ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 3600 బస్సులను 51 ప్రాంతాల నుంచి నడుపనున్నట్లు రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు.
-రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి
కరీంనగర్ : ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 3600 బస్సులను 51 ప్రాంతాల నుంచి నడుపనున్నట్లు రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి కరీంనగర్‌లో సిటీ బస్సులను ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మేడారంలో 50 ఎకరాలలో బస్టాండును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాల కల్పనకు రూ.1.92 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 28 లక్షల ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించనున్నట్లు అంచనా వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లోని బస్సులను మేడారం జాతరకు వాడుకుంటామన్నారు. వారం రోజులపాటు బస్సులను నడుపనున్నట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వన్ వే రూటును ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మేడారంలో భక్తుల రద్దీ ఏర్పడకుండా అక్కడ బస్సు ఎక్కిన ప్రయాణికులకు తాడ్వాయిలో టిక్కెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బస్‌స్టాండు వద్ద 29 క్యూలైన్లు, ప్రాంతాల వారీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఆర్‌టీసీ 20 జీపులలో మొబైల్ పార్టీలను ఏర్పాటు చేస్తుందన్నారు. జాతరకు 150 మంది అధికారులను, 350 మంది పర్యవేక్షకులను, 8వేల మంది డ్రైవర్, కండక్టర్లను, 700 మంది ఇతర సిబ్బంది.. మొత్తం 11 వేల మందిని నియమించినట్లు వెల్లడించారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవిర్భావం నాటికి 95 డిపోలలో 6 డిపోలు మాత్రమే లాభాలలో ఉన్నాయని, గత ఏడాది కాలంలో 24 డిపోలను లాభాలబాట పట్టించామని వివరించారు. మిగిలిన డిపోలలో కూడా నష్టాలను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.