
చార్జీలు పెంచక భారీ నష్టాలు
విద్యుత్ చార్జీలను సవరించకపోవడంతో 2014–15లో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్)కు రూ.1,348.21 కోట్లు నష్టాలు వచ్చాయని కాగ్ పేర్కొంది.
♦ విద్యుత్ సంస్థల పనితీరుపై కాగ్ వెల్లడి
♦ 2014–15లో ఉత్తర డిస్కం నష్టాలు రూ.1,348 కోట్లు
♦ వినియోగదారుల నుంచి రూ.909 కోట్లు అధికంగా వసూళ్లు
♦ రూ.8,237.63 కోట్ల వ్యవసాయ సబ్సిడీలో రూ.1,176.80 కోట్లు నిరుపయోగం
♦ పలు ప్రభుత్వ రంగ సంస్థల అంశాలూ ప్రస్తావన
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీలను సవరించకపోవడంతో 2014–15లో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్)కు రూ.1,348.21 కోట్లు నష్టాలు వచ్చాయని కాగ్ పేర్కొంది. విద్యుత్ చార్జీల పెంపు (వార్షిక టారిఫ్) ప్రతిపాదనలు సమర్పించకపోవడం.. 2013–14కు సంబంధించిన చార్జీలనే 2014–15లోనూ అమలు చేయాల్సి రావడమే దీనికి కారణమని స్పష్టం చేసింది. టీఎస్‌ఎస్పీడీసీఎల్ పనితీరుపై మరిన్ని అంశాలను బహిర్గతం చేసింది.
హా డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా నెట్‌వర్క్ అభివృద్ధికి 2011–16 మధ్య ఈఆర్సీ ఆమోదించిన దాని కన్నా రూ.752.04 కోట్లు తక్కువగా పెట్టుబడులు పెట్టింది.
హా కేవలం 56.25 శాతం వ్యవసాయ కనెక్షన్లను మాత్రమే హెచ్‌వీడీఎస్ పథకం కిందకి మార్పిడి చేసింది. పంపిణీ నష్టాలను తగ్గించుకోలేక ఈ కాలంలో రూ.194.27 కోట్ల నష్టం జరిగింది.
హా నిర్దేశించిన గరిష్ట పరిమితులను అధిగమించి కొన్ని వర్గాల నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయడంతో.. ఆ వర్గాలపై 2011–15 మధ్య రూ.909.37 కోట్ల భారం పడింది. ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలు, ఉద్యోగుల ఖర్చులు, పరిపాలన, సాధారణ ఖర్చులు పెరగడంతో 2013–14లో అధికంగా ఖర్చు చేసిన రూ.98.81 కోట్లను ట్రూఅప్ చార్జీలుగా వసూలు చేసేందుకు ఈఆర్సీ అనుమతి కోరలేదు.
హా 2016 మార్చి 31 నాటికి ప్రభుత్వం/స్థానిక సంస్థల నుంచి రూ.820.89 కోట్ల బిల్లులు, ఇతర వినియోగదారుల నుంచి రూ.249.03 కోట్ల బిల్లులు వసూలు చేసేందుకు చర్యలు ప్రారంభించలేదు.
హా వ్యవసాయ కనెక్షన్లకు ఏడు గంటలకు బదులు.. ఆరు గంటల కన్నా తక్కువగా విద్యుత్ సరఫరా చేయడం వల్ల ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లించిన రూ.8,237.63 కోట్లలో రూ.1,176.80 కోట్లు ఉపయోగపడలేదు.
రూ.50 కోట్ల రాబడికి గండి
ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల ప్రాంగణాల్లో స్థాపించిన ఐటీయేతర వాణిజ్య కార్యకలాపాలైన హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు, ఆస్పత్రులు, బ్యాంకులకు సైతం రాయితీలను వర్తింపజేయడంతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) రూ.50.35 కోట్లు నష్టపోయింది. ఐటీతో సంబంధం లేని పరిశ్రమలకు సైతం రాయితీలను వర్తింపజేయడంతో మరో రూ.10.96 కోట్లు నష్టపోయింది.
కాంట్రాక్టర్‌కు అనుకూలంగా జెన్‌కో
కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) టర్బైన్ జనరేటర్ పనుల్లో లోపాలకు కారణమైన కాంట్రాక్టర్‌పై రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) చర్యలు తీసుకోలేదు. బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ (బీఓపీ) పనుల కాలపరిమితిని కాంట్రాక్టర్‌కు అనుకూలంగా పొడగించడం వల్ల క్రేన్ కొనుగోలు కోసం రూ.2.12 కోట్ల అదనపు వ్యయం చేయాల్సి వచ్చింది.
ఆర్టీసీకి రూ.52.4 లక్షల నష్టం
కాంట్రాక్టర్‌తో ఒప్పందం ప్రకారం బస్సు లపై ప్రకటనల గణన నిర్వహించ కపోవడంతో రూ.52.4 లక్షల లైసెన్స్ ఫీజును తెలంగాణ ఆర్టీసీ నష్టపోయింది.
టీఎస్‌ఐఐసీకి రూ.73.75 కోట్ల నష్టం
ఐటీ పార్కుకు కేటాయించిన 109.36 ఎకరాల్లో 12.15 ఎకరాలను రహేజా గ్రూపు సంస్థ ఐటీయేతర అవసరాలకు బదిలీ చేయడంతో రాష్ట్ర పరిశ్రమల మౌలి క సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ)కి రూ.73.75 కోట్ల నష్టం జరిగింది.
‘సింగరేణి’ కాలువలో రూ.44.14 కోట్లు
గనుల అవసరాల కోసం ఎన్టీఆర్ కాల్వను ఇందిరాసాగర్–రుద్రమకోట ఎత్తిపోతల పథకంతో అనుసంధానం చేసేందుకు 4.76 కి.మీ. బదులు 28 కిలోమీటర్ల మేర నిర్మించడంతో సింగరేణి సంస్థ అంచనాకు మించి రూ.44.14 కోట్ల వ్యయం చేసింది.