ఆ కాలేజీలకు షాక్‌! 

Shock to that collages - Sakshi

మూడేళ్లలో 25 శాతం సీట్లు భర్తీ కాకుంటే 

ఇతర కాలేజీలకు విద్యార్థుల బదిలీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లోని కోర్సుల్లో వరుసగా మూడేళ్ల పాటు 25 శాతం సీట్లు భర్తీ కానీ కాలేజీల్లో తాజాగా సీట్లు లభించే విద్యార్థులను చివరి దశ కౌన్సెలింగ్‌ తర్వాత ఇతర కాలేజీల్లో కోరుకున్న (ఆప్షన్‌ ఇచ్చిన) కోర్సుల్లోకి బదిలీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 25 శాతం ప్రవేశాలు లేకపోతే ఆయా కోర్సుల నిర్వహణ కష్టం కాబట్టి ఈ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలు చేపట్టేందుకు జారీ చేసిన మార్గదర్శకాల ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

యూనివర్సిటీలు నిర్ణయించే ఫీజులనే కాలేజీలు అమలు చేయాలని, దానిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జరిమానాతోపాటు అవసరమైతే కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ప్రవేశాల్లో రూల్‌ రిజర్వేషన్, ఇతర నిబంధనలు అమలు చేయాలన్నారు. మరోవైపు డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా విద్యార్థులకు అవసరమైన అన్ని సేవలు అందించేందుకు మూడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌తోపాటు ఉన్నత విద్యా మండలి కోఆర్డినేషన్‌ కమిటీ, కళాశాల విద్యా శాఖ కోఆర్డినేషన్‌ కమిటీలను ఏర్పాటు చేశారు.  

ప్రవేశాలకు సంబంధించి సమస్యలుంటే.. : ప్రవేశాలకు సంబంధించి విద్యార్థికి ఏ సమస్య వచ్చినా ఆయా డిగ్రీ కాలేజీలోని ప్రిన్సిపల్, సీనియర్‌ అధ్యాపకులతో కూడిన కమిటీ, హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని సంప్రదించవచ్చు.అక్కడ సమస్య పరిష్కారం కాకుంటే యూనివర్సిటీలోని కోఆర్డినేషన్‌ కమిటీ, హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు వెళ్లవచ్చు. అయినా పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలోని ఇంటిగ్రేటెడ్‌ కాలేజీల ప్రిన్సిపాల్‌ నేతృత్వంలోని జిల్లా కోఆర్డినేషన్‌ కమిటీ, హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని సంప్రదించవచ్చు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top