మూడు జిల్లాల కూడలి అయిన కామారెడ్డిని జిల్లా కేంద్రం చేయాలని ఈ ప్రాంత ప్రజలు గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.
కామారెడ్డి, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డిని జిల్లా చేయాలని ఒకవైపు ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్న సందర్భంలో మెదక్‌ను మూడు జిల్లాలుగా విభజించి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలను మెదక్ జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనలపై ఈ ప్రాంత నేతలు, ప్రజా సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. తెలంగాణలో 24 జిల్లాలను చేయాల న్న టీఆర్‌ఎస్ ప్రతిపాదనలకు సంబంధించి శుక్రవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంతో ఈ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మూడు జిల్లాల కూడలి అయిన కామారెడ్డిని జిల్లా కేంద్రం చేయాలని ఈ ప్రాంత ప్రజలు గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.
ఇందుకోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో టీఆర్‌ఎస్ తీసుకువచ్చిన ప్రతిపాదనలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కామారెడ్డితోపాటు జిల్లాలోని ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలను మెదక్ జిల్లా పరిధిలోకి తీసుకురావడానికి జరిగే కుట్రలను తిప్పికొడతామని ప్ర జాసంఘాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లా ఏర్పాటుకు కామారెడ్డిలో అన్ని రకాల సౌకర్యాలున్నాయని, ముఖ్యంగా జాతీయరహదారి, రైల్వేలైను, తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్, వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన డెయిరీ టెక్నాలజీ కాలేజీ, తెలంగాణలో పేరున్న విద్యాసంస్థలతో పాటు అన్ని రకాల వసతులు ఉన్న కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మారిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. మెదక్ జిల్లాలో కలపడం అంటే ఈ ప్రాంతానికి అన్యాయం చేయడమేనని స్ప ష్టం చేస్తున్నారు. జాతీయరహదారి, రైల్వే లైను వెంట ఉన్న కామారెడ్డిని జిల్లా చేయకుండా ఈ ప్రాంతాన్ని తీసుకెళ్లి మారుమూలన ఉన్న మెదక్‌లో కలపాలన్న ప్రతి పాదన ఏమాత్రం సమర్థనీయం కాదంటున్నారు.