
ఈ-వేలానికి ‘స్వగృహాలు’..!
వందల కోట్ల పెట్టుబడి... నిర్మించి ఏళ్లు... కొనేవారు లేక తెల్ల ఏనుగులా మారిన తీరు.. ప్రకటనలతో ఆకట్టుకుందామంటే మార్కెటింగ్ విభాగం లేదు...
కొత్త యోచనలో ప్రభుత్వం
కొనుగోళ్లు లేకపోవటంతో ఈ- మార్గం ఎంపిక
త్వరలో నోటిఫికేషన్
బండ్లగూడలోని 316 ఇళ్లకు తొలి అవకాశం
సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల పెట్టుబడి... నిర్మించి ఏళ్లు... కొనేవారు లేక తెల్ల ఏనుగులా మారిన తీరు.. ప్రకటనలతో ఆకట్టుకుందామంటే మార్కెటింగ్ విభాగం లేదు... ఏం చేయాలో తెలియని స్థితి. ఇదీ రాజీవ్ స్వగృహ ఇళ్ల తాజా పరిస్థితి. ఏదో ఓ ధరకు ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించటం ద్వారా... ఇటు ఇళ్లను వదిలించుకోవటం, అటు ఉద్యోగుల్లో మంచి పేరు పొందటం... ఇలా ‘వన్ షాట్ టూ బర్డ్స్’ ప్రయోగం చేసినా, మరీ తక్కువ ధరకు ఉద్యోగులు అడగటంతో నష్టాలు భయపెట్టాయి. దీంతో ఇక గత్యంతరం లేక వేలం ద్వారా అమ్మేయాలనే ఆలోచనకొచ్చింది ప్రభుత్వం. నేడో రేపో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుంది. కొనుగోలుదారులు ఆ ఇళ్లను పరిశీలించి వాటికి ఎంత ధర పెట్టచ్చో సొంతంగా కోట్ చేయాల్సి ఉంటుంది. అధికారులు ప్రకటించే సాధారణ ధర కంటే ఎంత ఎక్కువకు కోట్ చేస్తే స్వగృహ కార్పొరేషన్‌కు అంత లాభమన్నమాట. గతంలో ఖాళీ స్థలాలకు అనుసరించిన పద్ధతిని ఇప్పుడు స్వగృహాలకు అమలు చేయబోతున్నారు. బహిరంగ వేలం ద్వారా కాకుండా ఈ-వేలం పద్ధతిలో దీన్ని కొనసాగిస్తారు.
బండ్లగూడకు అమలు...
బండ్లగూడలోని స్వగృహ ప్రాజెక్టులో పనులన్నీ పూర్తయి 316 ఫ్లాట్లు గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. కొనేవారులేకపోవటంతో చాలాకాలంగా ఇవి ఖాళీగా మూలుగుతున్నాయి. వీటిని అమ్మటం ద్వారా డబ్బులు సమకూరితే వాటితో మిగతా ఇళ్లలో పనులు పూర్తి చేసి అమ్మకానికి సిద్ధం చేయాలనేది అధికారుల యత్నం. ఆ గృహ సముదాయాల్లో మొత్తం 2,726 ఫ్లాట్లుంటే ఇప్పటికి 503 ఇళ్లను అమ్మేశారు. వాటిల్లో కుటుంబాలుంటున్నాయి. 316 ఇళ్లు సిద్ధంగా ఉండగా మిగతావాటిల్లో కొన్ని రకాల పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇటీవల ఈ ఇళ్లను తక్కువ ధరకు అమ్మితే కొనేందుకు టీఎన్‌జీఓ సిద్ధమైంది. అధికారులు లెక్కలేసి చివరకు చదరపు అడుగు ధరను రూ.1900 గా నిర్ధారించారు. కానీ ఉద్యోగ సంఘం నేతలు రూ.1500 కంటే తక్కువకే ఇవ్వాలని అడిగారు. అంత తక్కువ ధరకమ్మితే భారీ నష్టం వస్తుందని అధికారులు చెప్పటంతో ప్రభుత్వం ససేమిరా అన్నది. ఫలితంగా అందులో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో ఇక ప్రైవేటు సంస్థలు గంప గుత్తగా కొనేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఎంత ధర పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు ప్రతిపాదించిన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం కావటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఈ-వేలం నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. సాధారణ ధర (బేసిక్ ప్రైస్)ను ఇంకా నిర్ధారించాల్సి ఉంది. చదరపు అడుగుకు అది రూ.1900గా నిర్ధారించే అవకాశం కనిపిస్తోంది. 316 ఇళ్ల విషయంలో ఎక్కువ మంది కోట్ చేసిన ధర ఆధారంగా మిగతా ఇళ్లను అమ్మాలనేది ప్రభుత్వ అభిప్రాయం. వేగంగా ఇళ్లు అమ్ముడయ్యేందుకు ఇది దోహదం చేస్తుందనేది ప్రభుత్వ ఆలోచన. ఇది విజయవంతమైతే పోచారంలోని ఇళ్ల విషయంలోనూ అదే పంథాను అనుసరించాలని భావిస్తోంది.