breaking news
Rajeev swagruha houses
-
కట్టినయి కట్టినట్టే..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మధ్యతరగతి ప్రజల కల దశాబ్దమైనా నెరవేరట్లేదు. ఇంటి కోసం దరఖాస్తు చేసుకుని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా.. కేటాయింపులు మాత్రం జరగట్లేదు. సొంతింటి కలను నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో దాదాపు పదేళ్ల క్రితం ఖమ్మం నగరంలో ప్రభుత్వం రాజీవ్ స్వగృహ బహుళ అంతస్థుల సముదాయాన్ని చేపట్టింది. అప్పుడు ఆ ప్రాంతం నగరం చివర ఉన్నా.. ఇప్పుడు అత్యంత రద్దీ ప్రదేశంగా మారింది. దీంతో రాజీవ్ స్వగృహ ఇళ్లపై ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని డిపాజిట్ చెల్లించిన లబ్ధిదారులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుత సర్కారును అనేకమార్లు కోరినా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2008లో సాధారణ, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేసేందుకు అప్పటి ప్రభుత్వం సేకరించిన స్థలంలోనే బహుళ అంతస్థుల భవనాన్ని అన్ని హంగులతో నిర్మించి.. ప్లాట్లవారీగా కేటాయించాలని సంకల్పించి భారీ ఎత్తున నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అప్పటి వైఎస్ ప్రభుత్వం నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి.. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌ను సైతం ఏర్పాటు చేసి.. నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసింది. అయితే వీటిని దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించకపోవడంతోపాటు మిగిలిన గృహాలను ఏ ప్రాతిపదికన కేటాయించాలనే అంశంపై ప్రభుత్వపరంగా ఇప్పటికీ స్పష్టత రాలేదు. దీంతో రూ.వందల కోట్ల వ్యయంతో నిర్మించిన రాజీవ్ స్వగృహ బహుళ అంతస్థుల భవనాలు నిరుపయోగంగా మారాయి. మధ్యతరగతి వర్గాల అవసరాలకు అనుగుణంగా డబుల్, త్రిబుల్ బెడ్రూంలతో కూడిన అపార్ట్మెంట్లు నిర్మించారు. చౌక ధరకు నగరంలో ఇల్లు లభిస్తుందనే ఆనందంతో అనేక మంది పదేళ్ల క్రితం రూ.3వేల నుంచి రూ.5వేల చొప్పున ఇంటి కోసం అడ్వాన్స్ రూపంలో చెల్లించారు. అయితే ఆ నగదు అడిగిన కొందరికి అధికారులు తిరిగి ఇవ్వగా.. అనేక మంది రాజీవ్ స్వగృహ వ్యవహారాన్ని ప్రభుత్వం ఏదో ఒక రోజు తేలుస్తుందనే ఆశతో డిపాజిట్లను తిరిగి తీసుకోలేదు. రాజీవ్ స్వగృహ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 2008లో ఏర్పాటు చేశారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వమే నేరుగా అపార్ట్మెంట్లను నిర్మించి.. వాటిని తక్కు వ ధరలో ప్రజలకు అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఖమ్మంలో అపార్ట్మెంట్లు నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో సుమారు 9 ఎకరాల 23 గుంటల విస్తీర్ణంలో 576 ఫ్లాట్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. మొదట్లో రాజీవ్ స్వగృహలో ఫ్లాట్‌ను సొంతం చేసుకునేందుకు ఖమ్మం పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 4వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత డ్రా పద్ధతిన ఎంపిక చేసి.. లబ్ధిదారులకు అందించాలని అధికారులు భావించారు. 8 బ్లాకులతో నిర్మాణం 2008లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కింద ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో 9.23 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. మొత్తం 8 బ్లాకులు ఉండగా.. ఒక్కో బ్లాకులో 9 ఫ్లోర్లు, ఒక్కో ఫ్లోర్లో 8 ఇళ్లు ఉన్నాయి. వాటిలో డబుల్ బెడ్రూం ఇళ్లు 288 ఉండగా.. త్రిబుల్ బెడ్రూం ఇళ్లు 288 ఉన్నాయి. డబుల్ బెడ్రూం నిర్మాణానికి 1,145 చదరపు అడుగులు, త్రిబుల్ బెడ్‌రూంనకు 1,435 చదరపు అడుగులుగా నిర్ణయించారు. మొత్తం ఇళ్ల నిర్మాణం 7లక్షల 600 చదరపు అడుగుల్లో చేపట్టారు. డబుల్ బెడ్రూం నిర్మాణం చదరపు అడుగుకు రూ.1,300 ఖర్చు వస్తుండగా.. రూ.1,800 చొప్పున విక్రయించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. అలంకార ప్రాయంగానే.. రాజీవ్ స్వగృహలో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా అనేక సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. రహదారి, నీటి వసతి, విద్యుత్ సౌకర్యం, పైపులైన్ల నిర్మాణంతోపాటు అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 2012 నుంచి వీటికి మోక్షం లభించడం లేదు. అయితే గతంలో ఉద్యోగ సంఘాల నేతలు అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్‌ను కలిసి స్వగృహ ఇళ్ల నిర్మాణం, వాటిని వినియోగంలోకి తేకపోవడంపై సుదీర్ఘంగా చర్చించారు. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఇళ్లను అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. అనుమతి కోసం.. రాజీవ్ స్వగృహ పథకం కింద నిర్మించిన ఇళ్లను కొనుగోలు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని గతంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, నాటి కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు విన్నవించాం. వారు ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రభుత్వం ధర నిర్ణయించినా.. లేకుంటే వేలం వేసినా.. కొనుగోలు చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం. – ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్జీవోస్ హౌస్ బిల్డింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు -
ఈ-వేలానికి ‘స్వగృహాలు’..!
