అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి

Pochampalli Ikat should bring to international level says Governor Narasimhan - Sakshi

పోచంపల్లి ఇక్కత్‌పై గవర్నర్‌ నరసింహన్‌

హ్యాండ్లూమ్‌ పార్క్, చేనేత గృహాల సందర్శన

భూదాన్‌ పోచంపల్లి/ సంస్థాన్‌ నారాయణపురం: పోచంపల్లి ఇక్కత్‌ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు చేనేత కార్మికులంతా కృషి చేయాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సూచించారు. బుధవారం యాదా ద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి, కనుముక్కుల పరిధిలోని హ్యాండ్లూమ్‌ పార్క్‌ను నరసింహన్‌ దంపతులు సందర్శించారు. మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలు, కార్మికుల జీవన స్థితిగతులు, గిట్టుబాటు ధర గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక టూరిజం పార్క్‌లో కార్మికులు, మాస్టర్‌ వీవర్స్, బ్యాంకర్స్‌తో సమీక్ష నిర్వహించి, ప్రభుత్వ పరంగా ఏమి చేయాలని అడిగారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ, పోచంపల్లి ఇక్కత్‌ కళ ఎంతో అద్భుతంగా ఉందని, ఎంతో కష్టమైన పని అని పేర్కొన్నారు. స్కిల్‌ వర్క్‌ అంటే చేనేత అని కొనియాడారు. చేనేత కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా కావాల్సిన సహాయాన్ని అందజేసేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. మార్కెట్‌కు అనుగుణంగా నూతన డిజైన్లను రూపొందించాలని, తద్వారా అమ్మకాలు పెరగడంతోపాటు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయన్నారు. చేనేత వస్త్రాలను హైదరాబాద్‌ నగరానికి విస్తరిస్తే అందరూ ధరించే వీలు కలుగుతుందని చెప్పారు. అనంతరం చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. జలాల్‌పురంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను సందర్శించి యువతకు అందిస్తున్న స్వయం ఉపాధి కోర్సులను పరిశీలించారు. నైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధి రంగంలో రాణించాలని సూచించారు. గవర్నర్‌ వెంట రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్, కలెక్టర్‌ అనితా రామచంద్రన్, జాయింట్‌ కలెక్టర్‌ రవినాయక్‌ ఉన్నారు.  

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి...  
ప్రభుత్వ విద్య బలోపేతానికి కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సూచించారు. చౌటుప్పల్‌ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, చౌటుప్పల్‌ మండలంలోని మల్కాపురంలోని మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. విద్యార్థులు మేధాశక్తిని పెంపొందించుకోవాలన్నారు. తల్లిదండ్రులు, గురువు దైవంతో సమానమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణపై ఆరా తీశారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్, జాయింట్‌ కలెక్టర్‌ రవినాయక్, ఆర్డీవో సూరజ్‌కుమార్, డీఈవో రోహిణీ, డీఆర్‌డీవో పీడీ వెంకట్రావ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top