నీళ్లు లేవు.. మీ పిల్లల్ని తీసుకెళ్లండి

No Water In Kasturba Gandhi Girls Hostel - Sakshi

‘‘పాఠశాలలో నీళ్లు లేవు.. మీ అమ్మాయి ఇబ్బందులకు గురవుతోంది. స్కూల్‌కు వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లండి. మళ్లీ నీటి పునరుద్ధరణ జరిగిన అనంతరం ఫోన్‌ చేస్తాం. అప్పుడు తీసుకురండి’’ అంటూ కస్తూర్బాగాంధీ పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌ చెబుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు పాఠశాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ పిల్లల్ని తీసుకెళ్తున్నారు. ఈ పరిస్థితి మోమిన్‌పేట మండలం చంద్రాయన్‌పల్లిలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఉంది.

మోమిన్‌పేట: నెల రోజులుగా తాగునీరు, వినియోగించడానికి నీరు లేక విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు, నాలుగు రోజులకోమారు స్నానాలు చేస్తుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. స్వయంగా ఉపాధ్యాయులే విద్యార్థినిల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి పిల్లలను కొన్ని రోజులు ఇంటికి తీసుకెళ్లమని పురమాయిస్తున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే తెలుస్తోంది.

గ్రామానికి దూరంగా అడవిలో ఉన్న పాఠశాల కావడం నీరు లేక వ్యక్తిగత పనులకు ఆరు బయటకు వెళ్తున్నారు. రాత్రివేళ బహిర్భూమికి వెళ్లేందుకు విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ దెబ్బకు విద్యార్థులు పాఠశాలను వీడుతున్నారు. పాఠశాల ఖాళీ అవుతున్నా ఉన్నతాధికారులు నెల రోజులుగా పట్టించుకోకపోవడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సమస్య ఇది.. 

మోమిన్‌పేట మండలంలోని చంద్రాయన్‌పల్లి గ్రామంలో ఉన్న కస్తూర్బాగాంధీ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 240 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. 11 మంది ఉపాధ్యాయులు, 8 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ పాఠశాల అంతటికి ఒకటే బోరు బావి ఉంది. గత ఏప్రిల్‌ వరకు బోరుబావిలో బాగానే వచ్చిన నీరు అకస్మాత్తుగా రావడం లేదు. జూన్‌లో పాఠశాల పునఃప్రారంభం కాగానే బోరులో ఉన్న మోటారు పని చేయడం లేదు.

కొత్తగా ఇంకో మోటారు బిగిస్తే గంటకు 2 బిందెల నీరు కూడా రావడం లేదు. బోరుబావి అడుగున కూలిపోవడంతో నీటికి కటకట ఏర్పడింది. తిరిగి ఫ్లషింగ్‌ లేదా కొత్త బోరు వి తవ్వించాలి. నెల గడుస్తున్నా చర్యలు ఏవి తీసుకోకపోవడంతో విద్యార్థినుల బాధలు చెప్పలేనివి. పాఠశాల ఇన్‌చార్జి ప్రత్యేకాధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చలనం లేదు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థుల కష్టం చూడలేక వారి తల్లిదండ్రులకు ఫోన్‌ చేశారు.

మీ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లండి.. ఇక్కడ నీటి సమస్య ఉందని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు వచ్చి విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వారంలో పాఠశాల పూర్తిగా ఖాళీ కావడం ఖాయంగా తెలుస్తోంది. అయితే దీనిపై విద్యార్థినిల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాగే కొనసాగితే పదో తరగతి విద్యార్థినిల సంగతేమిని ప్రశ్నిస్తున్నారు. సమస్య వెంటనే పరిష్కరించి విద్యార్థులకు సక్రమంగా బోధన కొనసాగేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top