కొత్త యోచనలో ప్రభుత్వం కొనుగోళ్లు లేకపోవటంతో ఈ- మార్గం ఎంపిక త్వరలో నోటిఫికేషన్ బండ్లగూడలోని 316 ఇళ్లకు తొలి అవకాశం సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల పెట్టుబడి... నిర్మించి ఏళ్లు... కొనేవారు లేక తెల్ల ఏనుగులా మారిన తీరు.. ప్రకటనలతో ఆకట్టుకుందామంటే మార్కెటింగ్ విభాగం లేదు... ఏం చేయాలో తెలియని స్థితి. ఇదీ రాజీవ్ స్వగృహ ఇళ్ల తాజా పరిస్థితి. ఏదో ఓ ధరకు ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించటం ద్వారా... ఇటు ఇళ్లను వదిలించుకోవటం, అటు ఉద్యోగుల్లో మంచి పేరు పొందటం... ఇలా ‘వన్ షాట్ టూ బర్డ్స్’ ప్రయోగం చేసినా, మరీ తక్కువ ధరకు ఉద్యోగులు అడగటంతో నష్టాలు భయపెట్టాయి. దీంతో ఇక గత్యంతరం లేక వేలం ద్వారా అమ్మేయాలనే ఆలోచనకొచ్చింది ప్రభుత్వం. నేడో రేపో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుంది. కొనుగోలుదారులు ఆ ఇళ్లను పరిశీలించి వాటికి ఎంత ధర పెట్టచ్చో సొంతంగా కోట్ చేయాల్సి ఉంటుంది. అధికారులు ప్రకటించే సాధారణ ధర కంటే ఎంత ఎక్కువకు కోట్ చేస్తే స్వగృహ కార్పొరేషన్‌కు అంత లాభమన్నమాట. గతంలో ఖాళీ స్థలాలకు అనుసరించిన పద్ధతిని ఇప్పుడు స్వగృహాలకు అమలు చేయబోతున్నారు. బహిరంగ వేలం ద్వారా కాకుండా ఈ-వేలం పద్ధతిలో దీన్ని కొనసాగిస్తారు. బండ్లగూడకు అమలు... బండ్లగూడలోని స్వగృహ ప్రాజెక్టులో పనులన్నీ పూర్తయి 316 ఫ్లాట్లు గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. కొనేవారులేకపోవటంతో చాలాకాలంగా ఇవి ఖాళీగా మూలుగుతున్నాయి. వీటిని అమ్మటం ద్వారా డబ్బులు సమకూరితే వాటితో మిగతా ఇళ్లలో పనులు పూర్తి చేసి అమ్మకానికి సిద్ధం చేయాలనేది అధికారుల యత్నం. ఆ గృహ సముదాయాల్లో మొత్తం 2,726 ఫ్లాట్లుంటే ఇప్పటికి 503 ఇళ్లను అమ్మేశారు. వాటిల్లో కుటుంబాలుంటున్నాయి. 316 ఇళ్లు సిద్ధంగా ఉండగా మిగతావాటిల్లో కొన్ని రకాల పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇటీవల ఈ ఇళ్లను తక్కువ ధరకు అమ్మితే కొనేందుకు టీఎన్జీఓ సిద్ధమైంది. అధికారులు లెక్కలేసి చివరకు చదరపు అడుగు ధరను రూ.1900 గా నిర్ధారించారు. కానీ ఉద్యోగ సంఘం నేతలు రూ.1500 కంటే తక్కువకే ఇవ్వాలని అడిగారు. అంత తక్కువ ధరకమ్మితే భారీ నష్టం వస్తుందని అధికారులు చెప్పటంతో ప్రభుత్వం ససేమిరా అన్నది. ఫలితంగా అందులో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో ఇక ప్రైవేటు సంస్థలు గంప గుత్తగా కొనేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఎంత ధర పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు ప్రతిపాదించిన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం కావటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ-వేలం నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. సాధారణ ధర (బేసిక్ ప్రైస్)ను ఇంకా నిర్ధారించాల్సి ఉంది. చదరపు అడుగుకు అది రూ.1900గా నిర్ధారించే అవకాశం కనిపిస్తోంది. 316 ఇళ్ల విషయంలో ఎక్కువ మంది కోట్ చేసిన ధర ఆధారంగా మిగతా ఇళ్లను అమ్మాలనేది ప్రభుత్వ అభిప్రాయం. వేగంగా ఇళ్లు అమ్ముడయ్యేందుకు ఇది దోహదం చేస్తుందనేది ప్రభుత్వ ఆలోచన. ఇది విజయవంతమైతే పోచారంలోని ఇళ్ల విషయంలోనూ అదే పంథాను అనుసరించాలని భావిస్తోంది.