ప్రణయ్‌కి కన్నీటి వీడ్కోలు | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 16 2018 8:25 PM

Pranay Funerals Completed - Sakshi

సాక్షి, మిర్యాలగూడ : కుల అహంకారానికి బలైన పెరుమాళ్ల ప్రణయ్‌కి పట్టణ ప్రజలు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఉక్రెయిన్‌ నుంచి ప్రణయ్‌ సోదరుడు అజయ్‌ వచ్చిన వెంటనే అంతిమయాత్ర ప్రారంభించారు. అంతిమయాత్రలో వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రణయ్‌ భార్య అమృత, కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదవాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య ప్రణయ్‌ భౌతికకాయనికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. క్రైస్తవ సంప్రదాయల ప్రకారం అంత్యక్రియలు జరిగాయి.

ప్రణయ్‌ భార్య అమృత, అతని కుటుంబం సభ్యులు కన్నీటి సాగరంలో మునిగిపోయారు. భర్త మృతదేహాన్ని చూసి అమృత కన్నీరుమున్నీరుగా విలపించింది. మొన్నటి వరకు తనకు అండగా ఉన్న ప్రణయ్ ఇప్పడు విగతజీవిగా ఉండడాన్ని చూసి గుండెలవిసేలా రోదించింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ప్రేమించి పెళ్లాడిన వాడు నూరేళ్లు అండగా ఉంటాడనుకున్న వాడి ఆయుష్షును తండ్రే తీయడంతో అమృత శోకసంద్రంలో మునిగిపోయింది. ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన ప్రణయ్‌ సోదరుడు అజయ్‌.. తన అన్న మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. (చదవండి: జైళ్లోనే చచ్చిపోరా: ప్రణయ్‌ సోదరుడు)

అంతిమ యాత్రకు భారీ బందోబస్తు
పరువు హత్యకు గురైన ప్రణయ్‌ అంతిమయాత్ర పోలీసుల భారీ బందోబస్తు నడుమ నిర్వహించారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. స్థానిక పోలీసులతో పాటు జిల్లా కేంద్రం నుంచి భారీగా పోలీసు బలగాలను రప్పించారు. నల్లగొండ, మిర్యాలగూడ డీఎస్పీలు సుధాకర్, శ్రీనివాస్‌లు ప్రత్యేకంగా పర్యవేక్షించారు.

చదవండి: ప్రణయ్‌ హత్యపై స్పందించిన కేటీఆర్‌

Advertisement
Advertisement