథ్యంలో మినహాయింపు ఇచ్చిన సికింద్రాబాద్ మినహా తెలంగాణవ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరిగింది. పది జిల్లాల్లోనూ దాదాపుగా జనజీవనం స్తంభించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, సినిమాహాళ్లను స్వచ్ఛందంగా మూసివేశారు. పాఠశాలలు, కళాశాలలు ముందే సెలవు ప్రకటించాయి. బస్సులు డిపోలకే పరిమితమైపోయాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, న్యూడెమొక్రసీ నేతలు, టీజేఏసీ, ప్రజా, ఉద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. హైదరాబాద్‌లో టీజేఏసీ చైర్మన్ కోదండరాం సహా పార్టీలు, సంఘాల నేతలు 300 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

 

 ముంపు మండలాలను ఏపీలో కలపడాన్ని నిరసిస్తూ చేపట్టిన బంద్ ఖమ్మం జిల్లాలో శనివారం బంద్ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఖమ్మం పట్టణంతో పాటు, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, మణుగూరు, మధిర, వైరా, పాలేరు నియోజకవర్గాల్లో సంపూర్ణంగా జరిగింది. ఎక్కడా బస్సులు డిపోల నుంచి బయటికి రాలేదు. వ్యాపార సముదాయాలు, సినిమాహాళ్లు, పెట్రోల్‌బంక్‌లు, విద్యాసంస్థలు మూసివేశారు. వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ పార్టీలు, వాటి అనుబంధ సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొని ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు. పోలవరం వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలంలో ప్రదర్శన నిర్వహించారు.

 

 అరెస్టులు, స్వల్ప ఉద్రిక్తత మధ్య...

 

  హైదరాబాద్‌లో స్వల్ప ఉద్రిక్తతల మధ్య ప్రశాంతంగా జరిగింది. మొజంజాహీ మార్కెట్, ఆర్టీసీక్రాస్‌రోడ్డు, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, బేగంపేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో దుకాణాలు, విద్యాలయాలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లను ఆందోళనకారులు మూసివేయించారు. ఆర్టీసీ సర్వీసులు దాదాపుగా నిలిచిపోయాయి. ఎంఎంటీఎస్ రైళ్లు యధావిధిగా నడిచాయి. టీఆర్‌ఎస్, వామపక్షాల నేతలు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఆందోళనకు దిగారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సహా సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ తదితర పార్టీల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ జాగృతికి చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు తెలంగాణ జాగృతి నేతలను అరెస్టు చేశారు. ప్రజా గాయకుడు గద్దర్, వేదకుమార్ సహా పలువురు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ధూంధాం, ఆటాపాటలతో నిరసన తెలిపారు. మొత్తంగా హైదరాబాద్ జంట కమిషనరేట్లలో సుమారు 300 మంది ఆందోళనకారులను అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

 

 నిరసనల వెల్లువ..

 

 ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ బిల్లు ఆమోదించడంపై వరంగల్ జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శనివారం బంద్‌కు టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు తెలిపారుు. ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పలు చోట్ల ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. బంద్‌కు వ్యాపార, వాణిజ్యవర్గాలు, విద్యాసంస్థలు సంపూర్ణ సహకారం అందించడంతో వరంగల్‌తోపాటు జిల్లాలోని ప్రధాన పట్టణాలు బోసిపోయి కనిపించాయి. ఆర్టీసీ బస్సులు సాయంత్రం వరకూ డిపోలకే పరిమితమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో బంద్ పూర్తిగా విజయవంతమైంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీతో పాటు టీజేఏసీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. మోడీ, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. విద్యాసంస్థలు ముందే బంద్ ప్రకటించాయి. ఆదిలాబాద్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరిగింది. మంచిర్యాల, బెల్లంపల్లి, నిర్మల్‌ల్లో బంద్ సంపూర్ణంకాగా.. ఆదిలాబాద్, ఊట్నూర్, చెన్నూర్, ఆసిఫాబాద్, భైంసా ప్రాంతాల్లో పాక్షికంగా జరిగింది. టీడీపీ, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో బంద్ సంపూర్ణమైంది. జిల్లా కేంద్రంతో పాటు అన్ని చోట్లా ప్రజలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ పాటించాయి. జిల్లాలోని ఆరు డిపోల నుంచి బస్సులు సాయంత్రం వరకు బయటికి రాలేదు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ, సీపీఎం, పీడీఎస్‌యూ, జేఏసీ నాయకులు నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. పలుచోట్ల మోడీ, చంద్రబాబు, వెంకయ్య దిష్టిబొమ్మలను దహనం చేశారు.

 

 ధర్నాలు, రాస్తారోకోలతో ధూంధాం..

 

 నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులను స్వచ్ఛందంగా మూసివేశారు. పలుచోట్ల ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నల్లగొండలో ఆర్టీసీ డిపో ఎదుట టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, జేఏసీ నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తిప్పర్తిలో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. చౌటుప్పుల్, నకిరేకల్, సూర్యాపేట, కోదాడల్లో ప్రధాన జాతీయ రహదారిపై టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ నాయకులు రాస్తారోకో చేశారు. మిర్యాలగూడ, భువ నగిరిలో ధర్నాలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం బంద్ ప్రశాంతంగా జరిగింది. పెట్రోలు బంక్‌లు, సినిమా థియేటర్లు, బ్యాంకులు, ఇతర వ్యాపార సంస్థలను మూసివేశారు. సాయంత్రం వరకూ జిల్లాలోని అన్ని డిపోల పరిధిలోని బస్సులు ఎక్కడికక ్కడ నిలిచిపోయాయి. జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా, ఉద్యోగ సంఘాలు నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి. మోడీ, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు.

 

 మోడీ, బాబు దిష్టిబొమ్మల దహనాలు..

 

 ముంపు మండలాలను ఏపీలో కలపడాన్ని నిరసిస్తూ చేపట్టిన బంద్ మెదక్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం, మోడీ దిష్టిబొమ్మలను ఆందోళనకారులు దహనం చేశారు. పలుచోట్ల రాస్తోరోకోలు చేసి, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నారాయణ్‌ఖేడ్, సిద్ధిపేట, జోగిపేట, గజ్వేల్, మెదక్, జహీరాబాద్‌ల్లో బంద్ ప్రభావం అధికంగా కనిపించింది. రంగారెడ్డి జిల్లా తాండూరు, పరిగి, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, వికారాబాద్ డిపోల్లో నుంచి శనివారం బస్సులు బయటకు రాలేదు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. పలు సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top