కేసుల దర్యాప్తుపై నజర్‌!

Sika Goel Special Intrest On Case Investigations Hyderabad - Sakshi

ఎప్పటికప్పుడు పెండింగ్‌ కేసుల పర్యవేక్షణ

ఏసీపీ నేతృత్వంలోకొత్త విభాగం ఏర్పాటు

అదనపు సీపీ షికాగోయల్‌పర్యవేక్షణలో పని

నగర వ్యాప్తంగాఅన్ని విభాగాలపైనా దృష్టి

సాక్షి, సిటీబ్యూరో: ఏదైనా ఓ కేసు కొలిక్కి రావాలన్నా... నిందితులు చిక్కాలన్నా... కోర్టులో నిరూపితం కావాలన్నా... దాని దర్యాప్తు పక్కాగా సాగాల్సిన అవసరం ఉంది. ఇందుకుగాను ప్రభుత్వం, పోలీసు విభాగం అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. అయినా కేసుల దర్యాప్తు తీరుతెన్నులపై పూర్తి స్థాయి పర్యవేక్షణ లేకుంటే ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ సిటీ స్థాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అదనపు సీపీ షికాగోయల్‌ పర్యవేక్షణలో, ఏసీపీ నేతృత్వంలో ఈ విభాగం పని చేస్తోంది. బుధవారం నుంచి ఈ వింగ్‌ తన కార్యకలాపాలు ప్రారంభించింది. 

నిబంధనల ప్రకారం జరగాల్సిందే...
ఓ నేరం జరిగినప్పుడు దానిని కొలిక్కి తీసుకురావడం ఎంత కీలకమో ఆ దర్యాప్తు పక్కాగా సాగడమూ అంతే అవసరం. ఇన్వెస్టిగేషన్‌ చేపట్టడం, నిందితులను అదుపులోకి తీసుకోవడం, నేరగాడిగా తేలిన తర్వాత అరెస్టు, సాక్ష్యాధారాల సేకరణ, అభియోగపత్రాల దాఖలు,  ప్రతి అంశాన్నీ చట్టం నిర్దేశించిన ప్రకారం చేయాల్సిం దే. ఈ ప్రక్రియలో ఏమాత్రం పొరపాటు జరిగినా దాని ప్రభావం కేసు విచారణపై ఉంటుంది. కొన్ని సందర్భాల్లో న్యాయస్థానంలో వీగిపోయి నేరగాళ్లు సైతం నిర్దోషులుగా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. మిస్సింగ్‌ సహా మరికొన్ని రకాలైన కేసులు కొలిక్కి తీసుకురావాలంటే అనేక విధాలుగా ప్ర యత్నించాల్సి ఉంటుంది. కేవలం లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేసి విడిచిపెట్టడం కాకుండా క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌ (సీసీటీఎన్‌ఎస్‌), గుర్తుతెలియని మృతదేహాల డేటాబేస్‌లతోనూ సరి చూడాల్సి ఉంటుంది. లేని పక్షంలో తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ లభించే అవకాశం ఉండదు. ఇలాంటి దర్యాప్త ప్రక్రియలను సక్రమంగా జరిగేలా చూడటం కొత్త విభాగం ప్రధాన విధి. 

కొలిక్కి చేరని వాటినీ పర్యవేక్షిస్తుంది...
కొన్నేళ్ల క్రితం చోటు చేసుకున్న సినీ నటుడు బాలకృష్ణ ఇంట్లో జరిగిన సెక్యూరిటీ గార్డు లోక్‌నాథ్‌ సాహిల్‌ హత్య, టైర్లవ్యాపారి విజయరాఘవన్‌పై కాల్పులు, గత జనవరిలో జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న దారిదోపిడీ, ఇటీవల ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో జరిగిన మహిళ హత్య వరకు ఎన్నో కేసులు పోలీసు రికార్డుల్లో ‘అన్‌ డిటెక్టెడ్‌’గా మిగిలిపోతున్నాయి. ఆయా ఠాణాలకు చెందిన, దర్యాప్తు అధికారులకు పని ఒత్తిడి  నేపథ్యంలో ఇవన్నీ అటకెక్కేస్తున్నాయి . కొత్త నీరు పోటెత్తడంతో పాత నీరు వెళ్లిపోయినట్లు ఎప్పటికప్పుడు కొత్త కేసులు నమోదవుతుండటంతో ఎంత సంచలనాత్మకమైనా పాత వాటిని పట్టించుకునే ఆస్కారం ఉండట్లేదు. నిరంతర ప ర్యవేక్షణతో ఇలాంటి కేసుల్లో కొన్నైనా కొలిక్కి చేరే ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో నగర వ్యా ప్తంగా ఉన్న అన్ని ఠాణాల్లో నమోదైన అన్‌ డిటెక్టడ్‌ కేసులను ఈ ప్రత్యేక విభాగం పర్యవేక్షిస్తుంది. 

ఐఎస్‌సీ సలహాలు మాత్రమే ఇస్తుంది...
నగరంలో నమోదవుతున్న వివిధ రకాలైన కేసుల దర్యాప్తులో సహకరించడం కోసం ఇప్పటికే ఉన్నతాధికారులు ఇన్వెస్టిగేషన్‌ సపోర్ట్‌ సెంటర్‌ (ఐఎస్‌సీ) ఏర్పాటు చేశారు. సిటీతో ప్రారంభమైన దీని సేవలు రాష్ట్రానికీ విస్తరించాయి. అయితే ఈ విభాగం కేవలం తమను సంప్రదిస్తే మాత్రమే సలహాలు, సూచనలు ఇస్తుంది. అంతేతప్ప దర్యా ప్తు తీరును తమంతట తాముగా పర్యవేక్షించదు. ఈ నేపథ్యంలోనే కేసుల పర్యవేక్షణ కోసం ఈ వింగ్‌ను ఏర్పాటు చేశారు. ఏసీపీ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు రుద్రభాస్కర్, మగ్బూల్‌ జానీలతో పాటు నలుగురు ఎస్సైలు, ఆరుగురు కానిస్టేబుళ్లను దీనికి కేటాయించారు. అదనపు సీ పీ (నేరాలు, సిట్‌) కార్యాలయం కేంద్రంగానే పని చేసే ఈ విభాగం ప్రతి నెలా అందిస్తున్న కీ పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్‌ (కేపీఐ) రివార్డుల ప్రక్రియతో పాటు ఠాణాల పని తీరుకు సంబంధించి ఏర్పాటు చేసిన ‘17 వర్టికల్స్‌’ అంశాలను సైతం పర్యవేక్షిస్తుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top