తిండి గింజలకు కష్టమే!

Rabi cultivation Disappointment to farmers - Sakshi

మూడో వంతు దాటని రబీ సాగు

లక్ష్యం 33.45 లక్షల ఎకరాలు... సాగైంది 10.77 లక్షల ఎకరాలు

అందులో వరినాట్లు కేవలం 11 శాతమే 

రబీపై నిరాశ... ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి

మొక్కజొన్న రైతుల్ని బెంబేలెత్తిస్తోన్న కత్తెర పురుగు

సాక్షి, హైదరాబాద్‌: రబీ పంటల సాగు విస్తీర్ణం నిరాశాజనకంగా ఉంది. జనవరి వచ్చినా పంటల సాగు విస్తీర్ణం పెరగలేదు. కేవలం మూడో వంతు విస్తీర్ణంలోనే సాగయ్యాయి. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, రబీ సీజన్లో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 10.77 లక్షల (32%) ఎకరాల్లోనే పంటలు సాగు చేశారు. అందులో ఆహార పంటల సాధారణ సాగు విస్తీర్ణం 26.12 లక్షల ఎకరాలు కాగా, కేవలం 7.32 లక్షల (28%) ఎకరాల్లోనే సాగయ్యాయి. ఆహార ధాన్యాల్లో కీలకమైన వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 1.92 లక్షల (11%) ఎకరాల్లోనే సాగు కావడం గమనార్హం. అలాగే మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.25 లక్షల (54%) ఎకరాల్లో సాగైంది. ఇక నూనె గింజల సాగులో కీలకమైన వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.57 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.32 లక్షల (65%) ఎకరాల్లో సాగైంది. ప్రధానంగా వరి నాట్లు పుంజుకోకపోవడంతో వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. సాగునీటి వనరులు లేనిచోట వరికి బదులు ప్రత్యామ్నాయ వర్షాధార పంటలు వేయాలని రైతులకు సూచించింది. అందుకు సంబంధించిన విత్తనాలను సిద్ధం చేయాలని అధికారులను వ్యవసాయ శాఖ ఆదేశించింది.

18 జిల్లాల్లో వర్షాభావం...
ఇక రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 18 జిల్లాల్లో వర్షాభావం నెలకొని ఉందని వ్యవసాయశాఖ తెలిపింది. దీంతో రబీ పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడి ఉధృతమైంది. ప్రధానంగా నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, నిర్మల్, కరీంనగర్, మహబూబాబాద్‌ జిల్లాల్లో మొక్కజొన్నకు కత్తెర పురుగు సోకిందని వ్యవసాయశాఖ తెలిపింది. నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల వ్యవసాయాధికారులను ఆదేశించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top