పబ్‌లు బంద్‌ చేయండి

Pubs should close : anjan kumar - Sakshi

మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌ డిమాండ్‌

సాక్షి ,హైదరాబాద్‌: విదేశీ సంస్కృతి, డ్రగ్స్‌లను అలవాటు చేస్తున్న పబ్‌లను తక్షణమే మూసేయాలని మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని పబ్‌లు, క్లబ్‌లు సగానికి పైగా కేసీఆర్, కేటీఆర్‌ సంబంధీకులవేనని ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. డ్రగ్స్‌ సరఫరా కేంద్రాలుగా పబ్‌లు మారాయన్నారు. టీఆర్‌ఎస్‌ నేతల కనుసన్నల్లోనే పబ్, క్లబ్‌ల నిర్వహణ ఇష్టానుసారంగా కొనసాగుతోందని ఆరోపించారు.

పబ్‌లను మూసివేయకుంటే ఉద్యమం చేపడుతామన్నారు. నాలుగేళ్ల పాలనలో భూ ఆక్రమణ దందా, సారా, పేకాట బంద్‌ చేశామని ఓవైపు కేసీఆర్‌ గొప్పలు చెప్పుకుంటుండగా మరోవైపు అవి యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. పేదలు ఉపశమనం కోసం మద్యం సేవిస్తే నోట్లో పైపులు పెట్టి జరిమానాలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అదే పబ్‌లకు వెళ్లే వారి జోలికి మాత్రం వెళ్లట్లేదని దుయ్యబట్టారు.

పదేళ్లు ఎంపీగా పనిచేసినా తనకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో కనీసం ఐదు సెంట్ల భూమి లేదని, అదే టీఆర్‌ఎస్‌ నేతలకు నాలుగున్నరేళ్లలో కోట్లు విలువ చేసే స్థలాలు, భవన సముదాయాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. పేద ప్రజలు ఉండే గోషామహల్, నాంపల్లిలో ట్రాఫిక్‌ వారు డ్రంకెన్‌ డ్రైవ్‌ పేరిట టెస్టులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అవే పరీక్షలను జూబ్లీహిల్స్‌ ,బంజారాహిల్స్‌లో ఎందుకు నిర్వహించరని ప్రశ్నించారు. రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top