మెట్ల దారులు.. మహా‘బావులు’

Stair Paths and huge wells

మన రాష్ట్రంలోనూ ‘వావ్‌..’ అనిపించేలా మెట్ల బావులు

అబ్బురపరుస్తున్న అలనాటి ఏర్పాట్లు

తొలిసారి తెలంగాణలో లెక్కతేల్చేందుకు సమాయత్తం

పీఎంవోకు సామాన్యుడి లేఖతో కదలిక

వందకుపైగా ఉన్నట్లు ప్రాథమిక అంచనా.. ఆర్కిటెక్ట్‌ల బృందం స్వచ్ఛంద అధ్యయనం  

విశాలమైన ప్రాంగణం.. చుట్టూ శిల్ప సౌందర్యంతో కొలువు దీరిన నాలుగు మంటపాలు.. ఒక్కో మంటపం పక్కనుంచి దిగువకు రెండేసి మెట్ల దారులు.. మధ్యలో మళ్లీ మంటపం.. దాని పక్కన నాలుగు చొప్పున గదులు.. ఒకవైపు లోనికి చొచ్చుకొచ్చిన భారీ అరుగు.. దానిపై నుంచుని చూస్తే నిర్మాణం మొత్తం కనిపించే ఏర్పాటు.. తిరగేసిన పిరమిడ్‌ ఆకృతిలో దిగువకు మెట్ల నిర్మాణం..! ఉమ్మడి మెదక్‌ జిల్లా ఆందోల్‌ సమీపంలోని కిచ్చనపల్లిలోని మెట్లబావి ఇది!! 

అసలు దీన్ని ఎవరు నిర్మించారు.. ఎందుకు నిర్మించారన్న విషయం అధికారికంగా ఇప్పటి వరకు వెలుగుచూడలేదు.. పురావస్తుశాఖ రక్షిత కట్టడాల జాబితాలో కూడా అది లేదు. ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలో ఇలాంటి బావులెన్నో. దేవాలయాలకు అనుబంధంగా కోనేరు, పుష్కరిణులుగా కొన్ని ఉండగా మరికొన్ని విడిగా ఉన్నాయి. అసలు ఇలాంటివి ఎన్ని ఉన్నాయో ఇప్పటివరకు అధికారికంగా లెక్క లేదు. ఆలనాపాలనా లేకపోవటంతో వాటిలో కొన్ని రూపుకోల్పోగా, మరికొన్ని కనుమరుగయ్యాయి. ఇప్పటికీ దాదాపు వంద వరకు భద్రంగానే ఉన్నట్టు అంచనా. వాటికి మరమ్మతు చేస్తే మరికొన్ని వందల ఏళ్ల వరకు ఠీవిగా నిలిచి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: రాణీ కీ వావ్‌.. ఎనిమిది అంతస్తులు, చూడచక్కని శిల్పాలతో తీర్చిదిద్దిన అద్భుత నిర్మాణం.. ఓ ప్యాలెస్‌ నిర్మాణంలో ఉండే పనితనం దాని సొంతం.. ఇంతా చేస్తే అదో దిగుడు మెట్ల బావి! కానీ ప్రపంచఖ్యాతి దాని సొంతం. గుజరాత్‌లో కొలువుదీరిన ఈ అద్భుత నిర్మాణాన్ని చూసేందుకు విదేశీ పర్యాటకులు క్యూ కడతారు. పురాతన మెట్ల బావులనగానే మనకు టక్కున గుర్తొచ్చే ప్రాంతాలు గుజరాత్, రాజస్తాన్‌. మరి అలాంటి అద్భుత బావులు ఆ రాష్ట్రాలకే పరిమితమా?కానే కాదు.. అందమైన, అంతకుమించి అద్భుతమైన మెట్ల బావులు మనకూ సొంతమే. ఒకటి కాదు రెండు కాదు.. వందకు పైగా చారిత్రక మెట్ల బావులు తెలంగాణలో అలరారుతున్నాయన్న సంగతి మీకు తెలుసా? వందల ఏళ్ల క్రితం నిర్మితమైన ఆ అరుదైన, అబ్బురపరిచే బావుల గురించి చాలామందికి తెలియదు. వీటిపై ప్రధాని కార్యాలయం(పీఎంవో) నుంచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఓ లేఖ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘పురాతన మెట్ల బావుల విషయంలో తీసుకుంటున్న చర్యలేంటి’అన్నది ఆ లేఖ సారాంశం. నగరానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త రాసిన ఉత్తరాన్ని ఉటంకిస్తూ పీఎంవో రాష్ట్రానికి లేఖ రాయడంతో ప్రభుత్వం తొలిసారి ఈ చారిత్రక మెట్లబావులపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి బావులు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చబోతోంది. 

