వద్దంటే వింటారా... పిండుడు మానుతారా..! 

Parents Getting Worried About School Fees In Telangana - Sakshi

ప్రైవేటు పాఠశాలల ఫీ‘జులుం’పై తల్లిదండ్రుల గగ్గోలు

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ చెల్లించాలని లేఖలు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్లో ఇప్పటివరకు ఆరో తరగతి చదివిన విద్యార్థి వార్షిక ఫీజు రూ.1,72,650. ఇప్పుడు అదే విద్యార్థి 7వ తరగతికి వచ్చాడు. అతనికి పాఠశాల యాజమాన్యం నిర్ణయించిన వార్షిక ఫీజు రూ. 2,20,170. ...అంటే అదనంగా 47,520 పెంచారు. దాదాపు 27%పెరిగిందన్నమాట. అదనంగా కన్వేయన్స్‌ చార్జీలు 50,400.  లంచ్‌ చార్జీలు రూ. 32వేలు అంటూ.. సదరు యాజమాన్యం ఆన్‌లైన్‌లోనే తల్లిదండ్రులకు అప్‌డేట్‌ చేసింది. ఇక హైదరాబాద్‌ నగరంలోని మరో ప్రైవేటు స్కూల్లో 8వ తరగతి విద్యార్థి ఫీజు రూ. 42 వేలు. ఆ విద్యార్థి 9వ తరగతికి వచ్చాడు. అతనికి నిర్ణయించిన ఫీజు రూ.47 వేలు. అంటే రూ.5 వేలు (10 శాతానికి పైగా) పెంచేశారు. ఇవే కాదు.. కార్పొరేట్‌ స్కూళ్లు కూడా 15 శాతం ఫీజు పెంచుతామని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి.

రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్, ఇంటర్నేషనల్‌ స్కూళ్లు ఫీజు దోపిడీకి ఏర్పాట్లు సన్నద్ధమయ్యాయి. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి మానసికంగా సిద్ధం చేస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం ఫీజులను పెంచవద్దని స్పష్టం చేసినా యాజమాన్యాలు మాత్రం పెడచెవిన పెడుతున్నాయి. కరోనా నేపథ్యంలో స్కూల్‌ ఫీజులను పెంచడానికి వీల్లేదని, కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే, అదీ నెలవారీగా తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంగా చెప్పినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.సీఎం ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినా బేఖా తరు చేసి స్కూళ్లు తెరవగానే పెంచిన ఫీజులను దండుకునేందుకు సిద్ధం అయ్యాయి.

రెండేళ్లుగా వద్దంటున్నా పట్టింపేదీ 
రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను పెంచవద్దని ప్రభు త్వం రెండేళ్లుగా చెబుతూనే ఉంది. ఫీజుల నియంత్రణ చర్యలపై మాజీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ తిరుపతి రావు నేతృత్వంలో ప్రభుత్వం 2017 మార్చిలో ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఆ కమిటీ 2018లో నివేదికను అందజేసింది. అందులో పాఠశాలలు ఏటా 10% వరకు ఫీజులను పెంచుకోవచ్చని సిఫారసు ఉండటంతో ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టింది. 2018–19లో పాఠశాలలు ఫీజులను పెంచవద్దని ప్రభుత్వం స్పష్టం చేసినా యాజమాన్యాలు వినిపించుకోలేదు. ఫీజుల నియంత్రణ నివేదిక ప్రభుత్వం పరిశీలనలో ఉందని, దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అందుకే 2019–20 విద్యా ఏడాదిలో ఫీజులను పెంచవద్దని అప్పటి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య జీవో జారీ చేశారు. అయినా యాజమాన్యాలు తల్లిదండ్రులపై భారం మోపాయి. కొద్దిగా పేరున్న స్కూళ్లనుంచి టాప్‌ స్కూళ్లలో అధిక మొత్తం ఫీజులను పెంచేశాయి. దీనిపై హైదరాబాద్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామ్‌చంద్రన్‌కు ఫిర్యాదు చేశారు.

సగం స్కూళ్లలో ఫీజు పెంపు
రాష్ట్రంలో 10,549 ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిల్లో 31,21539 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ప్రైవేటు స్కూళ్లలో సగం వరకు సాధారణ పాఠశాలలు ఉండగా, మిగతా వాటిలో సగం వరకు మధ్య తరహా పాఠశాలలే. మిగతా వాటిల్లో టాప్, కార్పొరేట్, ఇంటర్నేషనల్‌ స్కూళ్లు ఉన్నాయి. ప్రస్తుతం సాధారణ పాఠశాలల్లో పెద్దగా ఫీజుల పెంపు అంశం రాకపోగా, మిగతా వాటిల్లోనే చాలావరకు పెంచుతూ యాజమాన్యాలు నిర్ణయాలు తీసుకున్నాయి. పాఠశాల స్థాయిని బట్టి 10 శాతం నుంచి 28 శాతం వరకు ఫీజులను పెంచేశాయి. ట్యూషన్‌ ఫీజులే కాదు ఇతరత్రా ఫీజులనూ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల తల్లిదండ్రులు మండి పడుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top