నేతకారుడి అక్షరయాత్ర

Special Story About Chinda Mallesham, Artisan In Sircilla - Sakshi

సాక్షి, సిరిసిల్ల : ఈ భూమి మీద ఇంత వరకు జరిగిన వేల యుద్ధాలు.. ఒక్క ఆడదాని పురిటినొప్పులతో సమానం.’ అంటూ.. అక్షరాలను సంధించే పాళీ.. పదునైన పదాలతో సాహిత్యాన్ని సృజిస్తూ.. అక్షర యాత్రను సాగిస్తున్నాడు సిరిసిల్ల కార్మిక క్షేత్రమైన బీవై నగర్‌కు చెందిన యువకవి చిందం మల్లేశం(30). చిన్నప్పుడు తల్లిదండ్రులు లక్ష్మి, లక్ష్మీనారాయణతో పాటు చేనేత, మరనేత పనిచేసిన మల్లేశం సిరిసిల్ల మరనేత కార్మికుల చావుల రాస్త.. చౌ‘రస్తా’ చూపిస్తాడు.

మరమగ్గాల మధ్య పని చేసిన అనుభవం ఉన్న మల్లేశం మరనేతలోని లోతుపాతులను తన సాహిత్యంలో స్పష్టంగా.. సూటిగా చెప్పారు. అక్షరాలను అవసరం మేరకు సంధిస్తూ.. ఎంతో అనుభవం ఉన్న సాహిత్యకారుడిలా పదాలను వెతికి పట్టుకుని కవిత్వంలో పొందుపరిచారు. యువరక్తం ఆయన కవిత్వంలో ఉరకలేస్తుంది.

నర్మగర్భంగా పాలకుల తప్పులను.. ఎత్తిచూపుతూ.. పేద ప్రజల పక్షాన అక్షర బాంబులను పేల్చుతాడు. అవి నేత కార్మికులు, రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, పసిమొగ్గలపై అత్యాచారాలు సమస్య ఏదైనా పదునైన పదాలతో సాహిత్య సృజన చేస్తాడు మల్లేశం.

అక్షరాలతో గురి పెట్టే పాళీ..
మల్లేశం కలం పేరు ‘పాళీ’.. డిగ్రీ వరకు చదివిన మల్లేశం జిల్లాలోని గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటలో మెడికల్‌ షాపు నిర్వహిస్తూ.. అద్భుతమైన సాహిత్య సేద్యం చేస్తున్నాడు. మట్టివాసనలు.. కష్టాల ఆనవాళ్లు.. కన్నీళ్ల గాఢతను.. చెమటచుక్కల పరిమళాలను తన కవిత్వంలో అక్షీకరిస్తున్నారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలపై పదునైన పదాలతో ప్రశ్నిస్తాడు మల్లేశం.

కలం పేరు పాళీగా సామాజిక మాధ్యమాల్లో కవిత్వాన్ని రాస్తూ.. అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన రాసే కవిత్వం గుండెలోతులను మెలిపెడుతోంది. మల్లేశం సాహిత్యం సమాజాన్ని ప్రశ్నిస్తూనే పాఠకుల మనసును కలికలిచేస్తుంది. ఆయన కవిత్వం నిండా ప్రశ్నల వర్షం కురుస్తుంది. ఆ వర్షం తడి ఆరకముందే మళ్లీ మెరుపులుంటాయి. మల్లేశం సాహిత్యంలో పరిణతి కనిపిస్తుంది.

ఆలోచింప జేసే కవిత్వం..
‘అమ్మ ప్రేమతో పెట్టిన అన్నం అర్ధభాగమే ఉండేది.. వాటి పేరు నూకలంట. కానీ కడుపు ముడుపయ్యేది’. అంటూ పేదలు అనుభవించే కష్టాలను తన అక్షరాల్లో పొందుపరిచారు. ‘దూలం బరువెంతో ఒక నేతగాడికే తెల్సు.. దారం పదునెంతో నేతగాడికే తెల్సు’.. చావుబతుకుల చూపులకు చాలీచాలని బట్ట నేసుకున్న నేతన్నలపై అనేక కవిత్వాలు రాశారు. తెలుగు యూనివర్సిటీలో 2016లోనే 70 ఏళ్ల స్వతంత్రదేశంపై తను రాసిన కవిత్వం ‘‘ఇదే నా దేశం ఇదేనా దేశం’’ వినిపించాడు.

ఆలోచింప జేసే సాహిత్యాన్ని సోషల్‌ మీడియా ద్వారా అందిస్తూ.. ఎంతో మంది అభిమానులను మల్లేశం సంపాదించుకున్నారు. ఆయన రాసిన సాహిత్యానికి మంచి గుర్తింపు లభించింది. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఐఏఎస్‌ అధికారి రమణాచారి, శాసన మండలి మాజీ చైర్మన్‌ మండలి బుద్ధప్రసాద్‌ చేతుల మీదుగా సాహిత్య అవార్డులను అందుకున్నారు.

ప్రముఖ కవి, రచయిత జూకంటి జగన్నాథం, కథా నవలా, రచయిత సినిమా మాటల రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌ ప్రోత్సాహంతో మల్లేశం ముందుకు సాగుతున్నారు. తనకు సాహిత్య స్ఫూర్తి పాండురంగ శాస్త్రి అఠవలె. ఆయన సాహిత్యాన్ని చదివి ప్రేరణ పొందిన మల్లేశం పాళీ కలం పేరుతో కవిత్వాన్ని రాస్తున్నారు.

సామాజిక అంశాలే ప్రేరణ..
సామాజిక అంశాలే నాకు ప్రేరణ. మనసు పొరల్లో దొర్లే భావాలతో అక్షరాలు రాస్తాను. సాహిత్య వారసత్వం లేకపోయినా.. చదువుకున్న పుస్తకాలతో కవిత్వాన్ని రాస్తున్న. నేను రాసిన సాహిత్యాన్ని సోషల్‌ మీడియా ద్వారా పాళీ కలం పేరుతో పంచుకున్నాను. సమాజ రుగ్మతలను ఎత్తిచూపేందుకు నాకు సాహిత్యం ఓ మార్గం అనిపించింది. నా సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ.. ఎంతో మంది ప్రోత్సహించడం ఉత్సాహాన్ని ఇస్తుంది. విలువలతో కూడిన, సమాజ హితాన్నికోరే సాహిత్యాన్ని అందించాలన్నదే నా తపన.
– చిందం మల్లేశం, యువకవి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top