ఓ ఆర్కిటెక్ట్‌ చొరవతో.. 
రాష్ట్రంలో మెట్లబావుల లెక్కతీసి వాటి వివరాలను జనం ముందుంచేందుకు 15 మంది ఆర్కిటెక్టులు ఓ బృందంగా పనిచేస్తున్నారు. ‘ది హైదరాబాద్‌ డిజైన్‌ ఫోరం’అధ్యక్షుడు యశ్వంత్‌ రామమూర్తి ఆధ్వర్యంలో ఈ బృందం పనిచేస్తోంది. ఓ పనిపై యశ్వంత్‌ రామమూర్తి ఆందోల్‌ సమీపంలోని కిచ్చనపల్లికి వెళ్లగా అక్కడి మెట్ల బావి చూసి అబ్బురపడ్డారు. తర్వాత వరంగల్‌ శివారులో కూడా ఇలాంటి బావి చూసి ఆలోచనలో పడ్డారు. అసలు రాష్ట్రంలో ఇలాంటి బావులు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు మరికొందరు ఔత్సాహిక ఆర్కిటెక్టులు జత కలిశారు. అలా 15 మంది బృందంగా ఏర్పడి మొదట్లో జేఎన్‌టీయూ విద్యార్థుల సాయంతో సర్వే మొదలుపెట్టారు. ఇప్పుడు వారే సొంతంగా చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 70 బావులను స్వయంగా చూసి డాక్యుమెంటేషన్‌ చేశారు. మరో 30 బావులున్నట్టు గుర్తించి వాటి అన్వేషణలో ఉన్నారు. వీటిల్లో ప్రధానమైన 30 బావుల్ని ఎంపిక చేసి కార్బన్‌ డేటింగ్‌ ప్రక్రియ ద్వారా అవి ఏ కాలానికి చెందినవో శాస్త్రీయ పద్ధతిలో రూఢీ చేయబోతున్నారు. ఈ మొత్తం వివరాలతో ఓ పుస్తకం రూపొందించి ప్రజల ముందుంచాలన్నది ఈ బృందం ప్రయత్నం. గుజరాత్, రాజస్తాన్‌లలోనే కాదు.. తెలంగాణలోనూ గొప్ప మెట్ల బావులున్నాయని తేల్చబోతున్నారు. పురావస్తు శాఖ కూడా వీరికి సహకరిస్తోంది. 

సామాన్యుడి లేఖతో.. 
నిధులు, సిబ్బంది లేక కునారిల్లుతున్న పురావస్తు శాఖ.. తాను గుర్తించిన రక్షిత కట్టడాలను కూడా పరిరక్షించే పరిస్థితిలో లేదు. ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవటంతో ఆ శాఖ ఇప్పటికే చాలా విషయాల్లో చేతులెత్తేసింది. ఆర్కిటెక్ట్‌ల బృందం చేస్తున్న సర్వే గురించి తెలుసుకున్న ఎన్‌.సాయికుమార్‌ అనే సామాజిక కార్యకర్త ఇటీవల నేరుగా ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు.‘తెలంగాణలో వంద వరకు పురాతన మెట్లబావులున్నట్టు తెలుస్తోంది. నిర్వహణ లేక కనుమరుగవుతున్నాయి. వాటిని సంరక్షించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి’అని అందులో కోరారు. దాన్ని పరిశీలించిన ప్రధాని కార్యాలయం.. ఆ బావుల సంరక్షణ, కార్యాచరణ వివరాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం వెంటనే పురావస్తు శాఖను ఆదేశించటంతో ఆ శాఖ చర్యలు ప్రారంభించింది. 

ఇప్పటికీ ఉపయోగమే.. 
ఈ బావులన్నీ ఊట ఆధారంగా నిర్మితమైనవే. వాటిని పునరుద్ధరిస్తే జల సంపదకు కేంద్రాలుగా మారతాయి. వరంగల్‌ శివారులోని పెద్ద మెట్లబావిని ఇటీవల బాగుచేసేందుకు నీటిని తోడటం పెద్ద సమస్యగా మారింది. తోడిన కొద్దీ ఊటతో నిండిపోయింది. ఊటలను పునరుద్ధరిస్తే ఇవి ఆ ప్రాంతంలోని వారికి తాగునీటిని సరఫరా చేయగలుగుతాయని నిపుణులంటున్నారు. 

ఒక్కోటి ఓ అద్భుతం 
గొప్ప ఇంజనీరింగ్‌ నిర్మాణ కౌశలంతో నిర్మించిన ఆ బావులు చూస్తే అబ్బురమనిపిస్తుంది. వందల ఏళ్ల క్రితం నిర్మించినా కొన్ని ఇప్పటికీ గొప్పగానే నిలిచి ఉన్నాయి. కొన్ని కబ్జా అయి రూపుకోల్పోయాయి. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అందుకు సహకారంగా ఉండేలా మేం డాక్యుమెంటేషన్‌ చేస్తున్నాం
–రామమూర్తి ‘ది హైదరాబాద్‌ డిజైన్‌ ఫోరమ్‌’అధ్యక్షుడు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top