చెరువుల ఎంపికకు కసరత్తు | officers busy for selection of pond restoration | Sakshi
Sakshi News home page

చెరువుల ఎంపికకు కసరత్తు

Nov 7 2014 11:52 PM | Updated on Jun 4 2019 5:04 PM

చెరువుల పునరుద్ధరణ లో భాగంగా మొదటి విడత ఎంపిక కోసం....

 నర్సాపూర్ : చెరువుల పునరుద్ధరణ లో భాగంగా మొదటి విడత ఎంపిక కోసం అధికారులు కసరత్తును ప్రారంభించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో సాగు నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్, అటవీ శాఖలకు చెందిన చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు మొత్తం 1,612 ఉండగా వాటిలో 1,182 చెరువులు, కుంటలు సాగునీటి పారుదల శాఖకు చెందినవిగా రికార్డులు పేర్కొంటున్నాయి.

సాగు నీటిపారుదల శాఖకు చెందిన చెరువులు, కుంటల్లో 20 శాతం చెరువులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించగా అందులో భాగంగా ఆరు మండలాలకు చెందిన సుమారు 259 చెరువులను మొదటి సంవత్సరం పునరుద్ధరించాలని నిర్ణయించి అందులో మొదటి విడత కోసం 60 చెరువులు ఎంపిక చేయనున్నారు.

 ఏ మండలంలో ఎన్ని చెరువులంటే..
 నియోజకవర్గంలోని నర్సాపూర్ మండలంలో 39 చెరువులు, హత్నూరలో 57, కౌడిపల్లిలో 55, శివ్వంపేటలో 48, కొల్చారంలో 20, వెల్దుర్తి మండలంలో 40 చెరువులు, కుంటలను ఎంపిక చేస్తారు. కాగా వీటిలో మొదటి దశ కింద మండలానికి పది చెరువులు, కుంటలను కలిపి పునరుద్ధరణ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి నేతృత్వంలో సాగునీటి పారుదల శాఖ అధికారులు ఎంపిక చేయనున్నారు.

 సంపూర్ణంగా మరమ్మతులు
 పునరుద్ధరణ కింద ఎంపిక చేసిన చెరువులు, కుంటలను సంపూర్ణంగా మరమ్మతులు చేపడతారు. చెరువులు, కుంటల్లో పూడికను తీసి మట్టిని రైతులకు అందజేస్తారు. మట్టిని ప్రభుత్వ ఖర్చులతో వాహనాల్లో నింపితే రైతులు తమ ఖర్చులతో తమ తమ పొలాల్లోకి తరలించుకోవాల్సి ఉంటుంది. కాగా చెరువుల కట్టలను వెడల్పు, అలుగులు, తూములను మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైతే పునర్నిర్మాణం పనులు చేపడతారు. చెరువుల మరమ్మతులకు అంచనాల నివేదికల ఆధారంగా నిధులు కేటాయించనున్నారు.

 డిసెంబర్‌లో పునరుద్ధరణ పనులు
 చెరువుల పునరుద్ధరణ పనులను డిసెంబరు మొదటి వారంలో ప్రారంభించాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో అందుకు ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి అంచనాలను స్థానిక అధికారులు సిద్ధం చేయగానే ఉన్నతాధికారులు టెండర్లు పిలిచి పనులను చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement