కొత్త వీసీ వచ్చేనా?

No Vice Chancellor In IIIT Basara In Nirmal - Sakshi

సాక్షి, భైంసా(నిర్మల్‌) : రాష్ట్రవ్యాప్తంగా 10 యూనివర్సిటీలకు వీసీ(వైస్‌చాన్స్‌లర్‌)లను నియమించేందుకు విద్యా శాఖ కసరత్తు ఆరంభించింది. ఈ నేపథ్యంలో నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీకి రెగ్యూలర్‌ వీసీ నియమిస్తారని ఇక్కడ చదివే విద్యార్థులు ఆశిస్తున్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ పదవీకాలం గతనెలలో ముగిసింది. మరో ఏడు యూనివర్సిటీల్లోనూ వీసీల పదవీకాలం ముగియనుంది.

ఈ నేపథ్యంలో కొత్త వీసీ ల నియామకంపై విద్యాశాఖ కసరత్తు ఆరంభించి ప్రభు త్వం ముందుంచింది. శాతవాహన యూనివర్సిటీతో పాటు బాసరలోని ట్రిపుల్‌ఐటీకి ఇప్పటి వరకు వీసీలనే నియమించలేదు. కొత్తగా వీసీల నియామకం కోసం అర్హులైన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఈ సమయంలో బాసరకు రెగ్యూలర్‌ వీసీ నియమిస్తారని అంతా ఎదురుచూస్తున్నారు.  

ఇప్పటికీ ఇన్‌చార్జీనే.. 
తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ బాసర ట్రిపుల్‌ఐటీ ఇన్‌చార్జి వీసీగా కొనసాగుతున్నారు. గత ఐదున్నరేళ్లుగా ట్రిపుల్‌ఐటీ ఇన్‌చార్జి వీసీలతోనే నెట్టుకొస్తున్నారు. శాశ్వతంగా బాసర ట్రిపుల్‌ఐటీకి వీసీ నియమించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌కు ఇడుపులపాయ, నూజివీడు, తెలంగాణకు బాసర ట్రిపుల్‌ఐటీలు దక్కాయి. ప్రత్యేక విద్యాలయాలు కావడంతో ప్రభు త్వం విశ్వవిద్యాలయాలకు హోదా కల్పించి విద్యాలయ ప్రగతికి పాలనాపరంగా అడ్డంకులు ఉండకూడదని స్వయం ప్రతిపత్తి కల్పించారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటికీ ఇక్కడ రెగ్యూలర్‌ వీసీ నియమించలేదు. గతంలో ఉస్మానియా వీసీగా పనిచేసిన సత్యనారాయణను ఇన్‌చార్జీగా నియమించారు. మూడేళ్లపాటు ఆయన పనిచేసిన అనంతరం ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌కు వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వీసీగా అశోక్‌ బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ రెగ్యూలర్‌ వీసీ నియాయమకంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.

ఏళ్లుగా బాసర ట్రిపుల్‌ఐటీకి వీసీ నియామకం జరగకపోవడంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బాధ్యతలు స్వీకరించిన వారు పూర్తిస్థాయి వీసీ కాకపోవడంతో పరిమితులకు లోబడి పనిచేస్తున్నారు. విద్యాలయాల నిర్వహణను పర్యవేక్షించే గవర్నింగ్‌ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిళ్ల పరిధిలోనే తన నిర్ణయాలను అమలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఐదేళ్లుగా ఇన్‌చార్జి వీసీతోనే విద్యాలయ నిర్వహణ కొనసాగుతోంది. 

సాధించిన కొలువులు... 
2008లో ప్రారంభమైన బాసర ట్రిపుల్‌ఐటీలో ఎంతో మంది పేద విద్యార్థులు కొలువులు సాధించారు. ఆరేళ్ల ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు 2014 నుంచి చేపట్టిన ప్రాంగణ నియామకాల్లో కొలువులు సాధించారు. 2014లో 309 మంది విద్యార్థులు 2015లో 336 మంది, 2016లో 478 మంది, 2017లో 362 మంది, 2018లో ఇప్పటి వరకు 282 మంది విద్యార్థులు కొలువులు సాధించారు. ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన విద్యార్థులు వార్షికవేతనం రూ. 12లక్షల నుంచి రూ.16 లక్షల వరకు పొందుతున్నారు.  

ఏటా ప్రవేశాలు... 
గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యను అందించే దిశగా పదో తరగతి ఉత్తీర్ణత కాగానే ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జీపీఏ కేటగిరీ వారీగా సీట్లను కేటాయిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, మండలాలు, జిల్లాలు, రిజర్వేషన్‌ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి కౌన్సెలింగ్‌కు ఆహ్వానిస్తారు. ఏటా కౌన్సెలింగ్‌లో హాజరైన విద్యార్థులు ప్రవేశాలు పొంది కళాశాలలో ఆరేళ్ల సమీకృత విద్యను అభ్యసిస్తున్నారు.

ఇక్కడి విద్యావిధానం, వసతులు ప్రారంభంలో బడ్జెట్‌ తదితర విషయాలను పరిశీలించేందుకు 2018లో ప్రభుత్వం అప్పటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ట్రిపుల్‌ఐటీని సందర్శించారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్న విషయాన్ని గుర్తించి రాష్ట్రంలో మరో మూడు చోట్ల ట్రిపుల్‌ ఐటీలను ప్రారంభించేందుకు ప్రభుత్వం దృష్టిపెట్టింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top