రోడ్డు టెర్రర్‌!

Road Accidents Report In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలో ఇటీవల కాలంలో రహదారులపై జరిగిన ప్రమాదాలు బీతి గొల్పుతున్నాయి. ప్రమాదాల్లో పలువురు మృతి చెందుతుండగా అనేక మంది క్షతగాత్రులవుతున్నారు. ప్రధానంగా ప్రమాదాలకు మానవ తప్పిదాలకు తోడు రోడ్ల పరిస్థితులు కూడా కారణమవుతున్నాయన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. జిల్లాలో జాతీయ రహదారి కాకుండా అనేక పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి రోడ్లు ఉన్నాయి. వీటిలో కొన్ని అంతర్‌రాష్ట్ర రహదారులు కూడా వస్తాయి. గుడిహత్నూర్‌ నుంచి ఉట్నూర్‌ వైపు వెళ్లే రహదారిపై అతివేగం కారణంగా ఇటీవల అనేక ప్రమాదాలు సంభవించాయి. ప్రమాదాలకు కారణాలను అన్వేషించి నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

రోడ్‌ సేఫ్టీ కమిటీ
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్‌ సేఫ్టీ కమిటీ ఉంది. దీనికి కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎస్పీ వైస్‌ చైర్మన్‌గా, జిల్లా రవాణ అధికారి కన్వీనర్‌గా ఉన్నారు. డీపీఈవో, డీఎంహెచ్‌వో, ఆర్‌అండ్‌బి ఈఈ, పంచాయతీరాజ్‌ ఈఈ, 108 (ఈఎంఆర్‌ఐ), రిమ్స్‌ సూపరింటెండెంట్, డీఈవో, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ తదితరులు ఉన్నారు. ప్రమాదాల పరిస్థితిని బట్టి వీరు చర్చించి నివారణకు చర్యలు తీసుకుంటారు. అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే వాటిని ఈ కమిటీ ఇదివరకు గుర్తించింది. అక్కడ ప్రమాదాలకు కారణాలను అన్వేషించి దానికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేశారు. పూర్తిస్థాయిలో చర్యలు చేపడితే ప్రమాదాలు నివారించవచ్చనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. 

 జనవరి 31న బజార్‌హత్నూర్‌ మండలం చందునాయక్‌తండాకు చెందిన అజిడే ఆకాష్‌ తన మిత్రుడు పడ్వాల్‌ అనిల్‌ (17)తో కలిసి గుడిహత్నూర్‌ నుంచి ఉట్నూర్‌ వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు        బైక్‌ను అతివేగంగా ఢీకొట్టి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పడ్వాల్‌ అనిల్‌ మృతిచెందగా, ఆకాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 

⇔ ఫిబ్రవరి 24న ఇంద్రవెల్లికి సమీపంలో ఈశ్వర్‌నగర్‌ పెట్రోల్‌బంక్‌ వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బైక్‌పైనున్న దంపతులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. 

⇔ మార్చి 4 బుధవారం తాంసి మండలం పొన్నారి అంతర్‌రాష్ట్ర రహదారి హనుమాన్‌ మందిరం వద్ద లారీ, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తితో పాటు తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందడం కలకలం కలిగిస్తోంది.  

కమిటీ గుర్తించిన ప్రదేశాలు
గుడిహత్నూర్‌ మండలం జున్ని వద్ద ఆకస్మిక మలుపుతో పాటు రోడ్డు పల్లంగా ఉండటం ప్రమాదాలకు కారణమవుతోంది. ఇక్కడ రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా వేగాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

