
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది నీటి కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాల వాటాపై సోమవారం నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలోని బ్రిజేశ్ ట్రిబ్యునల్‌లో వాదనలు జరగనున్నాయి. ఇప్పటికే ఏపీ తమ నీటి అవసరాల చిట్టాను ట్రిబ్యునల్ ముందుంచగా తెలంగాణ ప్రభుత్వం తమ నీటి అవసరాలతోపాటు ఏపీకి వాటా తగ్గించాలని వాదనలు వినిపించనుంది.
ఏపీకి 155 టీఎంసీల నీటి వాటా సరిపోతుందని, ఆ రాష్ట్రానికి ఇప్పటికే ఉన్న 512 టీఎంసీల వాటాలో కోత పెట్టాలని డిమాండ్ చేయనుంది. ఏపీ సమర్పించిన అఫిడవిట్‌పై ఈ మేరకు వేసిన రిజాయిండర్‌లో పేర్కొన్న అంశాల ఆధారంగా వాదించనుంది. రాష్ట్ర వాదనల దృష్ట్యా ఐదు రోజుల కిందటే రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు ఢిల్లీ వెళ్లి న్యాయవాదులతో చర్చలు జరిపారు. ప్రధానంగా కృష్ణా డెల్టాకు నీటి సరఫరాలో కోత పెట్టే అంశంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టనుంది.
రాజధాని నిర్మాణంతో సాగునీటి డిమాండ్ తగ్గుతుందిగా
కృష్ణా డెల్టా కింద ఏపీకి 152.20 టీఎంసీల కేటాయింపు ఉండగా రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతుల నుంచి 33 వేల ఎకరాల భూసమీకరణ కారణంగా 16 టీఎంసీల మేర డిమాండ్ తగ్గుతుందన్నది తెలంగాణ వాదన. దీనికితోడు డెల్టా నీటి అవసరాలను తీర్చడానికి వీలుగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పట్టిసీమ ప్రాజెక్టు నుంచి 114.37 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తోందని, భవిష్యత్తులో పోలవరం కుడి కాల్వ ద్వారా 80 టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలించనుందని పేర్కొంటోంది.
ఈ మేరకు డెల్టాకున్న కేటాయింపుల్లో ఏపీ వాటాను తగ్గించాలని ట్రిబ్యునల్‌ను కోరనుంది. కృష్ణా డెల్టా ప్రస్తుత కేటాయింపులను 17.55 టీఎంసీలకు పరిమితం చేయాలని కోరే అవకాశాలున్నాయి. అలాగే గుంటూరు చానల్ పరిధిలోని ఆయకట్టులో సుమారు 7,908 ఎకరాలు కొత్త రాజధాని పరిధిలోకి వస్తాయని, దీనికి 4 టీఎంసీల కేటాయింపులున్నా వాస్తవ అవసరాలు 1.48 టీఎంసీలకు మించవని తెలంగాణ వాదించనుంది. మరోవైపు సాగర్ ఎడమ కాల్వ కింద ఏపీకి ఉన్న 34.25 టీఎంసీల కేటాయింపుల్లో వాస్తవ అవసరాలు 20.22 టీఎంసీలేనని, ప్రస్తుతం రాజధాని అమరావతి కింద 3.05 లక్షల ఎకరాలు ప్రభావితం అవుతున్నందున ఈ నీటి కేటాయింపులు కూడా అవసరం లేదని తెలంగాణ అంటోంది.
సాగర్ కుడి కాల్వ కింద సైతం 140 టీఎంసీల కేటాయింపులు ఉండగా వాస్తవ అవసరాలు 75.57 టీఎంసీలు మాత్రమేనని పేర్కొంటోంది. ఇందులోనూ కుడి కాల్వ పరిధిలోని 2.67 లక్షల ఎకరాలు రాజధాని ప్రాంతంలో ఉన్నందున 26.71 టీఎంసీలను తగ్గించి 75.77 టీఎంసీలు కేటాయిస్తే సరిపోతుందని చెబుతోంది. ఏపీకి ఉన్న 512 టీఎంసీల నికర జలాల కేటాయింపులను 155.40 టీఎంసీలకు పరిమితం చేయాలని, పరీవాహకం, జనాభా, అవసరాలను దృష్టిలో పెట్టుకొని 811 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణకు 600 టీఎంసీల వరకు దక్కాలన్నది తెలంగాణ వాదనగా ఉండనుంది.