రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

Ravi Prakash Custody Petition Hearing Postponed To October15 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీవీ9 మాజీ సీఈవో వెలిచేటి రవిప్రకాశ్‌ కస్టడీ పిటిషన్‌పై సోమవారం వాదనలు విన్న నాంపల్లి కోర్టు.. తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. టీవీ9 అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బోర్డు తీర్మానం లేకుండా అక్రమంగా దాదాపు రూ.18 కోట్లు డ్రా చేసిన కేసులో రవిప్రకాశ్‌ను పోలీసులు గతవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

నిందితుడు రవిప్రకాష్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అనేక కీలక ఆధారాలు లభిస్తాయనీ, పది రోజుల పాటు కస్టడీలోకి అనుమతి ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోర్టుకు విన్నవించింది. రవిప్రకాశ్‌ తన అధికార దుర్వినియోగంతో ఉద్యోగులకు ఇవ్వాల్సిన బోనస్, ఎక్స్‌గ్రేషియా నిధులను అక్రమంగా మళ్లించారని, దీనికి సంబంధించిన ఆధారాలు అన్ని కోర్టుకు సమర్పిస్తున్నామని ఈ మేరకు తెలిపింది. అలాగే అతడు డ్రా చేసిన నగదు లావాదేవీల పూర్తి ఆధారాలు పోలీసులకు ఇవ్వడం జరిగిందని వివరించింది.

రవిప్రకాశ్‌పై ఉన్న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), హైకోర్టులోని కేసులకు.. ఈ కేసుకు సంబంధం లేదనీ, 18 కోట్ల రూపాయలు ఎక్కడికి తరలించారనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కోరింది. కంపెనీలో ఎక్కువ షేర్లు ఉన్న డైరెక్టర్లను సంప్రదించకుండా, ఎలాంటి బోర్డు మీటింగ్ పెట్టకుండా 18 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసిన కేసులో ఏ-1గా రవిప్రకాశ్‌, ఏ-2గా ఆర్థిక వ్యవహారాలు చూసే మూర్తిగా గుర్తించారు. కాగా ప్రస్తుతం మూర్తి పరారీలో ఉన్నాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top