  • నేరడిగొండ మండలం కుప్టి బస్టాండ్‌ వద్ద మలుపు రోడ్డు కారణంగా ఇరువైపులా వేగంగా వస్తున్న వాహనాలు ఢీకొనే పరిస్థితి ఉంది. ఇక్కడ అండర్‌ పాస్‌ బ్రిడ్జి ఇరుకుగా ఉండటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. అక్కడ నీళ్లు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 
  • తలమడుగు మండలం దేవాపూర్‌ గ్రామ రోడ్డు జాతీయ రహదారి 44కు కలుస్తుంది. ఈ హైవేపై ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌ వైపు భారీ వాహనాలు, ఇతరత్రా వేగంగా వెళ్తుంటాయి. గ్రామం నుంచి వచ్చే వాహనాలు రహదారి నుంచి మలుపు తీసుకోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. సర్వీస్‌ రోడ్డు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు నివారించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
  • జైనథ్‌ మండలం భోరజ్‌ వద్ద జాతీయ రహదారి 44 నుంచి సర్వీస్‌ రోడ్డు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ సర్వీస్‌ రోడ్డును త్వరగా పూర్తిచేస్తే ఇక్కడ ప్రమాదాలు నివారించే అవకాశం ఉంది. 
  •  ఆదిలాబాద్‌ మండలం జందాపూర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద ఇరుపక్కలా హైవే నుంచే సైడ్‌ రోడ్లను నిర్మించారు. ఇవి ప్రమాదకరంగా ఉండడంతో మార్పులు చేయాలని రోడ్‌ సేఫ్టీ కమిటీ గుర్తించింది. 
  • జైనథ్‌ మండలం సాత్నాలకు వెళ్లే రోడ్డులో జెడ్‌ టర్నింగ్‌ ప్రమాదాలకు కారణమవుతోంది. ఇక్కడ స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కమిటీ గుర్తించింది. 
  • ఆదిలాబాద్‌రూరల్‌ మండలం అంకోలి నుంచి ఆదిలాబాద్‌ వైపు వచ్చే రోడ్డు గాంధీ పార్కు సమీపంలో వేకువజామున, సాయ ంత్రం వేళల్లో రద్దీగా ఉంటోంది. ఈ రోడ్డు పై కొన్నిచోట్ల స్పీడ్‌ బ్రేకర్లు లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
  •  మావల మండలం వాగాపూర్‌ ఎక్స్‌రోడ్‌ టు సీతాగొంది వెళ్లే దారి మధ్యలో 44వ జాతీయ రహదారిని తాకుతుంది. హైవేపైకి గ్రామాల నుంచి వాహనాలు మలుగుతుండడంతో ప్రమాదాలకు కారణమవుతోంది.
  • మావల గ్రామంలో ప్రవేశించే దగ్గర మలుపు, పల్లపు రోడ్డు ఉండటం ప్రమాదాలకు కారణమవుతోంది. డబుల్‌ రోడ్‌ నిర్మించినప్పటికీ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కమిటీ సూచిస్తోంది. 
  • ఆదిలాబాద్‌రూరల్‌ మండలం లాండసాంగ్వి గ్రామానికి వెళ్లే దారిలో అనేక మలుపులు ఉండడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ రోడ్డుపై అక్కడక్కడ స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కమిటీ     సూచించింది.
  • ఆదిలాబాద్‌ పట్టణంలోని టీచర్స్‌ కాలనీ నుంచి ప్రధాన రహదారికి మలిగే రోడ్డు కలుస్తుండడంతో కాలనీ నుంచి వచ్చే వాహనాలు రోడ్డుపై ప్రమాదకరంగా మలుగుతున్నాయి. ఠాగూర్‌ హోటల్‌ వద్ద జీపు, ఆటోల అడ్డా ఉండడంతో ఇక్కడ రాకపోకల్లో వాహనాలకు ఇబ్బంది ఎదురవుతోంది. జాతీయ రహదారి 44పై రిలయన్స్‌ పెట్రోల్‌బంక్‌ వద్ద వాహనదారులు పెట్రోల్‌బంక్‌కు, దాబా వైపుకు ప్రమాదకరంగా మలుగుతుండడంతో ఘటనకు కారణమవుతోంది. కలెక్టర్‌చౌక్‌ నుంచి కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయం మీదుగా సంజయ్‌నగర్‌ వైపు వెళ్లే రహదారిలో మధ్యలో జెడ్పీ కార్యాలయం ఎదురుగా ఇటునుంచి, అటువైపు నుంచి వచ్చే వాహనాలు ప్రమాదకరంగా మలుగుతున్నాయి. 

నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు
రోడ్లపై ప్రయాణించేటప్పుడు లిప్తపాటు నిర్లక్ష్యంతో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ దృష్ట్యా ప్రయాణ మార్గంలో నిర్లక్ష్యం తగదు. జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే స్పాట్స్‌ను ఇదివరకే గుర్తించాం. అక్కడ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.    – పుప్పాల శ్రీనివాస్, డీటీసీ, ఆదిలాబాద్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top