ఆదివాసీలను అవమానిస్తారా?

People Protest At Collectorate - Sakshi

హరితహారం పేరుతో గిరిజనుల భూములు లాక్కుంటున్నారు

ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయకపోగా హేళన చేస్తున్నారు

కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో రేణుకాచౌదరి

సాక్షి, కొత్తగూడెం : రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదివాసీలను, ఉద్యమకారులను తీవ్రంగా అవమానిస్తోందని  కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అన్నారు. గురువారం కొత్తగూడెం కలెక్టరేట్‌ వద్ద పీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో ప్రజాసమస్యలపై మహాధర్నా నిర్వహించారు. తొలుత లక్ష్మీదేవిపల్లి మార్కెట్‌ యార్డ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టాలు ఇస్తే కేసీఆర్‌ ప్రభుత్వం ఆ భూములను లాక్కుంటోందని విమర్శించారు. గిరిజన రైతులను అవమానిస్తున్నారని, పోడు భూములకు పట్టాలు అడిగితే కేసీఆర్‌ సొంత ఆస్తిలో వాటా అడుగుతున్నట్లు భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రశ్నించిన రైతులకు ఖమ్మంలో బేడీలు వేసి తీసుకెళ్లడమే ఇందుకు నిదర్శనమన్నారు.

ఇలాంటి పాలన చేస్తున్న కేసీఆర్‌ మగాడేనా అని  ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అని చెబుతున్న కేసీఆర్‌ కుటుంం మాత్రమే బంగారంలా పదవులు అనుభవిస్తోందన్నారు. తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడిన ఉద్యమకారులపై ఇప్పటికీ కేసులు ఎత్తేయకుండా హేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోనియా తెలంగాణ ఇస్తే కేసీఆర్‌ తానే  తెచ్చినట్లు భావించుకుంటున్నారని, కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేస్తూ ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ కుండువాలు కప్పుకున్నవారికి మాత్రమే పథకాలు వర్తింపజేస్తున్నారని అన్నారు. రెండు ట్రాక్టర్లు ఉన్నవారికే మూడో ట్రాక్టరు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసే సమయం ఉంటుంది కానీ.. ప్రజల సమస్యలు తెలుసుకునే తీరిక మాత్రం లేకుండా పోయిందన్నారు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నాయకులు దిరిశాల భద్రయ్య, గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, మల్లు రమేష్, రాయల నాగేశ్వరరావు, మాలోత్‌ రాందాస్‌నాయక్, లకావత్‌ గిరిబాబు, హరిప్రియ, బాణోత్‌ పద్మావతి, లెనిన్, ధనుంజయ్‌నాయక్, ఏసుపాదం, దీపక్‌చౌదరి, సత్యనారాయణ చౌదరి, చెన్నకేశవరావు, దేవ్లానాయక్, ఓంప్రకాష్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top