
త్రిపురారం: కేసీఆర్ రాష్ట్రంలో దోచుకున్న డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చారని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, గడిచిన నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓ కార్పొరేషన్ లాగా రాష్ట్రాన్నంతా దోచుకుందని అన్నారు. ప్రభుత్వం దోచుకున్న రూ.1500 కోట్ల నుంచి రూ. 2 వేల కోట్లను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఖర్చు చేసిందని, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలు ఒక సారి ఆలోచించాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ధాన్యానికి మద్దతు ధర రూ.1500 చేసిందని, అటవీ హక్కుల చట్టం ద్వారా రాష్ట్రంలోని గిరిజనులకు 10 లక్షల ఎకరాలను పంపిణీ చేసిందని గుర్తు చేశారు. ‘కేసీఆర్ ఏదో పదవిని జానారెడ్డికి ఇస్తడు అని ఎవరో అన్నారని, అసలు కేసీఆర్‌కు పదవి ఇచ్చిందే జానారెడ్డి’అని అన్నారు. కేసీఆర్ దగ్గర పుచ్చుకునే వ్యక్తి జానారెడ్డి కాదని కార్యకర్తలు, యువకులు అర్థం చేసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వయసు రీత్యా విశ్రాంతి తీసుకుంటానని, అంతే తప్ప పనికిమాలిన పదవులు తీసుకునే మనిషిని కాదని చెప్పారు.