సీఎంకు ఉస్మానియా విద్యార్థుల బహిరంగ లేఖ

An open letter of students from Osmania to cm - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెంచల్‌ గూడ జైలు నుంచి అండర్‌ ట్రయల్‌ ఖైదీలుగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 4న తమను అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని, అమానవీయమని, నియంతృత్వమని లేఖలో పేర్కొన్నారు. బహిరంగ లేఖ సారాంశం.....మీ(సీఎం కేసీఆర్‌) నియోజకవర్గం పరిధిలోని దౌలాపూర్‌ గ్రామానికి చెందిన మురళీ ముదిరాజ్‌ ఎంఎస్సీ ఫిజిక్స్‌ చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు.

ఉద్యోగం రాకపోయే సరికి నిరాశా నిస్పృహలతో డిసెంబర్‌ 3న మురళి ఆత్మహత్య చేసుకున్నాడు. మోసపోయిన లక్షలాది మంది నిరుద్యోగ యువకుల్లో మీ ప్రభుత్వ పాలనపట్ల గూడుకట్టుకున్న అసహనానికి నిలువెత్తు నిదర్శనం మురళీ ముదిరాజ్‌ ఆత్మహత్య. దీంతో ఉస్మానియా విద్యార్థులమైన మేము ఆ పేద బీసీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనే సదుద్దేశంతో రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలనే డిమాండ్‌తో శాంతియుతంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించకపోవడం శోచనీయం.

టీఆర్‌ఎస్‌ నాయకులు, పోలీసుల బెదిరింపుల వల్ల భయపడ్డ ఆ బాధిత కుటుంబం మురళీ శవాన్ని అప్పగించాలని ఉస్మానియా విద్యార్థులను వేడుకుంది. శవాన్ని తరలించేందుకు శాంతియుతంగా సహకరించే సమయంలో పోలీసులు అత్యుత్సాహం చూపినా సంయమనం పాటించాం. మురళీ మృతదేహాన్ని హాస్టల్‌ నుంచి తరలించిన తర్వాత పోలీసుల అకృత్యానికి అంతే లేకుండా పోయింది. హాస్టల్‌ రూం తలుపులు బద్దలు కొట్టి విచక్షణా రహితంగా భౌతిక దాడులకు దిగారు.

నాలుగో తేదీ తెల్లవారు జామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు వివిధ పోలీస్‌స్టేషన్లలో తిప్పి వివిధ సెక్షన్ల కింద నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టి జైలుకు తరలించారు. కనీసం జడ్జి మందు ప్రవేశపెట్టకుండా ఇన్ని అక్రమ కేసులు బనాయించి చెంచల్‌ గూడ జైలుకు తరలించారు. మేమేం నేరం చేశామని ఇన్ని క్రిమినల్‌ కేసులు బనాయించారని ప్రశ్నించారు. పేద బీసీ కుటుంబానికి న్యాయం జరగాలని పోలీసులకు సహకరించినందుకా? లేక లక్ష ఉద్యోగాలు అడిగిందుకేనా ఈ శిక్షా అని సూటిగా అడిగారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top