ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది. గురువారం జిల్లాలో వివిధ డిపోల వద్ద కార్మిక సంఘాల నాయకులు,
నల్లగొండ : ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది. గురువారం జిల్లాలో వివిధ డిపోల వద్ద కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు బస్సులు బయటకు రానివ్వకుండా బైఠాయించారు. అధికారులు తాత్కాలికంగా నియమించిన ప్రైవేటు కండక్టర్లు, డ్రైవర్లు విధుల్లో చేరనివ్వకుండా అడ్డుకున్నారు. రీజియన్ మేనేజర్, డిపోమేనేజర్లు, డెప్యూటీ సీటీఎం మినహా మిగిలిన ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో రెండో రోజు కూడా కార్యాలయాల్లో సేవలు స్తంభించిపోయాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా వివిధ మార్గాల్లో 123 బస్సులను ఆర్టీసీ నడిపింది. వీటిలో ఆర్టీసీ 15, అద్దె బస్సులు 108 ఉన్నాయి. నల్లగొండ- దేవరకొండ మార్గంలో పది బస్సులు ప్రయాణించాయి. మిర్యాలగూడ, కోదాడ, నార్కట్‌పల్లి, తిప్పర్తి, హైదరాబాద్, హాలియా మార్గాల్లో కూడా బస్సులు నడిపారు.
అయితే ప్రయాణికుల భద్రత దృష్ట్యా పోలీస్ ఎస్కార్ట్‌తో బస్సులు ప్రయాణించాయి. శుక్రవారం మరో 460 బస్సులు రోడ్డెక్కించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్‌ఎం బి.రవీందర్ తెలిపారు. ఈ మేరకు ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు 52 మందిని నియమించారు. వీరితో పాటు అదనంగా రవాణా శాఖకు చెందిన మరో 42మంది డ్రైవర్లను అందుబాటులో తీసుకొచ్చారు. రెండు రోజుల సమ్మె కారణంగా రీజియన్‌కు రూ.1.40 కోట్లు నష్టం వాటిల్లింది. సమ్మెతో సంబంధం లేదని క్యాజువల్ డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లో చేరక పోవడంతో వారిందరిని తొలగించేందుకు ముందస్తు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ఆర్‌ఎం తెలిపారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఎంసెట్ పరీక్ష జరగనుందన కార్మిక సంఘాలు ఈ రెండు రోజుల పాటు సమ్మె విరమించాలని ఆర్‌ఎం విజ్ఞప్తి చేశారు.
వెల్లువెత్తిన నిరసనలు
నల్లగొండ-దేవరకొండ మార్గంలో ప్రైవేట్ డ్రైవర్‌ల సహాయంతో తిరుగుతున్న ఆర్టీసీ బస్సు అద్దాలను గుర్రంపోడు మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు. నల్లగొండ డిపో నుంచి బస్సులు బయటకు రానివ్వకుండా కార్మిక సంఘాలు అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. కోదాడలో కాంట్రాక్టు కార్మికులతో బస్సులను నడిపేందుకు అధికారులు ప్రయత్నించగా డిపో గేట్ వద్ద కార్మికుల బైఠాయించి నిరసన తెలిపారు.
సూర్యాపేట సీఐ మొగిలయ్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ డిపో వద్ద కార్మికులు ఆటలు ఆడి నిరసన తెలిపారు. కార్మికులకు సీపీఎం, సీపీఎం ప్రజా సంఘాలు, ఐఎన్‌టీయూసీ, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. నల్లగొండ నుంచి మిర్యాలగూడ వరకు వచ్చిన బస్సు టైర్ల గాలితీశారు. దేవరకొండలో సీపీఐ, ఏఐటీయూసీలు మద్దతుగా సంఘీభావం ప్రకటించడంతో పాటు దేవరకొండ బస్‌డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. భువనగిరిలో నల్లగొండ, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, పికెట్ డిపోలకు చెందిన అద్దె బస్సులు, కొన్ని ప్రైవేట్ బస్సులు తిరిగాయి.