పెరిగిన అంచనాలకు ఓకే! | State Cabinet Meeting on Irrigation Water Projects | Sakshi
Sakshi News home page

పెరిగిన అంచనాలకు ఓకే!

Jul 28 2018 2:46 AM | Updated on Jul 28 2018 2:46 AM

State Cabinet Meeting on  Irrigation Water Projects - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో సాగునీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న సీతారామ ఎత్తిపోతల, ఇందిరమ్మ వరద కాల్వ(ఎఫ్‌ఎఫ్‌సీ)ల అంచనా వ్యయాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో రీ డిజైనింగ్‌ జరిగిన నేపథ్యంలో మార్పులు జరగడంతో సీతారామ అంచనా వ్యయం రూ.7,926.14 కోట్ల నుంచి రూ.13,057 కోట్లకు పెరగ్గా, ఎఫ్‌ఎఫ్‌సీ అంచనా వ్యయం రూ.4,729.26 కోట్ల నుంచి రూ.9,886.27 కోట్లకు పెరిగింది. ఈ పెరిగిన అంచనా వ్యయాలకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.  

మార్పులకు తగ్గట్టే పెరిగిన వ్యయాలు
శుక్రవారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ముఖ్యంగా సీతారామ, ఎఫ్‌ఎఫ్‌సీ పరిధిలో జరిగిన మార్పులు, పెరిగిన వ్యయాలపై చర్చించింది. సీతారామ ఎత్తిపోతలతో మొదట 50 టీఎంసీల గోదావరి నీటితో 5 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని భావించారు. దీనికోసం రూ.7,926.41 కోట్లతో పరిపాలనా అనుమతి ఇచ్చారు.

అనంతరం సీతారామ ద్వారా 9.30 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. తొలి దశలో 70 టీఎంసీల నీటిని తీసుకుని 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. దీంతో మార్పులు అనివార్యమయ్యాయి. ప్రధాన కాల్వ ద్వారా తొలుత 4,545 క్యూసెక్కుల నీటిని తీసుకోవాలని భావించగా, దాన్ని 9 వేల క్యూసెక్కులకు పెంచారు. దీంతో భూసేకరణ అవసరం 5,800 హెక్టార్ల నుంచి 7,402 హెక్టార్లకు పెరిగింది. 

భూసేకరణకు రూ.1,342 కోట్లు లెక్కించగా, అది ప్రస్తుతం రూ.2,011 కోట్లకు పెరిగింది. కాల్వ వ్యవస్థలో మార్పులకు అదనంగా మరో రూ.1,615 కోట్ల వ్యయం పెరుగుతోంది. నీటిసామర్థ్యం పెంచడంతో గతంలో 380 మెగావాట్ల విద్యుత్‌ అవసరాలను లెక్కించగా ప్రస్తుతం 715 మెగావాట్లుగా లెక్కించారు. దీంతో ఈ విద్యుత్‌ సరఫరా అవసరాల వ్యయం రూ.1,298 కోట్ల నుంచి రూ.3,264 కోట్ల మేర పెరుగుతోంది. మొత్తంగా ప్రాజెక్టు వ్యయం రూ.13,057 కోట్లకు చేరగా దీన్ని శుక్రవారం కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపారు.  

51 ప్యాకేజీలకు గడువు పొడిగింపు
ఇక ఎఫ్‌ఎఫ్‌సీ వరద కాల్వను రూ.4,729.26 కోట్లతో చేపట్టగా, రీ ఇంజనీరింగ్‌లో దీని పరిధిలోని గౌరవెల్లి రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 1.4 టీఎంసీ నుంచి 8.23 టీఎంసీలకు, గండిపల్లి సామర్థ్యాన్ని 0.15 నుంచి 1 టీఎంసీ సామర్థ్యానికి పెంచారు. ఆయకట్టు సైతం 2.20 లక్షల ఎకరాలు ఉండగా మరో 32 వేల ఎకరాలకు పెంచారు.

దీంతో వ్యయం రూ.9,886.27 కోట్లకు పెరగ్గా, దీనికి కేబినెట్‌ ఓకే చేసింది. దీంతో పాటే మిడ్‌మానేరు పరిధిలోని మన్వాడ గ్రామాన్ని పునరావాస గ్రామంగా గుర్తించేందుకు అనుమతించింది. ఇక వీటితో పాటే జీవో 146 కింద ఎస్కలేషన్‌ ఇచ్చిన 51 ప్యాకేజీల పనులు భూసేకరణతో పూర్తి కాకపోవడంతో వాటి గడువును మరింత కాలం పొడిగించాలని కేబినెట్‌ నిర్ణయించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement