విద్యాసంస్థలు సాంకేతికతకు ఊతమివ్వాలి

President Ram Nath Kovind tells IITH to write script of 21st century - Sakshi

డిగ్రీలు అందించే పరిశ్రమలుగా మిగిలిపోరాదు

ఐఐటీ హైదరాబాద్‌ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి

స్థానిక పరిశోధన సంస్థలతో ఐఐటీ మమేకం  

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు కేవలం బోధించే వ్యాపార సంస్థలుగా, డిగ్రీలు అం దించే పరిశ్రమలుగా మిగిలిపోకూడదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉద్బోధించారు. నూతన ఆవిష్కరణలతోపాటు నిత్య జీవితం లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతికతకు ఊతమిచ్చేలా విద్యాసంస్థలు పనిచేయాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరా బాద్‌ ప్రాంగణంలో ఆదివారం జరిగిన 7వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, నీటిపారుదల, మార్కెటింగ్‌ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అతిథులుగా పాల్గొన్నారు.

రాష్ట్రపతి కోవింద్‌ ప్రసంగిస్తూ అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ తరహాలో హైదరాబాద్‌లోనూ శాస్త్ర, సాంకేతిక విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలకు వాణిజ్య ఆవిష్కరణ రంగాల్లో పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు అనువైన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇలాంటి వాతావరణం ఉన్న హైదరాబాద్‌ పరిసరాల్లో ఐఐటీని ఏర్పాటు చేయడాన్ని కోవింద్‌ స్వాగతించారు.

వైద్య రంగంలో నోబెల్‌ అందుకున్న సర్‌ రోనాల్డ్‌ రాస్‌ 19వ శతాబ్దంలోనే మలేరియా వ్యాధికారక దోమపై హైదరాబాద్‌లోనే పరిశోధనలు జరిపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. స్వాతంత్య్రానంతరం పబ్లిక్, ప్రైవేటు రం గాల్లో పారిశ్రామిక కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ తర్వాతి కాలంలో పరిశోధన కేంద్రంగా కూడా అభివృద్ధి చెందిందన్నారు. బయోటెక్నాలజీ, అణు ఇంధనం, రక్షణ, ఖగోళ పరిశోధన వంటి 19 రంగాలకు సంబంధించి హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతికత, పరిశోధనశాలలు ఉన్నాయన్నారు. ఈ రం గాలన్నింటినీ అనుసంధానించేలా ఐఐటీ హైదరాబాద్‌ కృషి చేయాలన్నారు.

నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా...
ఆరు దశాబ్దాల క్రితం దేశం సృష్టించిన భారీ పారిశ్రామిక పునాదులకే ఆశయాలను పరిమితం చేసుకోవద్దని, 21వ శతాబ్దపు దిశను మార్చే నాలుగో పారిశ్రామిక విప్లవానికి ఐఐటీ హైదరాబాద్‌ సన్నద్ధం కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. పరిశోధనలతోపాటు వాణిజ్యపరమైన ఆలోచనలకు ప్రోత్సాహమిచ్చే వాతావరణం ఐఐటీ హైదరాబాద్‌లో ఉండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. విద్యావంతులైన యువత కోసం దేశంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయన్నారు.

ఏకకాలంలో ఏడో స్నాతకోత్సవంతోపాటు పదో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఐఐటీ హైదరాబాద్‌లో 2,500 మంది విద్యార్థులు ఉండటం, ప్రతి ఐదుగురు విద్యార్థుల్లో ఒకరు మహిళ కావడం అభినందనీయమన్నారు. అత్యుత్తమమైన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాంలతోపాటు ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థుల్లో 30 శాతం మంది పీహెచ్‌డీ అభ్యసించడంపై హర్షం వ్యక్తం చేశారు.

ప్రత్యేక ఆకర్షణగా ‘జకార్డ్‌’..
రాష్ట్రపతితో పాటు అతిథులు, బోధనా సిబ్బంది, విద్యార్థులంతా భూదాన్‌ పోచంపల్లి చేనేత కార్మికులు ఇక్కత్‌ డిజైన్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ‘జకార్డ్‌ చేనేత’వస్త్రాలను ధరించారు. అంతకుముందు రాష్ట్రపతి దంపతులకు మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, ఐఐటీ డైరెక్టర్‌ దేశాయ్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఐఐటీ హైదరాబాద్‌ పాలక మండలి చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేయగా ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ యూబీ దేశాయ్‌ ప్రసంగించారు.

566 మందికి పట్టాలు...
స్నాతకోత్సవం సందర్భంగా బీటెక్, ఎంఎస్, ఎంఫిల్, పీహెచ్‌డీ  కోర్సులు పూర్తి చేసిన 566 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. వారి లో 131 మంది మహిళలున్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులు ఇబ్రహీం దలాల్‌ (బీటెక్‌), పర్మీష్‌ కౌర్‌(ఎమ్మెస్సీ), గ్రీష్మ పీఎం (ఎంటెక్‌), కె.స్నేహారెడ్డి (బీటెక్‌)లకు రాష్ట్రపతి గోల్డ్‌మెడళ్లు అందజేశారు.

రావి మొక్క నాటిన ప్రథమ పౌరుడు
సాక్షి, హైదరాబాద్‌: హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రావి మొక్క నాటారు. ఆయన సతీమణి సవిత కోవింద్‌ రుద్రక్షాంబ మొక్కను, గవర్నర్‌ నరసింహన్‌ పారిజా తం మొక్కను నాటారు. అనంతరం హరితహారం పై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను రాష్ట్రపతి దంపతులు తిలకించారు.

రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు...
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు  గవర్నర్‌  నరసింహన్‌ దంపతులు బేగంపేట విమానాశ్రయంలో ఆదివారం ఘనంగా వీడ్కో లు పలికారు. ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం, మండలిచైర్మన్‌ స్వామిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top