కట్టినయి కట్టినట్టే.. | Rajiv Swagruha Scheme Houses Are Not Completed Khammam | Sakshi
Sakshi News home page

కట్టినయి కట్టినట్టే..

Feb 18 2019 9:59 AM | Updated on Feb 18 2019 9:59 AM

Rajiv Swagruha Scheme Houses Are Not Completed Khammam - Sakshi

రాజీవ్‌ స్వగృహ సముదాయం

సాక్షిప్రతినిధి, ఖమ్మం: మధ్యతరగతి ప్రజల కల దశాబ్దమైనా నెరవేరట్లేదు. ఇంటి కోసం దరఖాస్తు చేసుకుని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా.. కేటాయింపులు మాత్రం జరగట్లేదు. సొంతింటి కలను నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో దాదాపు పదేళ్ల క్రితం ఖమ్మం నగరంలో ప్రభుత్వం రాజీవ్‌ స్వగృహ బహుళ అంతస్థుల సముదాయాన్ని చేపట్టింది. అప్పుడు ఆ ప్రాంతం నగరం చివర ఉన్నా.. ఇప్పుడు అత్యంత రద్దీ ప్రదేశంగా మారింది. దీంతో రాజీవ్‌ స్వగృహ ఇళ్లపై ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని డిపాజిట్‌ చెల్లించిన లబ్ధిదారులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుత సర్కారును అనేకమార్లు కోరినా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2008లో సాధారణ, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేసేందుకు అప్పటి ప్రభుత్వం సేకరించిన స్థలంలోనే బహుళ అంతస్థుల భవనాన్ని అన్ని హంగులతో నిర్మించి.. ప్లాట్లవారీగా కేటాయించాలని సంకల్పించి భారీ ఎత్తున నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అప్పటి వైఎస్‌ ప్రభుత్వం నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి.. రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ను సైతం ఏర్పాటు చేసి.. నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసింది. అయితే వీటిని దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించకపోవడంతోపాటు మిగిలిన గృహాలను ఏ ప్రాతిపదికన కేటాయించాలనే అంశంపై ప్రభుత్వపరంగా ఇప్పటికీ స్పష్టత రాలేదు. దీంతో రూ.వందల కోట్ల వ్యయంతో నిర్మించిన రాజీవ్‌ స్వగృహ బహుళ అంతస్థుల భవనాలు నిరుపయోగంగా మారాయి.

మధ్యతరగతి వర్గాల అవసరాలకు అనుగుణంగా డబుల్, త్రిబుల్‌ బెడ్‌రూంలతో కూడిన అపార్ట్‌మెంట్లు నిర్మించారు. చౌక ధరకు నగరంలో ఇల్లు లభిస్తుందనే ఆనందంతో అనేక మంది పదేళ్ల క్రితం రూ.3వేల నుంచి రూ.5వేల చొప్పున ఇంటి కోసం అడ్వాన్స్‌ రూపంలో చెల్లించారు. అయితే ఆ నగదు అడిగిన కొందరికి అధికారులు తిరిగి ఇవ్వగా.. అనేక మంది రాజీవ్‌ స్వగృహ వ్యవహారాన్ని ప్రభుత్వం ఏదో ఒక రోజు తేలుస్తుందనే ఆశతో డిపాజిట్లను తిరిగి తీసుకోలేదు.  రాజీవ్‌ స్వగృహ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి 2008లో ఏర్పాటు చేశారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వమే నేరుగా అపార్ట్‌మెంట్లను నిర్మించి.. వాటిని తక్కు వ ధరలో ప్రజలకు అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఖమ్మంలో అపార్ట్‌మెంట్లు నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం రూరల్‌ మండలం పోలేపల్లిలో సుమారు 9 ఎకరాల 23 గుంటల విస్తీర్ణంలో 576 ఫ్లాట్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. మొదట్లో రాజీవ్‌ స్వగృహలో ఫ్లాట్‌ను సొంతం చేసుకునేందుకు ఖమ్మం పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 4వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత డ్రా పద్ధతిన ఎంపిక చేసి.. లబ్ధిదారులకు అందించాలని అధికారులు భావించారు.  

8 బ్లాకులతో నిర్మాణం
2008లో రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ కింద ఖమ్మం రూరల్‌ మండలం పోలేపల్లిలో 9.23 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. మొత్తం 8 బ్లాకులు ఉండగా.. ఒక్కో బ్లాకులో 9 ఫ్లోర్లు, ఒక్కో ఫ్లోర్‌లో 8 ఇళ్లు ఉన్నాయి. వాటిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు 288 ఉండగా.. త్రిబుల్‌ బెడ్‌రూం ఇళ్లు 288 ఉన్నాయి. డబుల్‌ బెడ్‌రూం నిర్మాణానికి 1,145 చదరపు అడుగులు, త్రిబుల్‌ బెడ్‌రూంనకు 1,435 చదరపు అడుగులుగా నిర్ణయించారు. మొత్తం ఇళ్ల నిర్మాణం 7లక్షల 600 చదరపు అడుగుల్లో చేపట్టారు. డబుల్‌ బెడ్‌రూం నిర్మాణం చదరపు అడుగుకు రూ.1,300 ఖర్చు వస్తుండగా.. రూ.1,800 చొప్పున విక్రయించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది.  

అలంకార ప్రాయంగానే..
రాజీవ్‌ స్వగృహలో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా అనేక సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. రహదారి, నీటి వసతి, విద్యుత్‌ సౌకర్యం, పైపులైన్ల నిర్మాణంతోపాటు అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 2012 నుంచి వీటికి మోక్షం లభించడం లేదు. అయితే గతంలో ఉద్యోగ సంఘాల నేతలు అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్‌ను కలిసి స్వగృహ ఇళ్ల నిర్మాణం, వాటిని వినియోగంలోకి తేకపోవడంపై సుదీర్ఘంగా చర్చించారు. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఇళ్లను అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం వెలువడలేదు.  

అనుమతి కోసం..
రాజీవ్‌ స్వగృహ పథకం కింద నిర్మించిన ఇళ్లను కొనుగోలు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని గతంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, నాటి కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌కు విన్నవించాం. వారు ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రభుత్వం ధర నిర్ణయించినా.. లేకుంటే వేలం వేసినా.. కొనుగోలు చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం.  
– ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్జీవోస్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement