బతుకునివ్వండి | Sakshi
Sakshi News home page

బతుకునివ్వండి

Published Fri, Apr 17 2015 10:51 AM

బతుకునివ్వండి

ఇరవై ఒక్కేళ్ల కుర్రాడు... తండ్రికి పనుల్లో సాయం చేస్తూ, తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ, చెల్లెలికి అండగా నిలబడాల్సిన వయసులో ఆ యువకుడు ఇంటి నుంచి కదల్లేకపోతున్నాడు. వైద్యం చేయించే స్థోమత లేక కన్నీరు పెట్టుకుంటున్న తల్లిదండ్రులను చూసి తల్లడిల్లిపోతున్నాడు. ఒంటికి వచ్చిన జబ్బు ఏదో కూడా తెలీక, దానికి చికిత్స చేయించడానికి డబ్బుల్లేక రోజూ నరకం చూస్తున్నాడు. కన్నబిడ్డ బాధను చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు పెట్టని రోజు లేదు. బిడ్డను బతికించుకోవడానికి వారు కాసింత సాయం కోరుతున్నారు. మరికాసింత ధైర్యం కోరుతున్నారు.

విజయనగరం(మాదంబట్లవలస): హుషారుగా ఆడుతూ పాడుతూ, తల్లిదండ్రులకు సాయం చేయాల్సిన ఆ యువకుడు అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాడు. కుమారునికి వచ్చిన అనారోగ్యాన్ని బాగుచేసేందుకు ఆ తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ అప్పులపాలవుతున్నారు. తెర్లాం మండలంలోని పాములవలస పంచాయతీ పరిధిలోని మాదంబట్లవలస గ్రామానికి చెందిన గంట ఆదినారాయణ, తవుడమ్మలకు వెంకటరమణ, చిన్నమ్మి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటరమణ(21) ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పదో తరగతి పాసైన తర్వాత వెంకటరమణ ఆరోగ్య సమస్యలతో పై చదువులు చదవలేకపోయాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులు వెంకటరమణను ఆస్పత్రుల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. ఒక్కో ఆస్పత్రిలో ఒక్కోలా చెబుతుండడంతో ఇంతవరకు వెంకటరమణకు సరైన వైద్యం అందలేదు. ఇప్పటివరకు వెంకటరమణను తల్లిదండ్రులు తాము కూడబెట్టిన కూలి డబ్బులతో శ్రీకాకుళం జిల్లా రాజాంలోని కేర్ ఆస్పత్రికి, శ్రీకాకుళం కిమ్స్ ఆస్పత్రికి, విశాఖలోని కేజీహెచ్, మణిపాల్ తదితర ఆస్పత్రులకు తీసుకువెళ్లారు. అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించినప్పటికీ వెంకటరమణకు వచ్చినది ఏ రోగమో గుర్తించలేదు.

వైద్యం కోసం వెళ్లిన ప్రతి సారీ రక్తం ఎక్కించాలని వైద్యులు చెప్పడంతో తండ్రి ఆదినారాయణ తన రక్తాన్ని కుమారునికి ఇవ్వడం, వేరే వ్యక్తుల నుంచి రక్తం కొనడం చేస్తూ వస్తున్నారు. ఒక్కో ఆస్పత్రిలో ఒక్కో వ్యాధి అని చెప్పి వైద్యసేవలు అందించేవారని వెంకటరమణ తల్లిదండ్రులు తెలిపారు. వెంకటరమణకు టీబీ అని, క్యాన్సర్ అని, ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయని వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుతం తమ బిడ్డ ఏమీ తినలేకపోతున్నాడని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. వెంకటరమణ చెల్లి చిన్నమ్మి ఇంటర్ చదువుకుంది. అన్నయ్యకు వచ్చిన అనారోగ్యాన్ని చూచి ఆమె పూర్తిగా కుంగిపోతోంది. వెంకటరమణకు వైద్యం చేయించేందుకు తమ ఆర్థిక స్థోమత సరిపోవడం లేదని, అందినంత వరకు అప్పులు చేసి ఇంతవరకు కుమారునికి వైద్యసేవలు అందించామని వెంకటమరణ తల్లిదండ్రులు అంటున్నారు. తమ కుమారుడిని బతికించుకోవడానికి దాతలు సాయం చేయాలని కోరుతున్నారు. దాతలు అందించే సాయమే తమ ఇంటి దీపాన్ని కాపాడుతుందని అంటున్నారు.
- (తెర్లాం రూరల్)

Advertisement
Advertisement